మహబూబ్‌నగర్ : సమాజంలో మారుతున్న పరిస్థితులను బట్టి చట్టాలను రూపకల్పన జరుగుతుందని వాటిని అమలు చేయడంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సమాజంలోని అసహాయులకు రక్షణ కల్పించటానికి ఏర్పడిన చట్టాలను అమలు పర్చటంలో న్యాయవ్యవస్థ నిరంతరం కృషిచేస్తుందని, అదే సందర్భంలో నిందితులకు శిక్ష ఖరారు చేయటంలో తగినంత ఆధారాలు సేకరించటంలో పోలీసు పరిశోధనాధికారులు కృషిచేయాలని అన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నూతన చట్టాలపై జరిగిన ఒకరోజు సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.శాంతిభద్రతల నిర్వహణలో పోలీస్ శాఖ బహుముఖాలుగా కృషి చేయాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో నేరగాళ్లకు శిక్ష ఖరారు అయ్యేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌తో కలిసి తగిన రీతిలో పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కేసులో నేరస్థులకు శిక్ష ఖరారు చేయడంలో పరిశోధన అత్యంత ప్రధానమైనదని, సాక్ష్యాధారాల సేకరణలో ఆధునిక పద్దతలు వినియోగించడం వల్ల ఫలితాలు వస్తాయని తెలిపారు.
మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా నేరాల తీవ్రతను గమనించి, ప్రభుత్వము తగినస్థాయిలో చట్టాలను రూపొందిస్తున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు ఆయా చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. బాధితుల మనోనిబ్బరాన్ని, చట్టాలపై నమ్మకాన్ని పెంచటంలో పోలీసు పాత్ర గణనీయమైనదని నిందితులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు పెట్టడంలో పూర్తిస్థాయి శ్రద్ధ కనబరుస్తుందన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు ప్రసంగిస్తూ నేరస్థలాన్ని సందర్శించటం వలన దర్యాప్తు అధికారి వ్యక్తిగత పరిశోధన వలన నేరస్తులపై ఒక అవగాహన రాగలడని ప్రకటించారు. మహిళలను వేధించటం, వారిపై అనాగరికంగా ప్రవర్తించటం వంటి నేరాలు మన దేశ సంస్కృతికి , గౌరవానికి తీవ్రమైన రీతిలో భంగం కలిగిస్తున్నాయని, ప్రతి ఒక్కరు తమ వంతు శ్రద్ధ కనబర్చి ఇటువంటి అనాగరిక చర్యలను కట్టడి చేసే దిశలో కృషిచేయాలని అన్నారు. ఆనంతరం న్యాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీవాణి, నాగరాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలగంగాధర్‌రెడ్డిలు నూతన చట్టాలపై వివరంగా ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు సీతయ్య, డివిపి రాజు, రామకృష్ణ, ఉమ్మడి జిల్లాల నుండి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
నేరస్థులకు కఠిన శిక్షలు
Published Sat, Apr 22 2017 10:29 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
Advertisement