ముందే చెప్పివుంటే... | Soumya mishra talks about a real crime story | Sakshi
Sakshi News home page

ముందే చెప్పివుంటే...

Published Sun, Mar 29 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

ముందే చెప్పివుంటే...

ముందే చెప్పివుంటే...

బెస్ట్ కేస్: అప్పటికి రాష్ట్రం నలుమూలలా కిడ్నాప్ కేసుల మోత మోగుతోంది. 2008... వరంగల్ ఎస్పీగా పనిచేస్తున్నాను. మా జిల్లాలో కిడ్నాప్‌లేం లేవు కదా అనుకుంటుండగా ఒకరోజు ఒకతను ఫోన్ చేసి ‘మా తొమ్మిదేళ్ల పాపని ఎవరో కిడ్నాప్ చేశారు, 20 లక్షలు ఇవ్వాలంటున్నారు’ అని చెప్పాడు. సాయంత్రం పాప స్కూలు నుంచి ఇంటికి  తిరిగొస్తుండగా దుండగలు ఎత్తుకెళ్లారు. ముందుగా కిడ్నాప్ అయిన అమ్మాయి తండ్రిని కూర్చోబెట్టి ఎవరిపైనైనా అనుమానం ఉంటే చెప్పమన్నాను. పేర్లు, చిరునామాలతో సహా చెప్పాడు. కేసు త్వరగానే పరిష్కారమవుతుందనుకున్నాను.  
- సౌమ్యమిశ్రా
స్పెషల్ సెక్యురిటీ హోమ్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ.
చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ

 
 పాతకక్షల కారణంగా...
 అమ్మాయి తండ్రి చెప్పిన ముగ్గురిని స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తే ఎలాంటి సాక్ష్యాధారాలూ దొరకలేదు. నిజానికి ఆ పని చేసింది వాళ్లు కాదు. ఇంతలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి పాప వివరాలు తెలుసునన్నాడు. ఫలానాచోట ఆ అమ్మాయిని చూశాననీ, ఎవరో రేప్ చేశారనీ...ఇలా నోటికొచ్చిన అబద్ధాలాడుతూ అసలు విషయం చెప్పకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అలాంటి ఫేక్ కాల్స్ మాకే కాదు, టీవీ ఛానళ్ల వారికి కూడా చేసి పాప వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పటివరకు  గోప్యంగా సాగిన విచారణ బట్టబయలైంది. తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్ అయి ఇన్ని గంటలైనా, ఇన్ని రోజులైనా పోలీసులు చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారంటూ కథనాలు  మొదలయ్యాయి.
 
 రెండు రోజులు వృథా...
 అమ్మాయి ఎక్కడుందో తెలుసునంటూ ఫోన్లు చేసి మమ్మల్ని తిప్పలు పెట్టిన నేరస్తుడ్ని పట్టుకోడానికి మాకు రెండు రోజులు పట్టింది. చివరకు అతడు హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో దొరికాడు. తీరా చూస్తే ఊరికే డబ్బులకోసం చేశానంటాడు. అప్పటికే అతడిపై చాలా కేసులున్నాయి. అతడి విషయం పక్కన పెట్టి తిరిగి పాప ఎక్కడుందో విచారణ మొదలుపెట్టాం. ప్రతిరోజు పాప తల్లిదండ్రులు స్టేషన్‌కి వచ్చి కనిపించేవారు. ఆ తల్లి ఆవేదనను మాటల్లో చెప్పలేం. ఆమెను చూడగానే నాక్కూడ కళ్లలో నీళ్లు తిరిగేవి. కారణం అప్పటికి మా అమ్మాయి వయసు ఆరేళ్లు. రోజు నిద్రపోయేముందు కిడ్నాప్ అయిన పాపే గుర్తుకొచ్చేది. కిడ్నాప్ అయి మూడురోజులు గడిచిపోయింది. ఈ మూడురోజుల్లో నేను గమనించిన విషయం ఏంటంటే... పాప తండ్రి ప్రవర్తన కొద్దిగా చిత్రంగా అనిపించింది.
 
 తండ్రి నోరిప్పలేదు...
 అమ్మాయి కిడ్నాప్ అయిన క్షణం నుంచి ఏ పూట చూసినా తల్లి రోదన ఒక్కతీరుగానే ఉంది. తండ్రి ప్రవర్తన అలా లేదు. అతను ఏదో విషయం దాస్తున్నట్టు అనిపించింది. అతని వద్ద నుంచి ఏ చిన్న క్లూ అయిన దొరకకపోతుందా అని ప్రతిరోజు పిలిపించుకుని ప్రశ్నించేదాన్ని. ఏమీ  బయటపెట్టలేదు. నాలుగురోజులు గడిచిపోయాయి. నాలుగు టీమ్‌లు జిల్లాలో వీధి వీధి గాలిస్తున్నాయి. పాప గురించి ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ‘మర్యాదగా మేం అడిగిన 20 లక్షలు మేం చెప్పిన ప్లేస్‌కి పంపిస్తే పాపను కాజీపేట్‌లో వదిలేసిపోతాం. పోలీస్ కంప్లయింట్ వంటివి ఇస్తే పాప ప్రాణాలతో ఉండదు’ అంటూ మరోసారి వాళ్లు ఫోన్ చేశారంటూ పాప తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈసారి అతని ముఖంలో భయం కనపడింది. మాక్కావాల్సింది అదే. ఎందుకంటే ఎవరైనా నిజం చెప్పాలంటే వారికి ఉండాల్సింది భయం.
 
 ఆ ముగ్గురే...
 విషయం ఏంటంటే కిడ్నాప్‌కి గురైన పాప తండ్రి పదిరోజుల క్రితం ఓ ముగ్గరు రౌడీలకు ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ముందుగా ఎవరిపైన అయితే అనుమానం ఉందని చెప్పాడో వారిని కొట్టించడం కోసం. ఏవో పాత తగాదాలన్నమాట. వారిపై దాడిచేయడం కోసం ఒక కిరాయి హంతకుడ్ని, మరో ఇద్దరు రౌడీషీటర్లకు డబ్బిచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పాప తండ్రి చిరువ్యాపారి కావడంతో డబ్బులు బాగా ఉంటాయని అనుకున్నారో ఏమో  ఆ ముగ్గురు... అసలు మాట్లాడుకున్న పనిని పక్కనపెట్టి ఇతని కూతుర్ని ఎత్తుకుని పారిపోయారు. పాపకు ముందే వారితో పరిచయం ఉండడం కారణంగా స్కూలు దగ్గర వారు పిలవగానే వారితో వెళ్లిపోయిందన్నమాట.
 
 అప్పుడే చెప్పి ఉంటే...
 మొదట కిడ్నాప్ కాల్ రాగానే ఇతనికి ఆ కిరాయి గుండాలపై అనుమానం వచ్చి ఫోన్ చేసి అడిగితే ‘నీ కూతుర్ని మేం ఎందుకు కిడ్నాప్ చేస్తాం సాబ్’ అన్నారట. దాంతో ఇతను తన శత్రువులను అనుమానించాడు. వారి పేర్లు చెప్పి ఊరుకున్నాడు.  నేను వెంటనే మరో ఐదు బృందాలను ఇతను చెప్పిన వివరాలతో విచారణకు పంపించాను. మర్నాడు పొద్దున స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కి ఒక ఫోన్ వచ్చింది. కాజీపేట దగ్గర ఒక గ్రామం శివారులోని బావిలో ఒక పాప శవం ఉందని చెప్పారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే చనిపోయింది కిడ్నాప్‌కి గురైన పాపే. అయ్యో...పాపని రక్షించలేకపోయామే అని బాధపడ్డాను. పాప తండ్రిని ఏంచేసినా పాపం లేదనిపించింది. నాలుగురోజుల వరకూ ఆ ముగ్గురు రౌడీల విషయం మాకు చెప్పకుండా దాచి కడుపున పుట్టిన బిడ్డను పోగొట్టుకున్నాడు.
 
 24 గంటల్లో...
 రెండేళ్లు, మూడేళ్ల పాప అయితే దుండగులను గుర్తుపట్టే అవకాశం ఉండదు. తొమ్మిదేళ్ల పాప...పైగా పరిచయం ఉన్నవారి కిడ్నాప్.. ఆ అమ్మాయి ప్రాణాలతో దొరికితే వారికి ప్రమాదమనుకుని చంపేసి పారిపోయారని అనుకున్నాను. పాపను గొంతునులిమి చంపేసి బావిలో పడేసిపోయారు. ఆ సంఘటన జరిగిన 24 గంటల్లో ఆ ముగ్గురిలో ఒకర్ని పట్టుకున్నాం. అతన్ని విచారిస్తే మిగతా ఇద్దరిని కూడా పట్టుకున్నాం. ఒకతనిపై కరీంనగర్‌లో మర్డర్ కేసు ఉంది. మరో వ్యక్తిపై కత్తితో దాడిచేసి గాయపరిచిన కేసులు నాలుగున్నాయి. మూడో వాడిపై 304 సెక్షన్‌కింద నాలుగు కేసులున్నాయి.
 
 ప్రెస్‌మీట్‌లో...
 అప్పటికే ఈ కేసు గురించి రాష్ట్రం నలుమూలాల పాకింది. ఇక వరంగల్ జిల్లా వాసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేరస్తుల్ని పట్టుకున్నామన్న వార్త తెలియగానే జనమంతా వారిపై కోపంతో ఊగిపోతున్నారు. డబ్బు కోసం పసిబిడ్డను అంత దారుణంగా హత్య చేయడం అందరినీ భయాందోళనలకు గురిచేసింది. నేను వెంటనే ప్రెస్‌మీట్ పెట్టాను. ఆ సందర్భంగా ప్రెస్‌వాళ్లు అడిగిన ప్రశ్నలకు నిందితులు వివరంగా సమాధానాలిచ్చారు. పాప ఎలా చంపారో మాటలతో కాదు...చేతలతో చూపించి మరీ చెప్పారు. ‘వీడు పాపని కాళ్లపై పడుకోబెట్టుకున్నాడు. నేను పాప కాళ్లు, చేతులు కదపకుండా గట్టిగా పట్టుకుంటే వీడు పాప గొంతునులుమి చంపేశాడు...’ అంటూ టీవీలోని డైలీ సీరియల్ స్టోరీ చెప్పినట్టు చెప్పారు. మాకే కాదు, వారి మాటలు విన్నవారందరికీ రక్తం ఉడికిపోయింది.
 
  కిడ్నాప్ కాల్ రాగానే ఇతనికి ఆ కిరాయి గుండాలపై అనుమానం వచ్చి ఫోన్ చేసి అడిగితే ‘నీ కూతుర్ని మేం ఎందుకు కిడ్నాప్ చేస్తాం సాబ్’ అన్నారట.
 
 సంఘటనా స్థలంలో...
 మర్నాడు పొద్దున విచారణ కోసం సంఘటనా స్థలానికి మా వాళ్లు నిందితుల్ని తీసుకుని  వెళ్లారు. ఆ సమయంలో నిందితులు మావాళ్లపై దాడిచేసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆత్మరక్షణలో భాగంగా నేరుస్తులపై ఎదురు కాల్పులు జరిపారు. దాంతో ఆ ముగ్గురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. ఇంతలో మానవహక్కుల సంఘంవాళ్లు మాపై రకరకాల ఆరోపరణలు చేయడం మొదలుపెట్టారు. పోలీసులపై ఎలాంటి దాడి చేయకుండానే నిర్దాక్షిణ్యంగా నిందితులపై కాల్పులు జరిపామని ఆరోపించారు. వార్తాపత్రికల్లో ఆ విధమైన కథనాలు కూడా మొదలయ్యాయి. సాక్ష్యాల కోసం మానవహక్కుల సంఘం వారు సంఘటనా స్థలం పరిసరాల్లోని స్థానికుల దగ్గరికి వెళ్లారు. ‘నేరస్తులు పోలీసులపై దాడి చేయడం మేం కళ్లారా చూశాం’ అని చెప్పారు అక్కడి స్థానికులు. అప్పటికి రాష్ట్రంలో నెలకి రెండు మూడు కిడ్నాప్ కేసులు జరుగుతుండగా, ఈ కేసు పరిష్కారం తర్వాత ఆరు నెలల వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.  
 - భువనేశ్వరి
 ఫొటోలు: రాజేశ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement