అనుమతిలేని మెడికల్ షాపులపై చర్యలు
Published Sun, Sep 1 2013 11:02 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
పుణే సిటీ, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించామని, ఇప్పటిదాకా 2,586 షాపులను తనిఖీ చేయగా 192 షాపులు అనుమతులు లేకుండానే మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
ఈ విషయమై ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం కమిషనర్ మహేశ్ జగడే మాట్లాడుతూ... ‘నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారే మందులను విక్రయించాలి. రాష్ట్రవ్యాప్తంగా 51,000 మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఉంది. నిజానికి వీటి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం మెడికల్ షాపుల్లో దాదాపు 35 శాతం దుకాణాలకు అనుమతి లేనట్లు మా పరిశీలనలో వెల్లడైంది. దీంతో వీటిపై చర్య తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం.
డాక్టర్ రాసిచ్చిన చీటీ ఉంటేనే మందులను ఇవ్వాలనే నిబంధన ఉన్నా చాలా దుకాణాలు ఈ నిబంధనను పాటించడం లేదు. నిర్దేశించిన మోతాదు, కంపెనీ అన్నీ సరిపోలిన మందులనే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా విక్రయదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది రోగి ప్రాణానికే అపాయం కలిగించే అవకాశముంటుంది. ఇటువంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని దుకాణాలను మూసివేయిస్తామ’న్నారు.
Advertisement
Advertisement