kidnap cases
-
కాలేజీ ఫీజు కోసం బాలుడి ‘కిడ్నాప్’.. డిగ్రీ స్టూడెంట్ ప్లాన్‌తో షాక్!
బెంగళూరు: కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? బ్యాంకులో విద్యారుణం తీసుకోవటం, తెలిసినవార వద్ద అప్పుగా తీసుకోవటం వంటివి చేస్తారు? కొందరు తప్పని పరిస్థితుల్లో చదువు మానేస్తారు కూడా. కానీ, ఓ డిగ్రీ విద్యార్థి ఏకంగా కిడ్నాప్ చేశాడు. ఓ ధనవంతుడి కుమారుడిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు తీసుకున్నాడు. వాటితో కాలేజీ ఫీజు కట్టి ఓ బైక్, డిజిటల్ కెమేరా కొనుగోలు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకున్న బికాం విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 23 ఏళ్ల ఎం సునీల్ కుమార్‌గా గుర్తించారు. అలాగే.. నిందితుడి స్నేహితుడు, మండికల్కు చెందిన వైవీ నగేశ్ని సైతం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. రమేశ్ బాబు అనే కార్పొరేట్ వర్కర్ కుమారుడిని ఇద్దరు స్నేహితులు కలిసి సెప్టెంబర్ 2న కిడ్నాప్ చేశారు. రమేశ్ బాబు కొడుకు భవేశ్ తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడని ముందుగానే తెలుసుకుని.. అక్కడికి వెళ్లారు నిందితులు. కత్తి చూపించి బాలుడిని తండ్రి కారులోనే కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకోసం భవేశ్ తండ్రి మొబైల్ ఫోన్‌నే ఉపయోగించటం గమనార్హం. డబ్బులు ఇచ్చేందుకు రమేశ్ బాబు అంగీకరించటంతో.. రైల్వే ట్రాక్ సమీపంలో నగదు తీసుకుని బాలుడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనపై రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కళాశాల ఫీజు చెల్లించలేకపోవటంతో.. బాలుడిని కిడ్నాప్ చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. బాలుడి తండ్రి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నతర్వాత నిందితుడు.. కళాశాలలో ఫీజు కట్టాడు. అందులోంచి ఓ బైక్, డిజిటల్ కెమెరాను కొనుగోలు చేశాడు. ఇదీ చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు! -
నమ్మించి.. రియల్టర్ కిడ్నాప్
పీఎం పాలెం (భీమిలి): ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి పరిచయమైన రౌడీషీటర్ అతడినే కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఓ ల్యాండ్ డెవలప్మెంట్ విషయపై ఒప్పందం చేసుకుందామని పిలిచి.. కారులో ఎక్కించుకుని అపహరించేందుకు ప్రయత్నించాడు. రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతానని బెదిరించడంతో... ఆ వ్యాపారి రూ.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. పోలీసుల రంగ ప్రవేశంతో కథ అడ్డం తిరిగింది. దీంతో రియల్టర్‌ను కారులో నుంచి తోసేసి కిడ్నాపర్ పరారయ్యాడు. నగర శివారులో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పీఎం పాలెం సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పాచి రామకృష్ణ కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనిపై మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడైన రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్ (30) దృష్టి పడింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు రామకృష్టకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తాను అలకనందా రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. బాగా నమ్మకం పెరిగాక ఓ ల్యాండ్ డెవలప్మెంట్ విషయపై ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రుషికొండ సమీపానికి వస్తే ఒప్పందం పూర్తి చేసుకుందామని రామకృష్ణను హేమంత్ పిలిచాడు. నిజమేనని నమ్మిన రామకృష్ణ రుషికొండ వెళ్లగా... ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం కారులో కూర్చున్న రామకృష్ణను హేమంత్ తాళ్లతో బంధించాడు. కోటి రూపాయలు చెల్లిస్తేనే విడిచిపెడతానని బెదిరించాడు. అనంతరం కారును విజయనగరం వైపు తీసుకుని బయలుదేరాడు. సీసీ కెమెరా పుటేజీతో అప్రమత్తం రామకృష్ణను హేమంత్ బెదిరించి కారులో తీసుకెళ్లిపోతున్న తతంగం అంతా సమీపంలోని ఓ రిసార్టు సీసీ కెమెరాలో రికార్డు కాగా గమనించిన అక్కడి సిబ్బంది విషయాన్ని నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సీపీ పీఎంపాలెం పోలీసులను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ వాడుతున్న కారు డ్రైవర్ సెల్ ఫోను నంబరు లొకేషన్ ఆధారంగా కారుని గుర్తించి పోలీసులు వెంబడించారు. అప్పటికే బాధితుడు రామకృష్ట తనను విడిచిపెడితే రూ.50 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతలో పోలీసులు తనను వెంబడిస్తున్నారని తెలుసుకున్న కిడ్నాపర్ హేమంత్ కథ అడ్డం తిరిగిందని భావించి రామకృష్ణను కారు లోనుంచి బయటకు తోసేసి పరారయ్యాడు. అనంతరం జరిగిన సంఘటనపై రామకృష్ణ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం డీసీపీ గరుడ సుమిత్ సునీల్ పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించారు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయమై ఆరా తీశారు. హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి... కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌కు కరుడుగట్టిన నేర చరిత్ర ఉంది. భీమిలి పోలీస్ స్టేషన్లో గతంలో రౌడీషీట్ తెరిచారు. భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్నేళ్ల కిందట నగరంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ లీడర్, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. రూ.1.35 కోట్ల విలువైన ప్లాటు కొనుగోలు విషయమై విజయారెడ్డి ఇంటికి వెళ్లి మరీ భయంకరంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి బంగారు నగలు అపహరించుకుని ఆమె కారులోనే పరారయ్యాడు. నగలు విక్రయించగా వచ్చిన డబ్బులతో ప్రియురాలితో కలిసి విజయవాడలో జల్సాలు చేశాడు. ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం బయటకు వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. (చదవండి: ఆహ్లాదం మాటున సుడి‘గండాలు’) -
‘85 శాతం మంది ఆచూకీ లభిస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ‘ఏమైపోతున్నారు’ పేరిట ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక మంగళవారం ప్రచురించిన కథనంపై తెలంగాణ పోలీస్‌శాఖ స్పందించింది. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే వార్తలు సరికావని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా అన్నారు. అన్ని కేసుల మాదిరగిగానే కిడ్నాప్ కేసులపై కూడా సత్వర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను డీజీపీ మహెందర్‌రెడ్డి ట్విటర్లో పోస్ట్ చేశారు. కిడ్నాప్ అవుతున్న వారిలో దాదాపు 85 శాతం మంది ఆచూకీ దొరుకుతోందని స్వాతిలక్రా వెల్లడించారు. ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు అదృశ్యమవుతున్నారని చెప్పారు. పరీక్షా ఫలితాలు, ప్రేమ వ్యవహారాలు, వృద్ధులపట్ల పిల్లల నిరాదరణ వంటి కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసుకుని, బాధిత కుంటుంబ సభ్యుల సహకారంతో వారి ఆచూకీ కనుగొనేందుకు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. గస్తీ వాహనాలు, బ్లూకోల్ట్స్, దర్యాప్తు అధికారులకు కిడ్నాపైన వారి ఫొటోలు అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సి న పనిలేదని, అదృశ్యమైన ప్రతి ఒక్కరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసుశాఖ పనిచేస్తుందని ఆమె భరోసానిచ్చారు. -
కిడ్నాప్ కేసుల కథ కంచికేనా?
- ముందుకు కదలని మహిళల అపహరణ కేసులు - అధికశాతం కేసులు దర్యాప్తులోనే.. - అందుబాటులోకి రాని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీస్ శాఖ, వారిపై దాడులు, కిడ్నాపులకు సంబంధించిన కేసుల్లో మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకోలేకపోతోంది. మహిళలను కిడ్నాపు చేసిన కేసులు ఏళ్ల పాటు దర్యాప్తు దశలోనే ఉండిపోతున్నాయి. కేసుల దర్యాప్తు పరిస్థితి ఏంటి? ఎంతవరకు వచ్చిందన్న అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడమే శిక్షల శాతం పెరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి? అపహరణకు గురైన మహిళలను రక్షించడంలో 45శాతం సఫలమవుతున్న పోలీసులు ఆ మేరకు నిందితులకు శిక్షపడేలా చేయడంలో అలసత్వం వహిస్తున్నారని అపవాదు ఎదుర్కొంటున్నారు. సరైన ఆధారాలు సేకరించకపోవడం, మిగతా లింకును బయటపెట్టకపోవడంతో నిందితులు సులభంగా తప్పించుకోగులుగుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులేవీ?.. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించకపోవడం కూడా శిక్షల శాతం పెరగకపోవడంలో మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది. కోర్టుల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ వ్యవస్థను తీసుకు రావాల్సిన పోలీస్ శాఖ అటువైపు ఆలోచించడం కూడా మానేసింది. 2014 నుంచి 2016 డిసెంబర్ వరకు మహిళల కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచార కూపంలోకి దింపిన సంఘటనల్లో కేసులు 2,046 వీటిలో తప్పుడు కేసులనే కారణంతో మూసివేసినవి 472 దర్యాప్తునకు స్వీకరించిన కేసులు 1,574 కేవలం కిడ్నాపునకు సంబంధించి దర్యాప్తు దశలోనే ఉన్న కేసులు 493 కిడ్నాపు కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డ కేసులు 6.5% -
ముందే చెప్పివుంటే...
బెస్ట్ కేస్: అప్పటికి రాష్ట్రం నలుమూలలా కిడ్నాప్ కేసుల మోత మోగుతోంది. 2008... వరంగల్ ఎస్పీగా పనిచేస్తున్నాను. మా జిల్లాలో కిడ్నాప్లేం లేవు కదా అనుకుంటుండగా ఒకరోజు ఒకతను ఫోన్ చేసి ‘మా తొమ్మిదేళ్ల పాపని ఎవరో కిడ్నాప్ చేశారు, 20 లక్షలు ఇవ్వాలంటున్నారు’ అని చెప్పాడు. సాయంత్రం పాప స్కూలు నుంచి ఇంటికి తిరిగొస్తుండగా దుండగలు ఎత్తుకెళ్లారు. ముందుగా కిడ్నాప్ అయిన అమ్మాయి తండ్రిని కూర్చోబెట్టి ఎవరిపైనైనా అనుమానం ఉంటే చెప్పమన్నాను. పేర్లు, చిరునామాలతో సహా చెప్పాడు. కేసు త్వరగానే పరిష్కారమవుతుందనుకున్నాను. - సౌమ్యమిశ్రా స్పెషల్ సెక్యురిటీ హోమ్ డిపార్ట్మెంట్, తెలంగాణ. చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ పాతకక్షల కారణంగా... అమ్మాయి తండ్రి చెప్పిన ముగ్గురిని స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తే ఎలాంటి సాక్ష్యాధారాలూ దొరకలేదు. నిజానికి ఆ పని చేసింది వాళ్లు కాదు. ఇంతలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి పాప వివరాలు తెలుసునన్నాడు. ఫలానాచోట ఆ అమ్మాయిని చూశాననీ, ఎవరో రేప్ చేశారనీ...ఇలా నోటికొచ్చిన అబద్ధాలాడుతూ అసలు విషయం చెప్పకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అలాంటి ఫేక్ కాల్స్ మాకే కాదు, టీవీ ఛానళ్ల వారికి కూడా చేసి పాప వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పటివరకు గోప్యంగా సాగిన విచారణ బట్టబయలైంది. తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్ అయి ఇన్ని గంటలైనా, ఇన్ని రోజులైనా పోలీసులు చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారంటూ కథనాలు మొదలయ్యాయి. రెండు రోజులు వృథా... అమ్మాయి ఎక్కడుందో తెలుసునంటూ ఫోన్లు చేసి మమ్మల్ని తిప్పలు పెట్టిన నేరస్తుడ్ని పట్టుకోడానికి మాకు రెండు రోజులు పట్టింది. చివరకు అతడు హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో దొరికాడు. తీరా చూస్తే ఊరికే డబ్బులకోసం చేశానంటాడు. అప్పటికే అతడిపై చాలా కేసులున్నాయి. అతడి విషయం పక్కన పెట్టి తిరిగి పాప ఎక్కడుందో విచారణ మొదలుపెట్టాం. ప్రతిరోజు పాప తల్లిదండ్రులు స్టేషన్‌కి వచ్చి కనిపించేవారు. ఆ తల్లి ఆవేదనను మాటల్లో చెప్పలేం. ఆమెను చూడగానే నాక్కూడ కళ్లలో నీళ్లు తిరిగేవి. కారణం అప్పటికి మా అమ్మాయి వయసు ఆరేళ్లు. రోజు నిద్రపోయేముందు కిడ్నాప్ అయిన పాపే గుర్తుకొచ్చేది. కిడ్నాప్ అయి మూడురోజులు గడిచిపోయింది. ఈ మూడురోజుల్లో నేను గమనించిన విషయం ఏంటంటే... పాప తండ్రి ప్రవర్తన కొద్దిగా చిత్రంగా అనిపించింది. తండ్రి నోరిప్పలేదు... అమ్మాయి కిడ్నాప్ అయిన క్షణం నుంచి ఏ పూట చూసినా తల్లి రోదన ఒక్కతీరుగానే ఉంది. తండ్రి ప్రవర్తన అలా లేదు. అతను ఏదో విషయం దాస్తున్నట్టు అనిపించింది. అతని వద్ద నుంచి ఏ చిన్న క్లూ అయిన దొరకకపోతుందా అని ప్రతిరోజు పిలిపించుకుని ప్రశ్నించేదాన్ని. ఏమీ బయటపెట్టలేదు. నాలుగురోజులు గడిచిపోయాయి. నాలుగు టీమ్‌లు జిల్లాలో వీధి వీధి గాలిస్తున్నాయి. పాప గురించి ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ‘మర్యాదగా మేం అడిగిన 20 లక్షలు మేం చెప్పిన ప్లేస్‌కి పంపిస్తే పాపను కాజీపేట్‌లో వదిలేసిపోతాం. పోలీస్ కంప్లయింట్ వంటివి ఇస్తే పాప ప్రాణాలతో ఉండదు’ అంటూ మరోసారి వాళ్లు ఫోన్ చేశారంటూ పాప తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈసారి అతని ముఖంలో భయం కనపడింది. మాక్కావాల్సింది అదే. ఎందుకంటే ఎవరైనా నిజం చెప్పాలంటే వారికి ఉండాల్సింది భయం. ఆ ముగ్గురే... విషయం ఏంటంటే కిడ్నాప్‌కి గురైన పాప తండ్రి పదిరోజుల క్రితం ఓ ముగ్గరు రౌడీలకు ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ముందుగా ఎవరిపైన అయితే అనుమానం ఉందని చెప్పాడో వారిని కొట్టించడం కోసం. ఏవో పాత తగాదాలన్నమాట. వారిపై దాడిచేయడం కోసం ఒక కిరాయి హంతకుడ్ని, మరో ఇద్దరు రౌడీషీటర్లకు డబ్బిచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పాప తండ్రి చిరువ్యాపారి కావడంతో డబ్బులు బాగా ఉంటాయని అనుకున్నారో ఏమో ఆ ముగ్గురు... అసలు మాట్లాడుకున్న పనిని పక్కనపెట్టి ఇతని కూతుర్ని ఎత్తుకుని పారిపోయారు. పాపకు ముందే వారితో పరిచయం ఉండడం కారణంగా స్కూలు దగ్గర వారు పిలవగానే వారితో వెళ్లిపోయిందన్నమాట. అప్పుడే చెప్పి ఉంటే... మొదట కిడ్నాప్ కాల్ రాగానే ఇతనికి ఆ కిరాయి గుండాలపై అనుమానం వచ్చి ఫోన్ చేసి అడిగితే ‘నీ కూతుర్ని మేం ఎందుకు కిడ్నాప్ చేస్తాం సాబ్’ అన్నారట. దాంతో ఇతను తన శత్రువులను అనుమానించాడు. వారి పేర్లు చెప్పి ఊరుకున్నాడు. నేను వెంటనే మరో ఐదు బృందాలను ఇతను చెప్పిన వివరాలతో విచారణకు పంపించాను. మర్నాడు పొద్దున స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కి ఒక ఫోన్ వచ్చింది. కాజీపేట దగ్గర ఒక గ్రామం శివారులోని బావిలో ఒక పాప శవం ఉందని చెప్పారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే చనిపోయింది కిడ్నాప్‌కి గురైన పాపే. అయ్యో...పాపని రక్షించలేకపోయామే అని బాధపడ్డాను. పాప తండ్రిని ఏంచేసినా పాపం లేదనిపించింది. నాలుగురోజుల వరకూ ఆ ముగ్గురు రౌడీల విషయం మాకు చెప్పకుండా దాచి కడుపున పుట్టిన బిడ్డను పోగొట్టుకున్నాడు. 24 గంటల్లో... రెండేళ్లు, మూడేళ్ల పాప అయితే దుండగులను గుర్తుపట్టే అవకాశం ఉండదు. తొమ్మిదేళ్ల పాప...పైగా పరిచయం ఉన్నవారి కిడ్నాప్.. ఆ అమ్మాయి ప్రాణాలతో దొరికితే వారికి ప్రమాదమనుకుని చంపేసి పారిపోయారని అనుకున్నాను. పాపను గొంతునులిమి చంపేసి బావిలో పడేసిపోయారు. ఆ సంఘటన జరిగిన 24 గంటల్లో ఆ ముగ్గురిలో ఒకర్ని పట్టుకున్నాం. అతన్ని విచారిస్తే మిగతా ఇద్దరిని కూడా పట్టుకున్నాం. ఒకతనిపై కరీంనగర్లో మర్డర్ కేసు ఉంది. మరో వ్యక్తిపై కత్తితో దాడిచేసి గాయపరిచిన కేసులు నాలుగున్నాయి. మూడో వాడిపై 304 సెక్షన్‌కింద నాలుగు కేసులున్నాయి. ప్రెస్మీట్లో... అప్పటికే ఈ కేసు గురించి రాష్ట్రం నలుమూలాల పాకింది. ఇక వరంగల్ జిల్లా వాసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేరస్తుల్ని పట్టుకున్నామన్న వార్త తెలియగానే జనమంతా వారిపై కోపంతో ఊగిపోతున్నారు. డబ్బు కోసం పసిబిడ్డను అంత దారుణంగా హత్య చేయడం అందరినీ భయాందోళనలకు గురిచేసింది. నేను వెంటనే ప్రెస్‌మీట్ పెట్టాను. ఆ సందర్భంగా ప్రెస్‌వాళ్లు అడిగిన ప్రశ్నలకు నిందితులు వివరంగా సమాధానాలిచ్చారు. పాప ఎలా చంపారో మాటలతో కాదు...చేతలతో చూపించి మరీ చెప్పారు. ‘వీడు పాపని కాళ్లపై పడుకోబెట్టుకున్నాడు. నేను పాప కాళ్లు, చేతులు కదపకుండా గట్టిగా పట్టుకుంటే వీడు పాప గొంతునులుమి చంపేశాడు...’ అంటూ టీవీలోని డైలీ సీరియల్ స్టోరీ చెప్పినట్టు చెప్పారు. మాకే కాదు, వారి మాటలు విన్నవారందరికీ రక్తం ఉడికిపోయింది. కిడ్నాప్ కాల్ రాగానే ఇతనికి ఆ కిరాయి గుండాలపై అనుమానం వచ్చి ఫోన్ చేసి అడిగితే ‘నీ కూతుర్ని మేం ఎందుకు కిడ్నాప్ చేస్తాం సాబ్’ అన్నారట. సంఘటనా స్థలంలో... మర్నాడు పొద్దున విచారణ కోసం సంఘటనా స్థలానికి మా వాళ్లు నిందితుల్ని తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో నిందితులు మావాళ్లపై దాడిచేసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆత్మరక్షణలో భాగంగా నేరుస్తులపై ఎదురు కాల్పులు జరిపారు. దాంతో ఆ ముగ్గురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. ఇంతలో మానవహక్కుల సంఘంవాళ్లు మాపై రకరకాల ఆరోపరణలు చేయడం మొదలుపెట్టారు. పోలీసులపై ఎలాంటి దాడి చేయకుండానే నిర్దాక్షిణ్యంగా నిందితులపై కాల్పులు జరిపామని ఆరోపించారు. వార్తాపత్రికల్లో ఆ విధమైన కథనాలు కూడా మొదలయ్యాయి. సాక్ష్యాల కోసం మానవహక్కుల సంఘం వారు సంఘటనా స్థలం పరిసరాల్లోని స్థానికుల దగ్గరికి వెళ్లారు. ‘నేరస్తులు పోలీసులపై దాడి చేయడం మేం కళ్లారా చూశాం’ అని చెప్పారు అక్కడి స్థానికులు. అప్పటికి రాష్ట్రంలో నెలకి రెండు మూడు కిడ్నాప్ కేసులు జరుగుతుండగా, ఈ కేసు పరిష్కారం తర్వాత ఆరు నెలల వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. - భువనేశ్వరి ఫొటోలు: రాజేశ్ -
రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు
20 శాతం పెరిగిన అత్యాచారాలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 823 పశ్చిమ గోదావరి, ఖమ్మం, సైబరాబాద్‌లో అత్యధికం మహిళలపై నేరాల్లో 24 శాతం పెరుగుదల భయాందోళన కలిగిస్తున్న దోపిడీ, దొంగతనాలు.. పెరిగిన ఆస్తి హత్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. వారిపై అత్యాచారాలు, హత్యలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కిడ్నాపులూ పెరిగాయి. కానివారు, అయినవారు అతివలపై ఘోరాలకు తెగబడుతున్నారు. గత ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో అత్యాచారాలు గణనీయంగా 19.62 శాతం పెరిగాయి. మహిళలపై మొత్తం నేరాలు 24.64 శాతం పెరిగాయి. వారిని కిడ్నాప్ చేసిన కేసులు 14.98 శాతం ఎక్కువయ్యాయి. పిల్లలు, ఇతరుల కిడ్నాపులు, దోపిడీలు, దొంగతనాలు, చీటింగ్ నేరాలు కూడా జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ వివరాలతో రాష్ట్ర పోలీసు శాఖ.. జాతీయ నేర నమోదు విభాగానికి(ఎన్సీఆర్బీ) ఇటీవల నివేదిక పంపింది. అందులోని వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ దాకా ఐపీసీ సెక్షన్ల కింద మొత్తం 1,06,724 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది కంటే ఇవి 14.29 శాతం ఎక్కువ. ఐపీసీయేతర కేసులు 58,907 కాగా, 83,731 దర్యాప్తులో ఉన్నాయి. పెండింగ్ కేసులు హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, నెల్లూరు జిల్లాలో అత్యధికం. కోర్టుల్లో 3,16,149 కే సులు విచారణలో ఉన్నాయి. 27,551 నాన్‌బెయిలబుల్ వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆగని మృగాళ్ల ఘాతుకాలు.. గత ఏడాది తొలి ఆరు నెలల్లో 688 అత్యాచారాల కేసులు నమోదుకాగా... ఈ ఏడాది జూన్ వరకూ 823 నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు 990 నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 68 అత్యాచార కేసులు, సైబరాబాద్‌లో 103, కరీంనగర్లో 61, హైదరాబాద్ సిటీ, ఖమ్మంలో 58 నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 24.64 శాతం పెరిగి, ఈ కేసుల సంఖ్య 15,868గా నమోదైంది. 14 శాతం పెరిగిన దోపిడీ కేసులు. గత ఏడాదితో పోలిస్తే దోపిడీ కేసులు 14.04 శాతం, ఇంటి దొంగతనాల కేసులు 19.80 శాతం పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆరు నెలల్లో హత్యలు 7.93 శాతం తగ్గాయి. అయితే ఆస్తికోసం జరిగే హత్యలు మాత్రం 23.66 శాతం పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు స్వల్పంగా పెరిగి 1,745కు చేరాయి. రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయి. మొత్తం 22,891 రోడ్డు ప్రమాదాల్లో 7,912 చనిపోగా, 28,323 మంది గాయపడ్డారు.