బెంగళూరు: కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? బ్యాంకులో విద్యారుణం తీసుకోవటం, తెలిసినవార వద్ద అప్పుగా తీసుకోవటం వంటివి చేస్తారు? కొందరు తప్పని పరిస్థితుల్లో చదువు మానేస్తారు కూడా. కానీ, ఓ డిగ్రీ విద్యార్థి ఏకంగా కిడ్నాప్ చేశాడు. ఓ ధనవంతుడి కుమారుడిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు తీసుకున్నాడు. వాటితో కాలేజీ ఫీజు కట్టి ఓ బైక్, డిజిటల్ కెమేరా కొనుగోలు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకున్న బికాం విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 23 ఏళ్ల ఎం సునీల్ కుమార్‌గా గుర్తించారు. అలాగే.. నిందితుడి స్నేహితుడు, మండికల్‌కు చెందిన వైవీ నగేశ్‌ని సైతం అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. రమేశ్ బాబు అనే కార్పొరేట్ వర్కర్ కుమారుడిని ఇద్దరు స్నేహితులు కలిసి సెప్టెంబర్ 2న కిడ్నాప్ చేశారు. రమేశ్ బాబు కొడుకు భవేశ్ తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడని ముందుగానే తెలుసుకుని.. అక్కడికి వెళ్లారు నిందితులు. కత్తి చూపించి బాలుడిని తండ్రి కారులోనే కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకోసం భవేశ్ తండ్రి మొబైల్ ఫోన్‌నే ఉపయోగించటం గమనార్హం. డబ్బులు ఇచ్చేందుకు రమేశ్ బాబు అంగీకరించటంతో.. రైల్వే ట్రాక్ సమీపంలో నగదు తీసుకుని బాలుడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనపై రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ కెమెరాలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు ప్రస్తుతం నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కళాశాల ఫీజు చెల్లించలేకపోవటంతో.. బాలుడిని కిడ్నాప్ చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. బాలుడి తండ్రి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నతర్వాత నిందితుడు.. కళాశాలలో ఫీజు కట్టాడు. అందులోంచి ఓ బైక్, డిజిటల్ కెమెరాను కొనుగోలు చేశాడు.
ఇదీ చదవండి: చైనా మాస్టర్ ప్లాన్.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు!
Comments
Please login to add a commentAdd a comment