
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ (శాంతి భద్రతలు) జితేందర్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి అలజడి లేకుండా 33 జిల్లాల్లో పోలింగ్ ఓటింగ్ జరిగిందని చెప్పారు. 9 కమిషనరేట్లు, అన్ని జిల్లాల్లో ఒక్క హింసాత్మక ఘటన కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ఎన్నికల సంఘం అధికారులతో కలసి సమన్వయంతో పని చేశామని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసిందని, ఈవీఎం మెషన్లను తరలింపు, వాటిని భద్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పోలీసులు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలన్నింటినీ జిల్లా కేంద్రాల నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించినట్లు చెప్పారు.
సమన్వయంతో పనిచేశాం..
రాష్ట్రవ్యాప్తంగా 18,526 ప్రాంతాల్లో 34,603 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో 85 వేల మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొన్నారన్నారు. నిజామాబాద్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామని వివరించారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరగడంలో పోలీసు శాఖ సఫలమైందని తెలిపారు. అన్ని లోక్‌సభ సెగ్మెంట్లలో ఐజీలు, డీఐజీ, ఎస్పీలు, కమిషనర్లు కీలకంగా వ్యవహరించారన్నారు. వీరంతా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) జితేందర్ ఆధ్వర్యంలో సమన్వయంతో పనిచేశారని చెప్పారు. ప్రజలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషకరమన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలింగ్ సజావుగా ముగిసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి హింస జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కమాండ్ కంట్రోల్ నుంచి..
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని జిల్లాల పరిస్థితిని డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ సాగినంత సేపు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నికల సంఘం మీడియా మానిటరింగ్ విభాగం నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికçప్పుడు పరిష్కరించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్ర పోలీసు బలగాలతో స్ట్రాంగ్‌రూంల వద్ద పహారా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.