Sp Rema Rajeswari
-
డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్ కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇద్దరు ఎస్పీలు రంగనాథ్, రెమా రాజేశ్వరిలకు హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందు జరుగుతున్న కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు కావడంతో సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను ధర్మాసనం మూసివేసిందని, అయినప్పటికీ సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ముందుకెళుతున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీజీపీ, ఇద్దరు ఎస్పీలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ఇదే ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపేసిందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లకు భద్రతను పునరుద్ధరించాలన్న ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో అటు డీజీపీ, ఇటు ఇద్దరు ఎస్పీలను కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత కోర్టు ధిక్కారం కింద వీరికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఒక్కరే స్టే పొందాల్సి ఉంది. -
వదంతులు నమ్మకండి
గద్వాల క్రైం మహబూబ్‌నగర్ : చిన్నారులను అపహరించే ముఠా జిల్లాలో సంచరిస్తున్నట్లు వివిధ వాట్సాప్ గ్రూప్‌ల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మ వద్దని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనల్లో కోరారు. కొన్ని రోజుల నుంచి వివిధ వాట్సాప్ గ్రూప్‌ల్లో కడప, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి చిన్న పిల్లలను ఎత్తుకేళ్లే ముఠా జిల్లాలో సంచరిస్తున్నట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఇలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే జిల్లా పోలీసుశాఖ ఇప్పటికే అన్ని సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఉంచిందన్నారు. ఉదయం, సాయంత్రం వెళల్లో పెట్రోలింగ్, గస్తీలు నిర్వహిస్తున్నామన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా హాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు. ఎవరైనా అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే ఇలాంటి సున్నితమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్టులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పార్ధీ గ్యాంగ్ పేరిట పుకార్లు.. పార్ధీ గ్యాంగ్ పేరిట పుకార్లు, వదంతులు వస్తున్నా.. ఇలాంటి గ్యాంగ్ జిల్లాకు వచ్చినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవని ఎస్పీ రెమా రాజేశ్వరి స్పష్టం చేశారు. అయితే జిల్లా సరిహద్దు గల ప్రాంతమైన అలంపూర్ మండల ప్రజల్లో పలు వాట్సాప్ గ్రూప్‌లు రావడంతో ఇలా వచ్చిన పోస్టులను ఇతర గ్రూప్‌లలో పంపడం ద్వారా ప్రజల్లో భయాందోళన రేకెత్తిందన్నారు. పెబ్బేరు గ్రామానికి చెందిన బుర్రకథలు చెబుతూ జీవనం సాగించే ఇద్దరు మహిళలు గత శనివారం గట్టు మండలం రాయాపురం గ్రామానికి వచ్చి చీకటి పడడంతో దగ్గర్లో ఉన్న ఆలయం వద్ద బస చేశారని, వీరిని గుర్తుతెలియని ముఠా సభ్యులుగా అనుమానించి పోలీసులకు అప్పగించారన్నారు. పోలీసుల విచారణలో వీరిది పెబ్బేరు మండలంలో బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నట్లు నిర్ధారణ అయిందని ఎస్పీ పేర్కొన్నారు. -
మళ్లీ కార్డెన్ సెర్చ్
పెబ్బేరు (కొత్తకోట): వనపర్తిని నేర రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఇన్చార్జ్ ఎస్పీ రెమారాజేశ్వరి పెబ్బేరులో రెండుసారి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ఇన్చార్జ్ అదనపు ఏఎస్పీ భాస్కర్, వనపర్తి డీఎస్పీ సృజన పర్యవేక్షణలో ముగ్గురు సీఐలు, 9 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, ఓంగార్డులు కలిపి సుమారు 100 మంది ఏడు బృందాలుగా విడిపోయి పట్టణంలో తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్, గాయత్రినగర్, సినిమా టాకిస్ కాలనీ, మార్కెట్ వెనకాల, ఓల్డ్ఆర్టీఏ కార్యాలయంలో కాలనీలో తనిఖీలు చేపట్టారు. అనుమానితులు ఎవరైనా ఇంటి అద్దెకు తీసుకొని ఉంటారనే అనుమానంతో వారి ఆధార్ కార్డు, ఐడి ఇతర ఆదారాలు సేకరించి పరిశీలించారు. అనంతరం ఎలాంటి పత్రాలు లేని 34 మోటర్ సైకిళ్లు, 2 ఆటోలను సీజ్ చేసి పెబ్బేరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. నేరాల అదుపునకు సహకరించాలి నేరాలు అదుపులో ఉండాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని ఇన్చార్జ్ ఎస్పీ రెమా రాజేశ్వరి కోరారు. కార్డెన్ సెర్స్‌లో భాగంగా బస్తి ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుతం చేస్తున్న సోదాలు ప్రజల సంక్షేమం కోసంమేనని, అసాంఘిక శక్తుల ఆట కట్టించి నేరస్తులు తప్పించుకోకుండా ఉండేందుకు తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా అనుమానస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని, ఆధార్ కార్డు జిరాక్స్‌తోపాటు పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వాలన్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో కొత్తకోట సీఐ సోమ్‌నారాయణసింగ్, ఆత్మకూర్ సీఐ శంకర్, వనపర్తి, పెబ్బేరు ఎస్ఐ ఓడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేరస్థులకు కఠిన శిక్షలు
మహబూబ్‌నగర్ : సమాజంలో మారుతున్న పరిస్థితులను బట్టి చట్టాలను రూపకల్పన జరుగుతుందని వాటిని అమలు చేయడంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సమాజంలోని అసహాయులకు రక్షణ కల్పించటానికి ఏర్పడిన చట్టాలను అమలు పర్చటంలో న్యాయవ్యవస్థ నిరంతరం కృషిచేస్తుందని, అదే సందర్భంలో నిందితులకు శిక్ష ఖరారు చేయటంలో తగినంత ఆధారాలు సేకరించటంలో పోలీసు పరిశోధనాధికారులు కృషిచేయాలని అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నూతన చట్టాలపై జరిగిన ఒకరోజు సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.శాంతిభద్రతల నిర్వహణలో పోలీస్ శాఖ బహుముఖాలుగా కృషి చేయాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో నేరగాళ్లకు శిక్ష ఖరారు అయ్యేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌తో కలిసి తగిన రీతిలో పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కేసులో నేరస్థులకు శిక్ష ఖరారు చేయడంలో పరిశోధన అత్యంత ప్రధానమైనదని, సాక్ష్యాధారాల సేకరణలో ఆధునిక పద్దతలు వినియోగించడం వల్ల ఫలితాలు వస్తాయని తెలిపారు. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా నేరాల తీవ్రతను గమనించి, ప్రభుత్వము తగినస్థాయిలో చట్టాలను రూపొందిస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు ఆయా చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. బాధితుల మనోనిబ్బరాన్ని, చట్టాలపై నమ్మకాన్ని పెంచటంలో పోలీసు పాత్ర గణనీయమైనదని నిందితులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు పెట్టడంలో పూర్తిస్థాయి శ్రద్ధ కనబరుస్తుందన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు ప్రసంగిస్తూ నేరస్థలాన్ని సందర్శించటం వలన దర్యాప్తు అధికారి వ్యక్తిగత పరిశోధన వలన నేరస్తులపై ఒక అవగాహన రాగలడని ప్రకటించారు. మహిళలను వేధించటం, వారిపై అనాగరికంగా ప్రవర్తించటం వంటి నేరాలు మన దేశ సంస్కృతికి , గౌరవానికి తీవ్రమైన రీతిలో భంగం కలిగిస్తున్నాయని, ప్రతి ఒక్కరు తమ వంతు శ్రద్ధ కనబర్చి ఇటువంటి అనాగరిక చర్యలను కట్టడి చేసే దిశలో కృషిచేయాలని అన్నారు. ఆనంతరం న్యాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీవాణి, నాగరాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలగంగాధర్రెడ్డిలు నూతన చట్టాలపై వివరంగా ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు సీతయ్య, డివిపి రాజు, రామకృష్ణ, ఉమ్మడి జిల్లాల నుండి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పుష్కరఘాట్లను పరిశీలించిన ఎస్పీ
ఇటిక్యాల /గద్వాలన్యూటౌన్/ఆత్మకూర్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ల నిర్మాణాలను ఆదివారం ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. ఆలయాల పరిసరాలను, పుష్కరాల సందర్భంగా వీఐపీ వాహనాల పార్కింగ్, వీఐపీ పుష్కరఘాట్లను పరిశీలించారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం పరిసరాలలో, కృష్ణానది అవతల రంగాపురం నుంచి ఇటిక్యాల మండలం ఎర్రవల్లిచౌరస్తా వరకు జాతీయ రహదారి వెంబడి పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని స్థానిక డీఎస్పీ బాలకోటి, అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఇటిక్యాల ఎస్ఐ సురేష్‌కు సూచించారు. పుష్కరాల సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భద్రత విషయంలో రాజీ పడవద్ద చెప్పారు. వీఐపి వాహన పార్కింగ్ స్థలాల వద్ద, భక్తుల పార్కింగ్ స్థలాల వద్ద విద్యుత్ బల్బులు, సీసి కెమెరాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. రోడ్డుమార్గాల మ్యాప్‌లతో అధికారులతో చర్చ అనంతరం గద్వాలరూరల్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం గద్వాల ప్రాంతంలోని పుష్కరఘాట్ల రోడ్డు మార్గాలపై అధికారులతో చర్చించారు. కర్నూలు నుంచి బస్సుమార్గం ద్వారా వచ్చే భక్తులు గద్వాల మండల పరిధిలోని బీరెల్లి పుష్కరఘాట్‌కు వెళ్లే మార్గాన్ని, రైలుమార్గం ద్వారా కర్నూలువైపు నుంచి నదీఅగ్రహారం పుష్కరఘాట్‌కు వెళ్లే రోడ్డు మార్గాలను మ్యాప్‌ల ద్వారా సీఐ సురేష్ వివరించారు. తర్వాత నది అగ్రహారం పుష్కరఘాట్‌ను సందర్శించారు. అక్కడి పనుల పురోగతి గురించి ఎస్పీ తెలుసుకున్నారు. షాద్‌నగర్ ఏఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, గద్వాల డీఎస్పీ బాలకోటి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, పలువురు ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. నందిమల్ల పుష్కరఘాట్‌ను సందర్శన అక్కడి నుంచి ఆత్మకూర్ మండలంలోని నందిమల్ల పుష్కరఘాట్‌ను ఎస్పీ సందర్శించారు. ఏర్పాట్ల గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో తదితర వివరాల గురించి ఆరా తీశారు. ఘాట్ల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పెద్దఎత్తున పోలీసుబలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ సీహెచ్ రాజు, ఏపీఎం శ్రీనివాసులు, సర్పంచ్ రంగమ్మ, ఎంపీటీసీ లక్ష్మమ్మ, కాంట్రాక్టర్లు ప్రతాప్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మస్తీపూర్ శ్రీను, సర్వేయర్ బాస్కర్ ఉన్నారు.