అక్రమాల్లో విక్రమార్కులు | No Permission Tdp Office Construction In Srikakulam | Sakshi
Sakshi News home page

అక్రమాల్లో విక్రమార్కులు

Published Sun, Aug 18 2019 9:36 AM | Last Updated on Sun, Aug 18 2019 9:45 AM

No Permission Tdp Office Construction In Srikakulam - Sakshi

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? రాష్ట్రాధినేత అక్రమ నిర్మాణాలు సాగిస్తే... వాటిని యథేచ్ఛగా ప్రోత్సహిస్తే... ఆ అక్రమ భవనాల్లో మకాం పెడితే... ఆయన వంది మాగధులు ఊరుకుంటారా? నీవు నేర్పిన విద్య  నీరజాక్ష అన్నట్టుగా అనుసరిస్తారు. తామేమీ తక్కువ కాదన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. అధినేత చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఆదర్శంగా తీసుకుని ఇష్టమొచ్చిన రీతిలో దందాలు చేశారు. తమను అడ్డుకునేదెవరని అధికార దర్పంతో చెలరేగిపోయా రు. టీడీపీ కార్యాలయం కోసం అక్రమ కట్టడాన్ని నిర్మించేశారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  చేతిలో అధికారం ఉందని పార్టీ కార్యాల యం కోసం ఎకరానికి బదులు రెండెకరాలు తీసుకున్నారు. 30 సంవత్సరాల లీజుకు బదులు 99 సంవత్సరాల లీజుకు రాయించుకున్నారు. రూ.12 కోట్ల విలువైన భూమిని సంవత్సరానికి రూ.25 వేల లీజు ధరకు చేజిక్కించుకున్నారు. అంతటితో ఆగలేదు. వుడా, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అనుమతులు పొందకుండానే ఏకంగా (జీ ప్లస్‌ 2) రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించేశారు. పనిలో పనిగా పక్కనున్న కొంత స్థలాన్ని నిర్మాణంలో కలిపేసుకున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయించారు.

అనుమతుల కోసం ఒక్క రూపాయీ చెల్లించని టీడీపీ కార్యాలయం..  
జీ ప్లస్‌ 2 భవనం కోసం 2017 ఫిబ్రవరిలో విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వుడా) అధికారులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష దరఖాస్తు చేశారు. వుడా, కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి బెటర్‌మెంట్‌ చార్జి కింద రూ.6 లక్షల 7 వేల 50లు చెల్లించాలని నోటీసు జారీ చేశారు. ఇంత మొత్తం చెల్లించలేమని, రెండెకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ కేవలం 25 సెంట్లలో మాత్రమే నిర్మాణం చేపట్టామని, ఆమేరకు తమకు ప్లాన్‌ అనుమతి ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఆ అధికారం తమకు లేదని, మొత్తం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటామని, భవనం మేరకు ప్లాన్‌ ఇవ్వలేమని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వానికి ఫైలు పంపిస్తే అక్కడ మేం చూసుకుంటామని టీడీపీ నేతలు సూచించారు. దీంతో ప్రభుత్వానికి ఫైలు వెళ్లింది. ప్రభుత్వం వాళ్లదే కావడంతో సంబంధిత ఉన్నతాధికారులు జీ హుజూర్‌ అనేశారు. చెప్పినట్టుగా సంతకం పెట్టేశారు. అంతటితో ఆగకుండా 25 సెంట్లకే ప్లాన్‌ అప్రూవల్‌ ఇవ్వాలని హుటాహుటిన వుడా, కార్పొరేషన్‌ అధికారులకు ఆదేశాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు.

నిబంధనలకు విరుద్ధం...
కట్టడం ఎంత ఉన్నా ప్రహరీతో కూడిన విస్తీర్ణానికే ప్లాన్‌ తీసుకోవాలి. ఆమేరకు కార్పొరేషన్‌ అధికారులు నిర్దేశించిన ఫీజు చెల్లించి అనుమతి పొందాలి. కానీ ఎక్కడ బెటర్‌మెంట్‌ చార్జీ ఎక్కువగా ఉందని చెప్పి రెండెకరాల విస్తీర్ణంలో ప్రహరీ, భవనం నిర్మించినా కేవలం భవనానికి మాత్రమే ప్లాన్‌ అప్రూవల్‌ ఇవ్వాలని అధికారులపై కత్తి పెట్టారు. వారిపై ఒత్తిడి తెచ్చి ఫైలు పెట్టించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులతో సానుకూలంగా సంతకం చేయించుకున్నారు. 

వెలుగు చూసిన ఆక్రమణ.. 
ప్రభుత్వ ఉన్నతాధికారులు 25 సెంట్లకే ప్లాన్‌ అప్రూవల్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చిన వెంటనే వుడా అధికారులు జాగ్రత్తపడ్డారు. ఇదేదో సమస్యగా మారి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని, ఇక్కడ చోటు చేసుకున్న ఆక్రమణ విషయాన్ని కాగితంపై పెట్టారు. టీడీపీ భవన్‌కు దక్షిణం వైపు ఉన్న రోడ్డును ఆనుకొని కొంత ఆక్రమిత స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారని, దాని తొలగించి, రిమార్క్స్‌తో కూడిన ప్లాన్‌ ఫైలు పెట్టాలని మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేతల దృష్టికి కార్పొరేషన్‌ అధికారులు తీసుకెళ్లారు. కానీ వారంతా గమ్మున ఉండిపోయారు. అధికార చేతిలో ఉంది... ఎవరేమి చేస్తారు అన్న ధోరణితో వుడా అధికారులు సూచించిన విధంగా ప్లాన్‌కు దరఖాస్తు పెట్టుకోలేదు. ఒక్క రూపాయి ఫీజు చెల్లించకుండా... ప్లాన్‌ అనుమతి పొందకుండానే చంద్రబాబు చేతుల మీదుగా అట్టహాసంగా కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయించారు. ప్రస్తుతానికి ఇది అక్రమ కట్టడమే కాకుండా ఆక్రమిత స్థలంలో నిర్మించిన భవనంగా కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి చెల్లించకుండా కొనసాగుతున్న భవనం జోలికే వెళ్లడం లేదు. 

టీడీపీ నేతలు చెప్పినట్టు ప్లాన్‌ ఇస్తే... మిగులు భూమి స్వాధీనం చేసుకోవల్సిందే...
ప్రభుత్వం నుంచి పొందిన స్థలాన్ని రెండు సంవత్సరాల్లోగా పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి. ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఆమేరకు నిర్మాణాలు చేపట్టాలి. నిరుపయోగంగా ఉంటే స్వాధీనం చేసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంది. రెండెకరాల స్థలంలో ప్రహరీతో కూడిన భవనాన్ని నిర్మించినప్పటికీ తాము కేవలం 25 సెంట్లలోనే భవనం నిర్మించామని, దానికే ప్లాన్‌ అప్రూవల్‌ ఇవ్వాలని డిమాండ్‌తో కూడిన అర్జీని టీడీపీ నేతలు పెట్టారు. దానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఈ లెక్కన మిగతా ఎకరా 75 సెంట్లు ఖాళీగా ఉన్నట్టుగానే భావించాలి. ఆ ప్రకారం నిరుపయోగంగా ఉం దని గుర్తించి.. ఇప్పుడున్న డిమాండ్, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా కలెక్టర్‌ స్వాధీనం చేసుకోవచ్చు. ఆ దిశగా చర్యలు చేపడితే పట్టణంలోని ఎకరా 75 సెంట్ల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికైతే, ఈ భూమిని షెడ్యూల్‌ కులాల నివాసిత స్థలాల కోసమే గతంలో సాంఘిక సంక్షేమ శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ భూమి ఖాళీగా ఉందని టీడీపీ కన్నేసి కొట్టేసింది. ఇప్పుడు టీడీపీ నేతలే 25 సెంట్లలోనే నిర్మాణం చేపట్టామని అధికారికంగా అంగీకరించారు. ఈ లెక్కన మిగతా ఎకరా 75 సెంట్లు ఖాళీగా ఉందని వేరొక అవసరాలకు కేటాయిస్తే సరిపోతుంది. 

టీడీపీ భవన్‌కు అనుమతుల్లేవు.. 
టీడీపీ కార్యాలయ భవన్‌కు అనుమతుల్లేవు. కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి చెల్లించలేదు. 6 లక్షల 7 వేల 50 రూపాయలు బెటర్‌మెంట్‌ చార్జి చెల్లించమని నోటీసు ఇస్తే అభ్యంతరం తెలిపారు. రెండు ఎకరాలకు కాకుండా కేవలం 25 సెంట్లకే ప్లాన్‌ అప్రూవల్‌ ఇవ్వాలని మరో అర్జీ పెట్టారు. దానికి ఉన్నతాధికారుల ఆమోదం రావడంతో తదుపరి ఎండార్స్‌మెంట్‌ ఇచ్చారు. కానీ దానిపై టీడీపీ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతానికి టీడీపీ భవనం అక్రమ కట్టడమే. 
– దేవకుమార్, కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement