కిడ్నాప్ కేసుల కథ కంచికేనా?
- ముందుకు కదలని మహిళల అపహరణ కేసులు
- అధికశాతం కేసులు దర్యాప్తులోనే..
- అందుబాటులోకి రాని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీస్ శాఖ, వారిపై దాడులు, కిడ్నాపులకు సంబంధించిన కేసుల్లో మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకోలేకపోతోంది. మహిళలను కిడ్నాపు చేసిన కేసులు ఏళ్ల పాటు దర్యాప్తు దశలోనే ఉండిపోతున్నాయి. కేసుల దర్యాప్తు పరిస్థితి ఏంటి? ఎంతవరకు వచ్చిందన్న అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడమే శిక్షల శాతం పెరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఎందుకీ పరిస్థితి?
అపహరణకు గురైన మహిళలను రక్షించడంలో 45శాతం సఫలమవుతున్న పోలీసులు ఆ మేరకు నిందితులకు శిక్షపడేలా చేయడంలో అలసత్వం వహిస్తున్నారని అపవాదు ఎదుర్కొంటున్నారు. సరైన ఆధారాలు సేకరించకపోవడం, మిగతా లింకును బయటపెట్టకపోవడంతో నిందితులు సులభంగా తప్పించుకోగులుగుతున్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులేవీ?..
ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించకపోవడం కూడా శిక్షల శాతం పెరగకపోవడంలో మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది. కోర్టుల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ వ్యవస్థను తీసుకు రావాల్సిన పోలీస్ శాఖ అటువైపు ఆలోచించడం కూడా మానేసింది.
2014 నుంచి 2016 డిసెంబర్ వరకు మహిళల కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచార కూపంలోకి దింపిన సంఘటనల్లో కేసులు 2,046
వీటిలో తప్పుడు కేసులనే కారణంతో మూసివేసినవి 472
దర్యాప్తునకు స్వీకరించిన కేసులు 1,574
కేవలం కిడ్నాపునకు సంబంధించి దర్యాప్తు దశలోనే ఉన్న కేసులు 493
కిడ్నాపు కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డ కేసులు 6.5%