
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఓ నకిలీ వివాదాస్పద పోస్టు కారణంగా బెంగళూరులో అల్లర్లు చెలరేగి కాల్పులకు దారితీయడంతో డీజీపీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల విఘాతానికి కారణమయ్యే ఈ తరహా వివాదాస్పద, అసత్య పోస్టులు సమాజంలో ఆస్తి, ప్రాణనష్టాలకు దారితీస్తాయన్నారు.
సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులపై తెలంగాణ పోలీసులు 24 గంటలపాటు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. అసభ్యకరంగా, అల్లర్లకు కారణమయ్యే పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేయాలని అన్ని పోలీసుస్టేషన్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో పౌరులంతా పోలీసులకు సహకరించాలని మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.