సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్ కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇద్దరు ఎస్పీలు రంగనాథ్, రెమా రాజేశ్వరిలకు హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందు జరుగుతున్న కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు కావడంతో సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను ధర్మాసనం మూసివేసిందని, అయినప్పటికీ సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ముందుకెళుతున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీజీపీ, ఇద్దరు ఎస్పీలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు.
ఈ అప్పీళ్లపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ఇదే ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపేసిందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లకు భద్రతను పునరుద్ధరించాలన్న ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో అటు డీజీపీ, ఇటు ఇద్దరు ఎస్పీలను కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత కోర్టు ధిక్కారం కింద వీరికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఒక్కరే స్టే పొందాల్సి ఉంది.
డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు ఊరట
Published Thu, Mar 7 2019 4:30 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment