సాక్షి, హైదరాబాద్ : ‘ఏమైపోతున్నారు’ పేరిట ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక మంగళవారం ప్రచురించిన కథనంపై తెలంగాణ పోలీస్‌శాఖ స్పందించింది. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే వార్తలు సరికావని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా అన్నారు. అన్ని కేసుల మాదిరగిగానే కిడ్నాప్ కేసులపై కూడా సత్వర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను డీజీపీ మహెందర్‌రెడ్డి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కిడ్నాప్ అవుతున్న వారిలో దాదాపు 85 శాతం మంది ఆచూకీ దొరుకుతోందని స్వాతిలక్రా వెల్లడించారు. ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు అదృశ్యమవుతున్నారని చెప్పారు. పరీక్షా ఫలితాలు, ప్రేమ వ్యవహారాలు, వృద్ధులపట్ల పిల్లల నిరాదరణ వంటి కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసుకుని, బాధిత కుంటుంబ సభ్యుల సహకారంతో వారి ఆచూకీ కనుగొనేందుకు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. గస్తీ వాహనాలు, బ్లూకోల్ట్స్, దర్యాప్తు అధికారులకు కిడ్నాపైన వారి ఫొటోలు అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సి న పనిలేదని, అదృశ్యమైన ప్రతి ఒక్కరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసుశాఖ పనిచేస్తుందని ఆమె భరోసానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment