మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం  | Unauthorized Water Plants In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం 

Published Mon, Apr 26 2021 8:45 AM | Last Updated on Mon, Apr 26 2021 8:54 AM

Unauthorized Water Plants In Andhra Pradesh - Sakshi

నీరు సృష్టిలో ప్రతి జీవరాశికి చాలా అవసరమైనది. మంచినీరు లేకపోతే మానవాళి లేదు. ప్రపంచంలో కేవలం 10 శాతం  నీరు మాత్రమే తాగేందుకు అనువైనది. మారుతున్న కాలక్రమంలో పెరిగిపోతున్న జనాభా వల్ల మంచినీరు కొరత రోజురోజుకూ పెరిగిపోతోంది. భూగర్భజలాలు అడుగంటడం, నీటి కాలుష్యం పెరిగిపోవడంతో మనుషుల జీవన విధానం, ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో బావులు, బోర్ల నుంచి వచ్చే నీటిని, పట్టణాలు, నగరాల్లో కుళాయి నీటిని తాగేవారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు ధనిక, పేద అనే తేడా లేకుండా మినరల్‌ వాటర్‌ను ఉపయోగించడం  మొదలుపెట్టారు.

ప్రజల తాగునీటి అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకున్న వ్యాపారులు పుట్టగొడుగుల్లా వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా వృద్ధి చెందింది. కాసులకు కక్కుర్తి పడిన వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండా వాటర్‌ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. మినరల్‌ వాటర్‌ పేరుతో జనరల్‌ వాటర్‌ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. మనం రోజూ మినరల్‌ వాటర్‌ పేరిట తాగుతున్న నీళ్లలోనూ ‘మినరల్‌’ అంతే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. తద్వారా వ్యాపారులు కోట్లు వెనకేసుకుంటున్నారు.  

(బొల్లం కోటేశ్వరరావు, సాక్షి అమరావతి బ్యూరో): మార్కెట్లో మినరల్‌ వాటర్‌ పేరిట మోసాల దందా జోరుగా సాగుతోంది. మారుమూల పల్లెల నుంచి పెద్దపెద్ద నగరాల వరకు అన్ని చోట్లా మినరల్‌ వాటరే ఆధిపత్యం సాధించడంతో జనం బావులు, బోరు నీళ్లకు, కుళాయి నీటికీ దాదాపు మంగళం పాడేశారు. తాము తాగేది సాదాసీదా నీరే అయినప్పటికీ మినరల్‌ వాటర్‌గానే భ్రమిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తమ ఇంటికి వాటర్‌ క్యాన్లు రప్పించుకోవడమో, క్యాన్లు తీసుకెళ్లి నీటిని తెచ్చుకోవడమో చేస్తున్నారు. ఇక బయటకు వెళ్లినా బాటిల్‌ నీళ్లు తాగడానికే  మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ వాటర్‌ ప్లాంట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి.

రాష్ట్రంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) అనుమతి పొందిన ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు 200లోపు ఉంటే.. ఆ సంస్థ అనుమతుల్లేకుండా నడుస్తున్నవి వేలల్లో ఉన్నాయి. ప్రజల్లో ఈ వాటర్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో వీటి ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదు. ఆర్వో(రివర్స్‌ ఆస్మాసిస్‌) ప్లాంట్లు, ఎక్స్‌ట్రా ఆడెడ్‌ మినరల్స్‌ అంటూ మోసం చేస్తున్నారు. మంచినీటి ఉత్పత్తిలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. అధికారుల తీరూ అలాగే ఉంది. వాటర్‌ ప్లాంట్‌కు దరఖాస్తు చేయగానే లోతుగా పరిశీలించకుండా ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేసేస్తున్నారు. ఆ తర్వాత మామూళ్ల రుచి మరిగి ఆ ప్లాంట్లలో జరుగుతున్న మోసాలను పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. 

కుటుంబ ఖర్చులో పెరిగిన మంచి నీటి వాటా 
నలుగురు సభ్యులున్న కుటుంబం రోజుకు సగటున 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ను వినియోగిస్తున్నారు. ఆ 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ ప్రాంతాన్ని, పోటీని బట్టి ప్లాంట్‌లో రూ.10 నుంచి 20 వరకు విక్రయిస్తున్నారు. అదే డోర్‌ డెలివరీ చేస్తే అదనంగా మరో రూ.10–15 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక కుటుంబం రోజుకు సగటున రూ.30 చొప్పున నెలకు రూ.900 వరకు వెచి్చస్తోంది. ఇది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్‌ బాటిల్‌ను కొని తాగుతున్నారు. లీటరు వాటర్‌ బాటిల్‌ ఖరీదు రూ.20 ఉంది.

ఇలా నెలలో సగటున ఐదారు బాటిళ్లు తాగినా రూ.100 వరకు ఖర్చవుతుంది. అంటే నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేలు కేవలం మంచినీళ్లకే చెల్లించాల్సి వస్తోంది. ఇక కార్యాలయాలకు 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ రూ.25–30కు సరఫరా చేస్తున్నారు. మారిన పరిస్థితుల్లో కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ పేరిట కూడా నీటిని అమ్ముతున్నారు. 20 లీటర్ల కూలింగ్‌ క్యాన్‌కు రూ.40–50 వరకు వసూలు చేస్తున్నారు. ఫంక్షన్లలో ఇలాంటి కూలింగ్‌ వాటర్‌కు ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. 

పాలతో నీళ్లకు పోటీ..  
రానురాను పరిస్థితి ఎలా తయారైందంటే తాము మంచినీళ్లకు పెట్టే ఖర్చు.. పాల కంటే మించిపోతోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. సగటు మధ్య తరగతి కుటుంబాలు మార్కెట్‌లో రూ.4–5 తక్కువ ధర ఉన్న పాల ప్యాకెట్‌కే మొగ్గు చూపుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అర లీటరు పాల ప్యాకెట్‌ ధర వెన్న శాతాన్ని బట్టి రూ.26 నుంచి 32 వరకు ఉంది. ఇలా పాలకు వెచి్చంచే సొమ్ము గరిష్టంగా రూ.900 అవుతుంది. అంటే పాలతో నీళ్ల ధర పోటీ పడుతోందని స్పష్టమవుతోంది. మనుషుల్లో ‘మినరల్‌ వాటర్‌’పై మోజుకు ఇది దర్పణం పడుతోంది.


విజయవాడ కృష్ణలంకలో నడుస్తున్న ఓ వాటర్‌ ప్లాంట్‌ ఇది. ఆ ప్లాంట్‌ బయట బోర్డుపై ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ అని రాసుంది. దాని దిగువనే ‘వివాహాది శుభకార్యాలకు ‘మినరల్‌ వాటర్‌’ సప్లై చేయబడును’ అని చిన్న అక్షరాలతో రాశారు. సాక్షి ప్రతినిధి అక్కడికి వెళ్లి టీడీఎస్‌ స్థాయిని గుర్తించే డిజిటర్‌ మీటర్‌ ఎక్కడని సిబ్బందిని ప్రశ్నిస్తే.. అసలు అలాంటిది ఉంటుందనే విషయమే వారికి తెలియదన్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, బీఐఎస్‌ సర్టిఫికెట్లు ఎక్కడ అని అడిగితే సమాధానం చెప్పలేదు. ఇళ్ల మధ్యలో ఇరుకుగా, పరిశుభ్రత లేకపోయినా అక్కడికి జనం వచ్చి నీటిని కొనుక్కొని వెళ్తున్నారు.

అక్కడకు సమీపంలోనే మరో పెద్ద వాటర్‌ ప్లాంట్‌ ఉంది. అది ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ పేరిట ఐఎస్‌ఐ గుర్తింపు లేకుండా నడుస్తోంది. అక్కడ రిటైల్‌లో అర లీటరు బాటిల్‌ రూ.10లు, లీటర్‌ బాటిల్‌ రూ.20లు, 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ రూ.20ల చొప్పున అమ్ముతున్నారు. ఐఎస్‌ఐ అనుమతి లేకుండా ఇంత పెద్ద ప్లాంట్‌ను ఎలా నడుపుతున్నారన్న ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నకు నిర్వాహకుడి నుంచి సమాధానం లేదు. ఇలా ఐఎస్‌ఐ గుర్తింపు లేకుండా అనధికారికంగా నడుస్తున్న ప్లాంట్లు ఒక్క విజయవాడ నగరంలోనే వందల్లో ఉన్నాయి.
  
ఇవీ నిబంధనలు..  
ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మొదటిగా వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలవనరుల శాఖ అనుమతి ఉండాలి. 500 మీటర్ల పరిధిలో మరో బోరు తవ్వకూడదు. ఫ్యాక్టరీలు, రసాయన కర్మాగారాలున్న చోట ఏర్పాటు చేయకూడదు. 
స్థానిక సంస్థలు (పంచాయతీ/మునిసిపాలిటీ/నగరపాలకçసంస్థ), రెవెన్యూ, కారి్మక, కాలుష్య నియంత్రణ మండలి, ప్రజారోగ్య శాఖ, తూనికలు, కొలతల శాఖ, ఆహార భద్రత అధికారి, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖల నుంచి అనుమతి పొందాలి. వీరి అనుమతి లేకుండా ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే సంబంధిత అధికారులు సీజ్‌ చేయవచ్చు.  
ప్యాకింగ్, బాట్లింగ్‌ చేసిన ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్‌కు ఐఎస్‌ఐ గుర్తింపు తప్పనిసరి. దీనిని భారత ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. ఐఎస్‌ఐ గుర్తింపును బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్‌ను ప్లాంట్‌లో కనిపించేలా వేలాడ దీయాలి. ఇది లేకుండా నడిచే వాటర్‌ ప్లాంట్‌ను సీజ్‌ చేసే అధికారం రెవెన్యూ అధికారులది.
ఒక్కసారి బీఐఎస్‌/ఐఎస్‌ఐ సరి్టఫికేషన్‌ వచ్చాక ఏటా రెన్యువల్‌ చేయించుకోవాలి. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే రెన్యువల్‌ చేయాలి.  
ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్‌కు ఐఎస్‌–14543, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌కు ఐఎస్‌–13428 మార్కును జారీ చేస్తారు. వాటిని వాటర్‌ బాటిళ్లపై ముద్రిస్తారు.  
ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సరి్టఫికేషన్‌ కూడా ఉండాలి.   
ఈ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేయాలి.  
శుద్ధి చేసిన నీటిలో టోటల్‌ డిజాల్‌్వడ్‌ సాల్వెంట్స్‌ (టీడీఎస్‌–ఖనిజాల స్థాయి) స్థాయి లీటరుకు 500 మి.గ్రా. కంటే తక్కువ ఉండాలి. అది తెలియజేయడానికి డిజిటల్‌ మీటర్‌ ఏర్పాటు చేయాలి.  
టీడీఎస్‌ చెక్‌ చేయడానికి ప్లాంట్‌లో ల్యాబ్‌ ఉండాలి. ఈ ల్యాబ్‌లో ల్యాబ్‌ టెక్నీíÙయన్‌ను నియమించాలి. నీటిని స్టోర్‌ చేయడానికి ట్యాంకులు ఉండాలి.   
నీటిని శుద్ధి చేసేందుకు వాడే కెమికల్స్‌ క్వాలిటీని తనిఖీ చేయాలి. ఈ నీటిలో ఎలాంటి హానికర పదార్ధాలు లేకుండా మనుషులు తాగడానికి వీలుగా ఉందని నిర్ధారించాకే విక్రయించాలి.
 బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ ఉంటేనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ జారీ చేస్తుంది. 
బీఐఎస్‌ లైసెన్స్‌ పొందిన కంపెనీలకు తయారు చేసే వాటర్‌ బాటిళ్లను కూడా బీఐఎస్‌ అధికారులు టెస్టింగ్‌ చేస్తారు. ప్యాకింగ్‌ మెటీరియల్, పరిశుభ్రత, వర్కర్లకు హెల్త్‌ చెకప్, గోళ్లు తీసుకుంటున్నారా? హెయిర్‌ కవర్‌ చేస్తున్నారా? వంటివి కూడా పరిశీలిస్తారు.  
ఆంధ్రప్రదేశ్‌ మునిసిపాలిటీస్‌ యాక్టు ప్రకారం బీఐఎస్‌ మార్కింగ్‌ లైసెన్స్‌ లేని మంచినీళ్ల తయారీ, విక్రయం నిషిద్ధం. అలాంటి ప్లాంట్లకు ఏ ప్రభుత్వ శాఖ లైసెన్స్‌ జారీ చేయకూడదు.  
నాన్‌ ఐఎస్‌ఐ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ కమిషన్‌ నం.9765/సీపీఆర్‌ అండ్‌ ఆర్‌ఈ/డీ3/2006లో సర్క్యులర్‌ మెమో జారీ చేసింది. 
బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ లేని వాటర్‌ ప్లాంట్లకు ఐఎస్‌ఐ సరి్టఫికెట్, ఇన్సెంటివ్‌లు రద్దు చేయాలని, విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించాలని పరిశ్రమల శాఖ 2002లోనే ఉత్తర్వులిచ్చింది.
ఐఎస్‌ఐ మార్కు లేని ప్లాంట్లపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 133 కింద కేసు నమోదు చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులున్నాయి. కానీ ఇవన్నీ ఎక్కడ అమలవుతున్నాయి? 

నిబంధనలకు ‘నీళ్లు’ 
రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న వాటర్‌ ప్లాంట్లు నిబంధనలు ఏవీ పాటించడం లేదు. అంతా ‘మినరల్‌ వాటర్‌’కే అలవాటు పడడం, వినియోగం పెరగడం, మంచి ఆదాయం సమకూరడంతో ఈ వాటర్‌ ప్లాంట్లు చిన్నచిన్న వీధుల్లోనూ పుట్టుకొస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలం 185 వరకు మాత్రమే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) లైసెన్స్‌లు పొందిన ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. కానీ అనధికారికంగా 12 వేలకు పైగానే ఇలాంటివి ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు రెండువేల వరకు అనధికారిక వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయని అంచనా. గుంటూరు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోనే చిన్న, చితకా కలిపి ఐదు వేలకు పైగా అనధికారిక వాటర్‌ ప్లాంట్లు ఉన్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో వాటర్‌ ప్లాంట్ల ద్వారా ఏటా వేల కోట్ల రూపాయల మంచినీటి వ్యాపారం జరుగుతున్నా ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో ఏమాత్రం జమ కావడం లేదు. మరోవైపు కొంతమంది చారిటీ, ట్రస్టుల పేరిట వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి అడ్డదారుల్లో సంపాదిస్తున్నారు. చారిటీ సంస్థలకు పన్ను మినహాయింపులతో పాటు పలు రాయితీలు దక్కుతాయి. ఇలా రిజిష్టర్‌ అయిన సంస్థలు ప్రజలకు వాటర్‌ను కారు చౌకగా ఇవ్వాలి. కానీ అలా చేయడం లేదు. చారిటీ పేరుతో ఐటీ, జీఎస్టీలను ఎగవేస్తున్నారు. 

పరిశుభ్రతకు ప్రాధాన్యమేది?  
నిత్యం ఇళ్లు, కార్యాలయాల్లో వాడే వాటర్‌ క్యాన్లను తరుచూ విధిగా మార్చాలి. కానీ మూడు నాలుగేళ్ల వరకు మార్చరు. క్యాన్లపై సంస్థ లేబుల్‌ ఉండాలి. అవీ ఉండవు. ప్యాకింగ్‌ యూనిట్‌ స్టెరైల్‌గా, ఆపరేషన్‌ థియేటర్‌లా ఉండాలి. కానీ అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుంది. అయినా ఇటు ప్లాంట్‌ యజమానులు, అటు ప్రజలు పట్టించుకోవడం లేదు.

తక్కువ ఖర్చుతో..  
ఐఎస్‌ఐ ప్రమాణాలు పాటించి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే కనీసం రూ.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ ఆ ప్రమాణాలు పాటించకుండా రూ.4–5 లక్షలతోనే ఎడాపెడా ప్లాంట్‌లు పెట్టేస్తున్నారు. ఇలా ఏటా 20 శాతం చొప్పున ఈ వాటర్‌ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

వేసవిలో మరింత ఆదాయం..  
ఏడాదిలో ఎనిమిది నెలలు ఎంత ఆదాయం సమకూరుతుందో ఎండాకాలం నాలుగు నెలలూ అంత రాబడి వస్తుంది. వేసవిలో తాగునీటి వినియోగం ఇతర సీజన్లకంటే మూడు రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఈ వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులకు ప్రస్తుత వేసవి సీజను ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అందుకే ఈ సీజనులో అధికారులు కూడా ‘అవగాహన’తో ఈ ప్లాంట్ల తనిఖీల జోలికి అంతగా వెళ్లరు. చూసీ చూడనట్టు వదిలేస్తుంటారు.

ఆరోగ్యానికి ప్రమాదం.. 
శుద్ధి చేసిన ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌లో టీడీఎస్‌ స్థాయి గరిష్టంగా లీటరుకు 500 మిల్లీగ్రాముల లోపు ఉండాలి. కానీ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అంతకు రెట్టింపు ఉంటున్నా పట్టించుకునే వారే లేరు. తాగునీటిలో టీడీఎస్‌ స్థాయి (లెడ్, ఫ్లోరిన్, నైట్రేట్, క్లోరైడ్స్‌ వంటివి)కి మించి ఉంటే దీర్ఘకాలంలో జీర్ణకోశ, కాలేయ, ఉదర సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని, ఎముకలు, పళ్లకు కూడా నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేసి విక్రయిస్తున్న ‘జనరల్‌’ వాటర్‌కంటే కుళాయి నీళ్లు చాలా బెటర్‌ అంటున్నారు నిపుణులు.

అధికారుల మధ్య సమన్వయలేమి 
నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేసే అధికారం ఆర్డీవోలకే ఉంది. బీఐఎస్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధికారులకు ప్లాంట్‌లో ఉన్న స్టాకు సీజ్‌ చేయడానికే అధికారం ఉంది. ఆర్డీవో నుంచి ఆదేశాలొస్తేనే తహసీల్దార్లు, ఆహార తనిఖీ, భద్రత అధికారులు సీజ్‌ చేస్తారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేటప్పుడే ఫుడ్‌ లైసెన్స్, బీఐఎస్, రెవెన్యూ పర్మిషన్లు ఉన్నాయా? లేదా చూసి ఇవ్వాలి. కానీ అవేమీ చూడకుండానే కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. పైగా ఇలాంటి అనధికారిక వాటర్‌ ప్లాంట్లపై చర్యలు తీసుకునే విషయంలో సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లేదు. ఇవన్నీ వెరసి అనధికారిక వాటర్‌ ప్లాంట్ల యజమానులకు వరంగా మారింది.

రెయిడ్స్‌కు సన్నద్ధమవుతున్నాం..  
బీఐఎస్‌ లైసెన్స్‌ పొందిన వాటర్‌ ప్లాంట్లు రాష్ట్రంలో 185 వరకు ఉన్నాయి. బీఐఎస్‌ సరి్టఫికేషన్‌ లేకుండా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వాటర్‌ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం. కొందరు కేవలం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులతో వీటిని నడుపుతున్నారు. బీఐఎస్‌ లేని అనధికారిక ప్లాంట్లపై తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్చి 26న రాష్ట్రాల ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్లకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. త్వరలోనే బీఐఎస్‌ అనుమతుల్లేకుండా నడుస్తున్న వాటర్‌ ప్లాంట్లపై రెవెన్యూ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, విజిలెన్స్, భూగర్భ జలవనరులశాఖ అధికారులతో కలిసి దాడులకు సన్నాహాలు చేస్తున్నాం. ఇలాంటి అడ్డగోలు ప్లాంట్లను, నీటి వ్యాపారాన్ని కట్టడి చేస్తాం.  
– బి.సంధ్య, సైంటిస్ట్‌–డి అండ్‌ హెడ్, బీఐఎస్, విశాఖపట్నం.

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు.. 
నాణ్యతా ప్రమాణాలు పాటించని మినరల్‌ వాటర్‌ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నీళ్లలో టీడీఎస్‌ సమతుల్యత పాటించకపోవడం, నిర్దేశిత స్థాయిలో శుద్ధి జరగకపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మంచినీటిలో కాపర్‌ అధికంగా ఉంటే కాలేయం, క్లోరైడ్‌ ఎక్కువైతే జీర్ణకోశ ఇబ్బందులు, నైట్రేట్స్‌ వల్ల కండరాలు, నరాల సంబంధ సమస్యలు దీర్ఘకాలంలో అంటే 5–10 ఏళ్లలో తలెత్తుతాయి. అందువల్ల బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ ఉన్న సంస్థలు ఉత్పత్తి చేసే నాణ్యమైన శుద్ధ జలాన్నే ప్రజలు తాగాలి. లేదంటే ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే.
 –డాక్టర్‌ బి.రత్నగిరి, అసిస్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటారాలజిస్ట్, జీజీహెచ్, విజయవాడ.

ప్రభుత్వ ఖజానాకు గండి.. 
రాష్ట్రంలో అనుమతుల్లేకుండా నడుస్తున్న వాటర్‌ ప్లాంట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఇలాంటి సంస్థలు అనధికారికంగా ప్లాంట్లు నిర్వహిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి తరచూ పౌరసరఫరాల శాఖ అధికారులు ఇతర విభాగాల వారితో సమీక్షలు నిర్వహించాలి. సంబంధిత శాఖలను సమన్వయం చేయాలి. విజిలెన్స్‌ కమిటీ సమావేశాల్లో అజెండాగా చేర్చాలి. ఇప్పటికే బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ లేకుండా అనధికారికంగా నడుస్తున్న  వాటర్‌ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలి.  
– కాండ్రేగుల వెంకటరమణ, విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు, వినియోగదార్ల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ. 

అనుమతుల్లేని ప్లాంట్లను సీజ్‌ చేస్తాం.. 
డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లకు బీఐఎస్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు తప్పనిసరి. ఈ లైసెన్స్‌లు పొందాకే వాటిని నడపాలి. అవి లేకుండా నడుస్తున్న వాటిని కలెక్టర్‌ అనుమతితో 133 సీఆర్‌పీసీ ప్రకారం సీజ్‌ చేస్తాం. ఈ వాటర్‌ ప్లాంట్లు రోజూ కెమికల్, బ్యాక్టీరియాలాజికల్‌ టెస్ట్‌లు నిర్వహించాలి. విధిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. వాటర్‌ క్యాన్లను 90 రోజులకు మించి వినియోగించరాదు. 
–ఎన్‌.పూర్ణచంద్రరావు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్, విజయవాడ.

చదవండి: 1.43 లక్షల టన్నుల ఆక్సిజన్‌ సరఫరా   
పోలవరానికి రూ.333 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement