హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నం
ప్రాణాపాయ స్థితిలో అగ్రికల్చర్ విద్యార్థి
స్నేహితుల మధ్య వివాదం కారణంగా మనస్తాపం
గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో ఘటన
మేడ్చల్ రూరల్: పురుగుల మందు తాగడంతో పాటు హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అగ్రికల్చర్ విద్యార్థి ఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలో చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి హరినాథ్ మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలోని అగ్రికల్చర్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. మూడు రోజులుగా కళాశాలలో తోటి విద్యార్థుల మధ్య గొడవల కారణంగా మనస్తాపం చెందిన హరినాథ్ బుధవారం హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నాడు.
అనంతరం తాను ఉంటున్న హాస్టల్ భవనం పైఅంతస్తుకు వెళ్లి పక్కనే ఉన్న సాయి బాలాజీ హాస్టల్ భవనంపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నంచాడు. భవనంపై నుంచి దూకుతున్న క్రమంలో విద్యుత్ తీగలపై పడి.. అనంతరం కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. హరినాథ్‌ను చికిత్స నిమిత్తం 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
సారీ మామా..
ఆత్మహత్య యత్నానికి ముందు హరినాథ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అరే మామా.. (ఫ్రెండ్స్‌నుద్దేశించి) సారీ మామా తట్టుకోలే కపోతున్నాను. ఓ ఇద్దరు విద్యార్థుల పేర్లు ప్రస్తావించి వారిని వదిలిపెట్టవద్దని కోరాడు. మామా.. మా అమ్మ తట్టుకోలేదు. త్వరగా వచ్చేయ్ మామా... ప్లీజ్ మామా.. ఏడుపోస్తుంది మామా.. అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.
ఆ వీడియో మిత్రులకు పంపినట్లు సమాచారం. గత మూడు రోజులుగా విద్యార్థుల మధ్య వాగ్వాదం కారణంగా సున్నితమైన మనస్తత్వం కలిగిన హరినాథ్ మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హరినాథ్ తన వీడియోలో తెలిపిన విద్యార్థుల పేర్లు, కారణాలపై ఆరా తీసున్నారు.
Comments
Please login to add a commentAdd a comment