మాట్లాడుతున్నరెమా రాజేశ్వరి
గద్వాల క్రైం మహబూబ్‌నగర్ : చిన్నారులను అపహరించే ముఠా జిల్లాలో సంచరిస్తున్నట్లు వివిధ వాట్సాప్ గ్రూప్‌ల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మ వద్దని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనల్లో కోరారు. కొన్ని రోజుల నుంచి వివిధ వాట్సాప్ గ్రూప్‌ల్లో కడప, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి చిన్న పిల్లలను ఎత్తుకేళ్లే ముఠా జిల్లాలో సంచరిస్తున్నట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
అయితే ఇలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే జిల్లా పోలీసుశాఖ ఇప్పటికే అన్ని సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఉంచిందన్నారు. ఉదయం, సాయంత్రం వెళల్లో పెట్రోలింగ్, గస్తీలు నిర్వహిస్తున్నామన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా హాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు.
ఎవరైనా అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే ఇలాంటి సున్నితమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్టులు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పార్ధీ గ్యాంగ్ పేరిట పుకార్లు..
పార్ధీ గ్యాంగ్ పేరిట పుకార్లు, వదంతులు వస్తున్నా.. ఇలాంటి గ్యాంగ్ జిల్లాకు వచ్చినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవని ఎస్పీ రెమా రాజేశ్వరి స్పష్టం చేశారు. అయితే జిల్లా సరిహద్దు గల ప్రాంతమైన అలంపూర్ మండల ప్రజల్లో పలు వాట్సాప్ గ్రూప్‌లు రావడంతో ఇలా వచ్చిన పోస్టులను ఇతర గ్రూప్‌లలో పంపడం ద్వారా ప్రజల్లో భయాందోళన రేకెత్తిందన్నారు.
పెబ్బేరు గ్రామానికి చెందిన బుర్రకథలు చెబుతూ జీవనం సాగించే ఇద్దరు మహిళలు గత శనివారం గట్టు మండలం రాయాపురం గ్రామానికి వచ్చి చీకటి పడడంతో దగ్గర్లో ఉన్న ఆలయం వద్ద బస చేశారని, వీరిని గుర్తుతెలియని ముఠా సభ్యులుగా అనుమానించి పోలీసులకు అప్పగించారన్నారు. పోలీసుల విచారణలో వీరిది పెబ్బేరు మండలంలో బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నట్లు నిర్ధారణ అయిందని ఎస్పీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment