
స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ సురేందర్‌రావు, తహశీల్దార్ అశోక్‌చక్రవర్తి
- డాక్యుమెంట్లను డీఎస్పీకి అందజేసిన తహశీల్దార్
రుద్రంపూర్: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 11వ వార్డు సమీపంలోని సర్వే నంబర్ 20లో 70.30 ఎకరాల స్థలాన్ని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు కేటాయిస్తూ తహశీల్దార్ అశోక్‌చక్రవర్తి డీఎస్పీ బి.సురేందర్‌రావుకు డాక్యుమెంట్లు అందజేశారు. సంబంధిత స్థలాన్ని డీఎస్పీ బుధవారం పరిశీలించారు. ఈ స్థలం యాంటి నక్సల్ స్క్వాడ్ క్యాంప్‌తో పాటు రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ చుట్టూ ఉన్న పొలాలు, కాలనీ దారి, సమ్మక్క–సారలమ్మ గద్దెలను సందర్శించారు. సర్వేయర్, తహశీల్దార్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ స్థలానికి తూర్పున నాగయ్యగడ్డ, పడమర సమ్మక్క–సారలమ్మ గద్దెలు, అంబేద్కర్ కాలనీ, దక్షిణం: గరీబ్‌పేటకు వెళ్లే రోడ్డు, ఉత్తరం వనందాస్ గడ్డ, చిట్టిరామవరం పొలాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థలంలో ఎవరివైనా పంట పొలాలు ఉంటే తమకు చూపించాలని, డాక్యుమెంట్లను పరిశీలించిన పిదప వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని తహశీల్దార్, డీఎస్పీ సూచించారు. ఈ ట్రైనింగ్ సెంటర్లో సుమారు 2000 మంది వరకు ఉద్యోగులు ఉండే అవకాశం ఉందన్నారు. చుట్టుపక్కల మరికొన్ని కార్యాలయాలు వస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. డీఎస్పీ, తహశీల్దార్ వెంట టూ టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, వార్డు కౌన్సిలర్లు పాటి మోహన్‌రావు, మోరే భాస్కర్, గరీబ్‌పేట సర్పంచ్ బాణోత్ రాములు, ఆర్‌ఐ భవాని, సర్వేయర్ పవన్‌కుమార్ పాల్గొన్నారు.