సాక్షి, ముంబై: మహిళల భద్రత కోసం ముంబై పోలీసు శాఖ ‘సేవ్ మై నంబర్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నామని, మహిళల నుంచి మంచి స్పందన వస్తే దీన్ని శాశ్వతంగా కొనసాగిస్తామని నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. దీని ద్వారా మహిళల ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు వివిధ సమస్యలపై మార్గదర్శనం చేస్తారు. నగరంలో మహిళల వేధింపులు, ఈవ్‌టిజింగ్ కేసులు పెరిగిపోయాయి.
ఉద్యోగం చేసే చోట లైంగిక వేధింపులు, ఇతర ఇబ్బందులపై ఫిర్యాదులు చేసేందుకు మహిళలు ముందుకు రావడం లేదు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఈవ్‌టీజింగ్‌లపై ఫిర్యాదు చేయడానికి నగర పోలీసు శాఖ ఇదివరకే 100,103 హెల్ప్ లైన్ నంబర్లు ప్రవేశపెట్టింది. ఈ నంబర్లుపై నిర్భయంగా ఫిర్యాదు చేసే అవకాశమున్నా కూడా ఫిర్యాదు నమోదుచేసిన పోలీసు అధికారి పేరు బాధిత మహిళలకు తెలియదు. దీంతో సేవ్ మై నంబరు పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై రెండు రోజుల కింద డిప్యూటీ పోలీసు కమిషనర్ స్థాయి అధికారులతో సమావేశం జరిగింది.
ప్రయోగాత్మకంగా 12 పోలీసు యూనిట్ల పరిధిలో ఈ పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అందుకు ప్రత్యేకంగా ఒక నంబరును త్వరలో విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీ యూనిట్‌లో నలుగురు పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. సేవ్ మై నంబర్‌కు ఫిర్యాదుచేస్తే అక్కడున్న అధికారి పేరు, ఆయన ఫొటో కనిపిస్తుంది. దీంతో మనం ఏ అధికారికి ఫిర్యాదు చేశామనేది బాధిత మహిళలకు తెలుస్తుంది. తరువాత ఈ ఫిర్యాదుపై ఫాలోఅప్ చేయడానికి సులభతరం కానుంది. అంతేగాకుండా ఆ నంబరుపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళల ఫొన్ నంబరును గోప్యంగా ఉంచుతారు. అవసరమైతే పోలీసులు బాధితుల ఇంటికెళ్లి అసలు విషయాలు తెలుసుకుని వారికి సలహాలు ఇస్తారని రాకేశ్ మారియా పేర్కొన్నారు.
మహిళల భద్రతకు సేవ్ మై నంబర్
Published Wed, May 6 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement