బండ్లమోటు... ఒకప్పుడు మినీ విశాఖపట్నంగా పేరుండేది. సుమారు 500 ఎకరాల్లో 600 మంది ఉద్యోగులతో నెలకొల్పిన హిందూస్థాన్ జింక్ ఫ్యాక్టరీ ఉజ్వలంగా వెలుగొందుతూ నిత్యం కళకళలాడుతూ ఉండేది. భారతదేశంలో రాజస్థాన్ తర్వాత అపారమైన సీసపు గనులున్న ఈ ప్రాంతంలో హిందూస్థాన్ కంపెనీ వారు అటవీ భూమిని లీజుకు తీసుకుని జింక్ ఫ్యాక్టరీ పెట్టారు. అయితే ఉత్పత్తి వ్యయం ఎక్కువై ధర గిట్టుబాటు కాక నష్టాలు రావడంతో పదేళ్ల కిందట ఫ్యాక్టరీని మూసివేశారు. దీంతో ఆ ప్రాంతంలో హడావుడి అంతా ఒక్కసారిగా అదృశ్యమై కళావిహీనంగా మారింది. నూతన రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ, పరిశ్రమలు గానీ పెట్టడానికి ఈ ప్రాంతం అనువైనది.
వినుకొండ/బొల్లాపల్లి, న్యూస్‌లైన్: ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణంతో మినీ వైజాగ్‌గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం పదేళ్లుగా కళావిహీనంగా మారింది. నూతన రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో మళ్లీ ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సుమారు 500 ఎకరాలతో, అన్ని వసతులున్న ఈ అటవీ ప్రాంతంలో ఏదేని కేంద్ర ప్రభుత్వ సంస్థ గాని, లేదా పరిశ్రమ గాని ఏర్పాటుచేస్తే బండ్లమోటుకు పూర్వ వైభవం వస్తుందని వారు ఆకాంక్షిస్తున్నారు. భారత ప్రభుత్వ రంగ ఉద్యోగులతో గతంలో ఒక వెలుగు వెలిగి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంతం పలు ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అనువైనదిగా భావిస్తున్నారు. గతంలో పోలీసు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.
నూతన రాష్ట్రం ఆవిర్భావం జరగనుండడంతో పలు ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు జిల్లాలో అనువైన ప్రాంతాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. అధిక విస్తీర్ణం కలిగి ఉన్న భూములతో పాటు అన్ని రకాల వనరులు ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గంలోని బండ్లమోటు ప్రాంతం ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. కళ తప్పిన బండ్లమోటుకు ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుతో పూర్వ వైభవం రానుందని, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు.
భారతదేశ చిత్రపటంలో బండ్లమోటుకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో రాజస్థాన్ తర్వాత సీసపు గనులున్న ప్రాంతం ఇదే. దీనిని గుర్తించి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన హిందూస్థాన్ కంపెనీ ఇక్కడ అటవీ భూమిని లీజుకు తీసుకుని జింక్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. మండల కేంద్రమైన బొల్లాపల్లికి కూతవేటు దూరంలో ఉన్న బండ్లమోటులో 517 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన హిందూస్థాన్ జింక్ లిమిటెడ్‌లో 600 మంది ఉద్యోగులు పని చేసేవారు. వీరికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి.
సమీపంలోని మూగచింతలపాలెం గ్రామం వద్ద ఉన్న నాగార్జున సాగర్ ప్రధాన కాల్వ డీప్ కట్ నుంచి నేరుగా మంచినీటి పైపులైను ఏర్పాటు చేశారు. దీంతో సమృద్ధిగా నీటి సరఫరా జరిగేది. అన్ని హంగులతో కూడిన క్వార్టర్స్, అధికారులకు అతిథి గృహాలు, బ్యాంకులు ఇలా అన్ని సౌకర్యాలతో ఉన్న ఈ ప్రాంతాన్ని అప్పట్లో మినీ విశాఖపట్నంగా పిలిచేవారు. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండడంతో ప్రభుత్వం ఇక్కడ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ సంస్థ నష్టాల బారిన పడడంతో పదేళ్ల క్రితం మూసివేశారు.
అటవీప్రాంతం అంతర్భాగంలో ఉన్న హెచ్‌జడ్‌ఎల్‌కు అటవీశాఖ నుంచి లీజు సమయం ఉన్నప్పటికీ పదేళ్లు ముందుగానే మూసివేశారు. ఈ సంస్థ వినియోగంలో ఉన్న సమయంలో దూరప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చేవారు. ఇక్కడ సీసం ముడిపదార్ధాన్ని వెలికితీసి దానిని శుద్ధి చేసి విశాఖపట్నంకు తరలించి, అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేయవలసి వచ్చేది. ఇక్కడ నుంచి రవాణా ఖర్చు తడిసి మోపెడై ఉత్పత్తి వ్యయం ఎక్కువవడంతో ధర గిట్టుబాటు కాక నష్టాలు రావడంతో ఫ్యాక్టరీని మూసివేశారు. ఫ్యాక్టరీ మూసివేసిన అనంతరం ఇక్కడ చడీచప్పుడు లేక నిర్మానుష్యగా మారిపోయింది. దీంతో పీపుల్స్‌వార్ నక్సలైట్లు అప్పట్లో బండ్లమోటు పోలీస్‌స్టేషన్‌ను పేల్చివేశారు.
ప్రస్తుతం నూతన రాష్ట్రం ఏర్పాటుకానున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కానీ, పరిశ్రమల ఏర్పాటుకు కానీ ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ అటవీ భూములతో పాటు రెవెన్యూ భూముల ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. నీటి వనరులతో రవాణా సౌకర్యం, భూముల ధరలు తక్కువగా ఉండడం వలన గిరిజన విద్యాసంస్థలు, యూనివర్సిటీ, ఐఐటీ, పరిశోధన సంస్థలు, పోలీసు అకాడమీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇక్కడ ఏదో ఒక సంస్థగాని, పరిశ్రమ గాని ఏర్పాటుచేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వలసలను నివారించవచ్చు. ఇందుకు పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బండ్లమోటుకు పూర్వవైభవం..?
Published Thu, May 29 2014 11:44 PM | Last Updated on Tue, Aug 21 2018 8:16 PM
Advertisement
Advertisement