ముమ్మరంగా వాహనాల తనిఖీ
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ఎస్పీ రంగనాధ్ ఆదేశాల మేరకు ఖమ్మంనగరంతో పాటు శివారు మండలాల్లో పోలీసులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఖమ్మంనగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి, ఖమ్మం అర్బన్లతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం అర్బన్ మండలంలోని శ్రీశ్రీ విగ్రహం వద్ద కారులో కారులో తరలిస్తున్న 260 కిలోల గంజాయి, ఒక చనిపోయిన కుందేలు స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా ఖమ్మం బైపాస్ రోడ్డులో అనుమానంతో 8 మంది మహిళలను, ఒక ఆటోను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని 50వ డివిజన్లోని దానవాయిగూడెంలో నల్లబెల్లం, నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచ్ర క వాహనాలు, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీశ్రీ విగ్రహం, ఎన్టీఆర్ సర్కిల్, ఎన్నెస్పీ విశ్రాంతి భవనం, బోనకల్లు రోడ్డు, కాల్వోడ్డు, తదితర రహదారులతో పాటు మమత ఆస్పత్రి కాల్వకట్ట పరిసరా ల్లో, యుపీహెచ్కాలనీ, బాలాజీనగర్, రాజీవ్ గృహకల్ప, దానవాయిగూడెం, రమణగుట్ట, వికలాంగుల కాలనీ, తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడంతో 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుం డా వెళ్తున్న గ్రానైట్ లారీని అదుపులోకి తీసుకున్నారు.
52 వాహనాలు సీజ్..
ఖమ్మంలో సరైన పత్రాలు, ఇన్సూరెన్స్, లెసైన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 52 వాహనాలను సీజ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఆరువందల మందిచే తనిఖీలు : డీఎస్పీ బాలకిషన్‌రావు
ఖమ్మం అర్బన్ : ఖమ్మంసబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారుల్లో 600 మంది పోలీసులు నాకాబంధీ నిర్వహించారని డీఎస్పీ బాలకిషన్‌రావు పేర్కొన్నారు. ఖమ్మంఅర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాల మేరకు ఓఎస్డీ తిరుపతి, తనతో పాటు 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 200 మంది స్పెషల్ పార్టీ, 400 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో మహిళా స్టేషన్ సీఐ ప్రతాప్, అర్బన్ తహశీల్దార్ అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.
26 వాహనాలు, రూ.6లక్షల నగదు స్వాధీనం
నేలకొండపల్లి: జిల్లా సరిహద్దు ప్రాంతమైన పైనంపల్లి, నేలకొండపల్లి ప్రాంతాల్లో కూసుమంచి సీఐ పింగళి నరేష్‌రెడ్డి,నేలకొండపల్లి ఎస్సై పి.సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఓ వ్యక్తి తీసుకెళ్తున్న రూ. 4లక్షలను, మరో వ్యక్తి తీసుకెళ్తున్న రూ. 1.76లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 26 వాహనాలను సీజ్ చేశారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ ఆర్.కె.నాయుడు, వెగ్గళం శ్రీధర్‌చారీ, సిబ్బంది మన్సూర్‌ఆలీ, నరసింహారావు, నాగులు, వి.నాగేశ్వరరావు, విజయ్, ఆజమత్ ఆలీ, హోంగార్డ్లు మారగాని రమేష్, ప్రకాష్, శ్రీను పాల్గొన్నారు.
చర్లలో ..
చర్ల: మండల కేంద్రంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఆదివారం జరిగిన వారపు సంతకు సరిహద్దు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలిరావడంతో వారి మాటున మావోయిస్టు సానుభూతిపనులు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. సంతకు వచ్చే ఆదివాసీలతో పాటు వారి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారించి విడుదల చేశారు. ఈ తనిఖీలలో సీఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.