సాక్షి, హైదరాబాద్: రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న మాఫియాను ఉపేక్షించవద్దని, వారిపై పీడీ యాక్ట్‌లాంటి కేసులతో ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నకిలీ విత్తన మాఫియాను అరికట్టేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, అక్రమంగా రవాణా చేసేవారిని, విక్రయదారులను ఏమాత్రం ఉపేక్షించకూడదని, వారికి కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నకిలీ విత్తనాల కేసుల్లో 13 పీడీ యాక్ట్ కేసులు పెట్టామన్నారు.
నకిలీ విత్తనాల ఉత్పత్తి, రవాణాను గుర్తించేందుకు క్షేత్రస్థాయి అధికారులు నిరంతర నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తన కార్యకలాపాల్లో పాలుపంచుకున్న నిందితులపై పోలీసు ఠాణాల వారీగా రౌడీషీట్ తెరవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇలాంటి కార్యకలాపాలకు ఊతమిస్తోన్న వ్యక్తులను, తయారీదారులను, రవాణా చేసేవారిని, డిస్ట్రిబ్యూటర్లను, విక్రయదారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిందితులందరి డేటాబేస్‌లను ప్రత్యేకంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖతో కలిసి పోలీసులు చేస్తోన్న దాడులపై ఏరోజుకారోజు ఎస్పీలు/ కమిషనర్లు పంపిన నివేదికను తాను స్వయం గా సమీక్షిస్తానని డీజీపీ వెల్లడించారు. నకిలీ విత్తన మాఫియాపై జరుగుతున్న పోరులో వ్యవసాయశాఖ అధికారులంతా పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. అసలైన, నకిలీ విత్తనాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం లో పోలీసులకు అవగాహన కల్పించామన్నా రు. కార్యక్రమంలో ఏడీజీ జితేందర్ (లాఅండ్‌ఆర్డర్), ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీలు/కమిషనర్లు అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment