
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి భద్రాచలం పులిగొండల సర్పంచ్ చలపతిని విడుదల చేయాలని లేఖ ఇచ్చారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గిరిజన సర్పంచ్ చలపతి అరెస్ట్ కండిస్తున్నామన్నారు.
‘మావోయిస్టులకు సహకరిస్తున్నారు-సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్ట్ చేయడం దారుణం. పోలీసులు చెప్పినట్లు మావోయిస్టు భావజాలం ఉంటే ఎన్నికల్లో చలపతి పోటీ చేసేవారు కాదు. భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి చలపతి. అర్థరాత్రి అన్నం కోసం ఎవరు వచ్చినా అన్నం పెడతాం. అడవిబిడ్డ బోయకులానికి చెందిన గిరిజన వ్యక్తి చలపతి. సర్పంచ్‌లను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా బెదిరిస్తే కాంగ్రెస్ అండగా ఉంటుంది’ అని భట్టి అన్నారు. వరదల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముంపుకు గురైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.