water plants
-
మీరు బయట తాగే వాటర్ ప్యూరిఫైడ్‌గా భావిస్తున్నారా.?
కరీంనగర్ అర్బన్: మీరు బయట తాగే వాటర్ ప్యూరిఫైడ్‌గా భావిస్తున్నారా.? మీ భావన తప్పు. మీరు అనారోగ్యానికి దగ్గర పడుతున్నారనేదే వాస్తవం. ఆరోగ్యం కోసం శుద్ధి చేసిన నీళ్లు తాగుతుంటే అవి అనారోగ్యానికి కేరాఫ్ అని చెబుతున్నారని అనుకుంటున్నారా.? అదే నిజం. ఒకసారి సరఫరా చేసే శుద్ధ జల కేంద్రానికి వెళితే అర్థం అవుతుంది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూరు, గంగాధర, రామడుగు, శంకరపట్నం, తదితర ప్రాంతాల్లో సుమారు 800 వరకు శుద్ధ జల సరఫరా కేంద్రాలున్నాయి. పట్టణాల నుంచి పల్లెల దాకా విస్తరించాయి. వీటిలో బీఎస్ఐ అనుమతి ఉన్న కేంద్రాలు కేవలం నాలుగే ఉన్నాయి. మిగతావన్నీ నామమాత్రపు అనుమతితో నడుస్తున్నవే. నాణ్యత ప్రమాణాలు అటకెక్కగా తనిఖీల ఊసే లేదు. దీంఓ నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా అధికారులుండే కరీంనగరంలోనే వందల సంఖ్యలో కేంద్రాలు నడుస్తుండడం గమనార్హం. విచ్చలవిడిగా కేంద్రాలు.. లక్షల్లో వ్యాపారం జిల్లావ్యాప్తంగా అనధికారికంగా నిర్వహిస్తున్న వా టర్ ప్లాంట్లలో కరీంనగర్ నగర పరిధిలో 300 వర కు ఉన్నాయి. కూల్‌వాటర్, మినరల్ వాటర్ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమ తి లేకుండా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. నీటిని శుద్ధి చేసేందుకు వినియోగిస్తున్న యంత్రాలకు ప్రభుత్వపరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. గంటకు 2 వేల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్లు నివాస ప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో నిర్వహిస్తున్నారు. ∙వాటర్ ప్లాంట్లలో వినియోగించే పైపులు, నిల్వ చేసే ట్యాంకులు స్టీలువి వినియోగించాల్సి ఉండగా ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్రతిరోజూ సరఫరా అయ్యే నీటిని తనిఖీలు చేయాల్సి ఉన్నా ఏ ఒక్కచోటా అది జరగడం లేదు. నీటి కోసం మున్సిపల్ శాఖ అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. అక్కడ వచ్చిన నీటిని పరీక్షించి దానికనుగుణంగా యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. ∙నీటి నిల్వకు కనీసం ఏడు సెంట్ల స్థలం కావాల్సి ఉండగా 200 అడుగుల గదుల్లోనే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. నామమాత్రంగా శుద్ధి చేసి క్యానుల్లో నింపుతున్నారు. క్యాన్లను వేడి నీటిని ఉపయోగించి ప్రెజర్ బ్రష్‌లతో చేయాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించారు. మున్సిపల్ కుళాయిల్లో వస్తున్న నీటినే క్యాన్లలో నింపి మినరల్ వాటర్ పేరుతో విక్రయించి సొమ్ముచేసుకునే వారూ ఉన్నారు. కేంద్రంలో ఇవి తప్పనిసరి సాధారణంగా వాటర్ ప్లాంట్‌ను నెలకొల్పాలంటే అందుకు మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి ముందస్తుగా నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ విధిగా పొందాలి. ఎన్వోసీ ఆధారంగా ప్లాంటు స్థాపించేందుకు విద్యుత్ శాఖ నుంచి కనెక్షన్ కోసం అనుమతి పొందాలి. శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించాలంటే భారత ప్రమాణాల సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారం మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7.5శాతం కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా నీటి «శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులుండాలి. ఫిల్లింగ్ సెక్షన్, ఆర్వో సిస్టంలో మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రమ్ములు ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు 304 గ్రేడ్ స్టెయిలెస్ స్టీలు డ్రమ్ములు వాడాలి. ఈ నీటికి తప్పకుండా ఓజోనైజేషన్ చేయాలి. మినరల్ వాటర్‌ను బబుల్స్(క్యాన్)లోకి పట్టే ముందు అల్ట్రావయోలెట్ కిరణాలతో శుద్ధి చేయాలి. క్యాన్లను ప్రతీసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపో సొల్యూషన్‌తో శుభ్రం చేయాలి. వీటిని శుద్ధి చేసిన తేదీ బ్యాచ్ నంబర్‌ను సీలుపై ముద్రించాలి. శానిటరీ అధికారులతో ప్రతినెలా నీటిని పరీక్షింపజేసి బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)కు పంపించాలి. నాణ్యత ప్రమాణాలను ఫుడ్ కంట్రోల్ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు వాటర్ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రమాణాలు పాటించకుంటే రుగ్మతలకు అవకాశం ఆల్కలైన్ తగిన మోతాదులో వాడకపోతే ఎముకల పటుత్వంలో సమస్యలు ఏర్పడుతాయి. సరైన శుద్ధి చేయకుండా నీరు తాగడం వలన గొంతు సంబంధ సమస్యలు, ఒంటినొప్పులు, వివిధ రకాల రుగ్మతలు వస్తాయి. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు, క్యాన్లలో ఎక్కువ కాలం నిలువ ఉంచిన నీరు తాగడం వలన క్యాన్సర్లు వచ్చే ప్రమాదముంది. వాటర్ ప్లాంట్లు పరిశుభ్రత విషయంలో నిబంధనలు పాటించకున్నా వ్యాధులు వస్తాయి. – డా.సాయిని నరేందర్, ఎండీ చెస్ట్ క్రిటికల్ కేర్ -
వాటర్ జనరేటర్లు: గాల్లోంచి తాగు నీరు ఎలా వస్తుందంటే..
మంచి నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తట్టుకునేందుకు యూఏఈ, టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. వాటర్ జనరేటర్ల సాయంతో తేమ నుంచి నీటిని తయారు చేసుకుంటోంది. అదీ పర్యావరణానికి ఎలాంటి భంగం కలిగించకుండానే!. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కాగా.. త్వరలో అధికారికంగా ఈ సెటప్‌ను దేశవ్యాప్తంగా లాంఛ్ చేయనుంది. విశేషం ఏంటంటే.. తాగు నీరు కోసం జరిగిన ప్రయోగాల్లో ఇదే భారీ సక్సెస్ కూడా. అబుదాబి: పూర్తిగా సోలార్ పవర్‌తో నడిచే ప్రాజెక్ట్ ఇది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా.. హైపర్-డెహూమిడీఫైయర్స్ అనే జనరేటర్ల(20 జనరేటర్ల దాకా) సాయంతో రోజూ 6,700 లీటర్ల తాగు నీటిని తయారు చేశారు. పైగా ఇది నిరంతర ప్రక్రియ కావడం విశేషం(ప్రపంచంలోనే ఈ తరహా ప్రయోగం మొదటిది ఇదే). ఇవి ఎలా పని చేస్తాయంటే.. సోలార్ ప్యానెల్స్- భారీ ఫ్యాన్లు-పైపులను అనుసంధానించి ఈ వాటర్ జనరేటర్ల సెటప్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్లు వాతావరణంలోని తేమను లాక్కుని.. అనుసంధానంగా ఉన్న పైపుల ద్వారా జనరేటర్ సెటప్‌లకు చేరవేస్తాయి. ఈ మధ్యలో పైపుల గుండా తేమకు ప్రత్యేకమైన లిక్విడ్(చల్లబరిచేవి) చేరుస్తారు. తద్వారా ఆ తేమ పోయే కొద్దీ నీటి బిందువులుగా మారతాయి. ఆపై ఆ తేమ నీరు బొట్టు బొట్టుగా పెరిగి.. ఆ నీరు దశలవారీగా ఫిల్టర్ అవుతుంది. ఫైనల్‌గా ఈ వాటర్ జనరేటర్లు తాగు నీటిని బయటకు వస్తుంది. కండిషన్స్ అప్లై ఇలా గాల్లో తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేయడం కొత్తేం కాకపోవచ్చు. అయితే అవి అవసరాల కోసమే తప్పించి.. మంచి నీటి కోసం ఉత్పత్తి చేసేవి లేవు. యూఏఈ పరిశోధనలు మాత్రం భారీ లెవల్లో నీటిని ఉత్పత్తి చేయడం, అదీ తాగు నీటి అవసరాల కోసం చేయడం ప్రపంచంలో తొలిసారి. ఇక 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద.. అదీ గాల్లో 60 శాతం తేమ శాతం ఉన్నప్పుడు ఈ వాటర్ జనరేటర్లు పనిచేశాయి(పైలట్ దశలో ఇదే తేలింది). త్వరలో అబుదాబి ఎయిర్పోర్ట్ దగ్గర్లోని మస్దర్ సిటీలో దీనిని లాంఛ్ చేయనున్నారు. సుమారు 54 ఎకరాల్లో సుమారు తొంభై వేల సోలార్ ప్యానెల్స్ ద్వారా ఈ సెటప్ ఏర్పాటు చేయబోతున్నారు. -
Water Plants In Hyderabad: రోగాలకు పుట్టి‘నీళ్లు’
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఫిల్టర్ వాటర్ ప్లాంట్. ఐడీఎల్ చెరువు కట్ట వద్ద ఉన్న ఈ ప్లాంట్ చుట్టూ చెత్తాచెదారం, దుమ్ము ధూళి.. నీటి ట్యాంకుల పక్కనే పారుతున్న మురుగునీరు.. కనీస పరిశుభ్రత కూడా లేని ఇక్కడి నీళ్లు తాగితే.. ఏ రోగాలు వస్తాయో తెలియని దుస్థితి. నిజానికి మనం కలుషితాలు ఉండవని, ఆరోగ్యం కోసమని వాటర్ ప్లాంట్లలో నీళ్లను కొనుక్కుని మరీ తాగుతున్నాం. కానీ ఇలాంటి చోట్ల నుంచి డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మంచి నీళ్లంటే..? మనం తాగడానికి పనికొచ్చే నీళ్లు.. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే నీళ్లు.. అందులోనూ శుద్ధి చేసిన నీళ్లంటే..? మనకు మరింతగా ‘మంచి’ చేయాల్సిన నీళ్లు.. అనారోగ్యానికి దూరంగా ఉంచాల్సిన నీళ్లు.. మరి హైదరాబాద్‌లోని వాటర్ ప్లాంట్లలో శుద్ధి చేసిన మంచి నీళ్లు అయితే.. ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టే నీళ్లు..! కొత్త కొత్త రోగాలను తెచ్చిపెట్టే నీళ్లు!? మరీ కఠినంగా ఉన్నా చాలా వరకు ఇదే నిజం. ప్లాంట్లలో, చుట్టూ అపరిశుభ్ర పరిస్థితులు.. సరిగా శుభ్రం చేయని ట్యాంకులు, పైపులు.. నామ్కేవాస్తేగా పైపైన కడిగి నీళ్లు నింపే బబుల్స్.. కొన్నిచోట్ల మరీ మురుగునీరు పారుతున్నా ఆ పక్కనే కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లు.. ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్లకు నిలయాలు. అన్నీ కాకున్నా చాలా వాటర్ ప్లాంట్లతో పరిస్థితి ఇదే.. నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టించుకోనితనం కలిసి జనం ఆరోగ్యానికి ముప్పు తెచి్చపెడుతున్న దుస్థితీ ఇదే. అసలే వానాకాలం మొదలైంది. విషజ్వరాలు, డయేరియా వంటివి విజృంభించే ఇలాంటి సమయంలో.. వాటర్ ప్లాంట్ల అపరిశుభ్రతపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలతో ప్రత్యేక కథనం.. – ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్ ఇదీ వాటర్ ప్లాంటే.. ఇది హైదరాబాద్‌లోని నాగోల్ జైపురి కాలనీలో అపరిశుభ్ర పరిస్థితుల మధ్య కొనసాగుతున్న ఒక నీటి శుద్ధి ప్లాంట్. శిథిలమయ్యే దశలో ఉన్న రేకుల షెడ్, దాని ఆవరణ, నీటి ట్యాంకు, పైపులు.. ఎక్కడా పరిశుభ్రత మచ్చుకైనా లేదు. అపరిశుభ్రతతో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్‌తో నీళ్లు కలుíÙతమై.. జనం రోగాల బారినపడే ప్రమాదం ఉంది. గల్లీకొకటిగా పుట్టగొడుగుల్లా గ్రేటర్ హైదరాబాద్‌లో అనుమతి లేని వేలాది వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. అపరిశుభ్ర పరిసరాలు.. ప్రమా ణాల ప్రకారం శుద్ధి చేయని నీళ్లతో జనం రోగాల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. మహా నగరంలో గల్లీకొకటిగా పుట్టగొడుగుల్లా వెలిసిన నీటి శుద్ధి కేంద్రాలు 8 వేలకు పైగానే ఉండగా.. అందులో భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గుర్తింపు పొందిన ఫిల్టర్ ప్లాంట్లు 1,500 లోపే ఉన్నట్టు అధికార వర్గాలే చెప్తున్నాయి. ప్రతీ నెలా గ్రేటర్ పరిధిలో సుమారు రూ.150 కోట్ల ఫిల్టర్ నీళ్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. వాటర్ ప్లాంట్ల పరిస్థితిపై సాక్షి ప్రతినిధులు కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, మల్లాపూర్, మల్కాజ్గిరి, సరూర్‌నగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. వాటర్ ప్లాంట్లు కొనసాగుతున్న తీరును గుర్తించారు. బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాల్లో చాలా వరకు ఫిల్టర్ ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదని నిర్ధారించారు. ఇంత జరుగుతున్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) సంస్థ మొద్దునిద్ర వీడని పరిస్థితి ఉందని తేల్చారు. కూకట్‌పల్లిలోని ఓ వాటర్ ప్లాంట్‌లో పరిస్థితి ఇదీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలోనే చాలా ప్లాంట్లు కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 500కుపైగా వాటర్ ప్లాంట్లు ఉన్నట్టు అంచనా. చాలా చోట్ల నీటి బబుల్స్ (క్యాన్ల)ను పైపైనే శుభ్రం చేస్తున్నారు. ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కొందరు కిరాణా, ఇతర షాపుల యజమానులు 2000, 5000 లీటర్ల ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ ప్లాంట్ల నుంచి టోకుగా నీళ్లు తెప్పించి, వాటిలో నింపుకొని అమ్ముతున్నారు. వారు కూడా సరిగా ట్యాంకులను, పైపులను శుభ్రం చేయకపోవడంతో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరుగుతున్నాయి. కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలోనూ చాలా వాటర్ ప్లాంట్లు అపరిశుభ్ర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇరుకు గదులు, పాత షెడ్లలో కొనసాగుతున్నాయి. చెరువులు, నాలాలకు సమీపంలో బోర్లు వేసి.. ఆ నీటితో ప్లాంట్లు నడిపిస్తున్నారు. కూకట్పల్లి ఐడియల్ చెరువు కట్ట క్రింద మూడు వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. వాటిలో నీటి సంపులు, గుంతలు మురికి నీటితో నిండి ఉండగా.. పక్కనే వాటర్ నింపుతున్నారు. ట్యాంకుల చుట్టూ వ్యర్థాలు, దుమ్ము, ధూళి నిండి ఉంటున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గచి్చబౌలి, మియాపూర్, చందానగర్, మక్తా మహబూబ్పేట్, ఎనీ్టఆర్ కాలనీ, ఎంఐజీ కాలనీ, హఫీజ్‌పేట వంటి ప్రాంతాల్లో విస్తృతంగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ట్యాంకులు, నీటిని సరఫరా చేసే క్యాన్లు మురికిపట్టి కనిపిస్తున్నాయి. వాటితో అలాగే నీళ్లను సరఫరా చేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్న వాటర్ ప్లాంట్ బాధ్యత వహించేవారేరీ? వాటర్ ప్లాంట్లలో పరిశుభ్రత ఉండేలా, వాటి యజమానులు తప్పుడు విధానాలకు పాల్పడకుండా ఉండేలా కట్టడి చేసే విషయంలో ప్రభుత్వ శాఖలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆహార కల్తీ, పరిశుభ్రత అంశం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఉంటుంది. కానీ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసే అధికారాలను ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)’కు అప్పజెప్పామంటూ జీహెచ్ఎంసీ చేతులు దులుపుకొంటోంది. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అదనపు కమిషనర్ (హెల్త్) సంతోష్‌లను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఇది ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ జడ్జెస్ కాలనీలోని వాటర్ ప్లాంట్. ఆరు బయటే నీటి ట్యాంకులు, వాటి పక్కనే చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు నిల్వ నీటితో చిత్తడిగా ఉండటంతో నీళ్లు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. ఆ నీటిని తాగితే జనం రోగాల పాలుగాక తప్పదన్న ఆందోళన కనిపిస్తోంది. సరిగా శుభ్రం చేయని బబుల్స్‌లో నీళ్లను నింపుతున్న నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వాటర్ ప్లాంట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధి జనాభా పెరిగినకొద్దీ మంచి నీటి కోసం భారీగా డిమాండ్ వస్తోంది. ముఖ్యంగా పది, ఇరవై రూపాయలకే 20 లీటర్లు ఇస్తుండటంతో ఫిల్టర్ వాటర్‌ను కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ వేలాదిగా వాటర్ ప్లాంట్లు వెలిశాయి. బీఐఎస్ నిబంధనల ప్రకారం.. వాటర్ ప్లాంట్లలో నీటి టెస్టింగ్ ల్యాబ్ ఉండాలి. శుద్ధి చేసిన నీటి గాఢత (పీహెచ్), కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్), ఆవశ్యక మూలకాలు, ఇతర అంశాలను పరీక్షించి నమోదు చేసేందుకు బయో కెమిస్ట్ సదరు ప్లాంట్‌లో పనిచేయాలి. కానీ వాటర్ ప్లాంట్లలో ఎక్కడా ల్యాబ్‌లు, బయోకెమిస్టులు ఉన్న దాఖాలాలే లేవు. పరిసరాలు పరిశుభ్రత లేకపోవడం, ట్యాంకులు, పైపులు, ఇతర సామగ్రిని సరిగా శుభ్రం చేయకపోవడంతో ఈ.కొలి, కొలిఫాం వంటి హానికారక బ్యాక్టీరియా, ఫంగస్‌లు వృద్ధి చెందుతున్నాయి. శుద్ధి చేసిన నీటిని కొంత సమయం తర్వాతే తాగేందుకు వినియోగించాలి. కానీ వెంటవెంటనే పంపించేస్తున్నారు. వాటర్ బబుల్స్‌ను వినియోగించిన ప్రతిసారీ క్లోరిన్‌తో శుద్ధి చేయాలి. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి నశిస్తాయి. కానీ చాలా చోట్ల క్లోరిన్ వాడటం లేదు. నామమాత్రంగా కడిగి మళ్లీ నీళ్లు నింపేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిలో నిర్ణీత శాతం ఖనిజాలు ఉండేలా చూడాలి. కానీ ఇష్టమొచి్చనట్టుగా శుద్ధి చేస్తుండటంతో నీటిలోని ఖనిజాలు పూర్తిగా బయటికి పోతున్నాయి. ఇది జనంలో ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కారణమవుతోంది. కొన్ని వాటర్ ప్లాంట్లు నీళ్లు రుచిగా ఉన్నట్టు అనిపించడం కోసం రసాయనాలు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటివల్ల ఆరోగ్యానికి హానికలిగే ప్రమాదం ఉంది. తనిఖీలకు ఆదేశాలిచ్చాం ‘‘ఈ సీజన్లో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాల్సిందిగా మా పరిధిలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’’ – డాక్టర్ శంకర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సినవి ఇవీ.. ► భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నుంచి గుర్తింపు ధ్రువీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి. ► ప్రతి ప్లాంటులో అధునాతన టెస్టింగ్ ల్యాబ్, బయో కెమిస్ట్ ఉండాలి. ► నీటి శుద్ధికి సంబంధించి 60 ప్రమాణాలను పాటించాలి. ట్యాంకులు, బబుల్స్ వంటివాటిని క్లోరిన్‌తో శుభ్రం చేయాలి. ► తాగునీటిలో ఆవశ్యక మూలకాలను పూర్తిగా తొలగించకూడదు. రుచి కోసం ఎలాంటి రసాయనాలను కలపకూడదు. ► ప్రతి లీటరు నీటిలో టీడీఎస్ మోతాదు కనీసం 100 నుంచి 150 మిల్లీగ్రాములు ఉండాలి. ఉండాల్సినవి లేవు.. ఉండకూడనివి ఉంటున్నాయి ► ప్రతి లీటర్ నీటిలో కనీసంగా.. కాల్షియం 75 మిల్లీగ్రాములు (ఎంజీ), మెగ్నీíÙయం 30, ఐరన్ 0.3 మిల్లీగ్రాములు ఉండాలి. కానీ ఇవేవీ ఉండటం లేదు. దీనివల్ల శరీరానికి ఆవశ్యక పోషకాలు సరిగా అందని పరిస్థితి తలెత్తి.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ► ప్రతి లీటర్ నీటిలో ఫ్లోరైడ్ ఒక మిల్లీ గ్రాము మించకూడదు. చాలాచోట్ల 1.5 మిల్లీగ్రాములకుపైన ఉన్నట్టు తేలింది. దీనితోపాటు అసలు ఉండకూడని కాల్షియం కార్బొనేట్, బైకార్బొనేట్లు ఉంటున్నాయి. ఇవి అనారోగ్యానికి కారణమవుతాయి. హానికర బ్యాక్టీరియాతో ప్రమాదం అపరిశుభ్ర వాతావరణంలో, నాలాలకు ఆనుకొని ఏర్పాటు చేసిన ఫిల్టర్ ప్లాంట్ల నీటిలో ఈ.కొలి, కొలిఫాం వంటి హానికర బ్యాక్టీరియాలు, పాథోజెన్స్ చేరే ప్రమాదముంది. వానాకాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. కలుషిత నీటిని తాగితే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. టైఫాయిడ్ వంటివి రావొచ్చు. ఫిల్టర్ ప్లాంట్ల నీళ్లు అయినా, నల్లా నీళ్లు అయినా బాగా కాచి చల్లార్చి, వడబోసిన తరువాత మాత్రమే తాగాలి. – డాక్టర్ బీరప్ప, నిమ్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆ నీళ్లతో నష్టమే ఎక్కువ సరైన ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించకపోతే ఫిల్టర్ వాటర్‌తో ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. అపరిశుభ్రత కారణంగా రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఇక నీటి శుద్ధి ప్రమాణాల మేరకు లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాగునీటి ద్వారా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఆవశ్యక పోషకాలు శరీరంలోకి చేరుతాయి. ఆహారం ద్వారా కంటే నీటి ద్వారా వచ్చే వీటిని శరీరం త్వరగా, బాగా సంగ్రహిస్తుంది. నీటి శుద్ధి ప్రక్రియలో ఆవశ్యక మూలకాలను తొలగిస్తున్న ప్లాంట్ల నిర్వాహకులు.. తర్వాత ఫోర్టిఫైడ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మినరల్స్‌ను నీళ్లలో కలపాలి. కానీ ఎవరూ కలపడం లేదు. – డాక్టర్ రమేశ్‌కుమార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి -
వాటర్ ప్లాంట్లపై కొరడా
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న మినరల్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ‘మాయాజలం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాంట్లలో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం రాష్ట్రంలోని 25 వాటర్ ప్లాంట్లపై దాడులు జరిపారు. అనంతపురం జిల్లాలో 6 (సాయి సవేరా, హనీ, ఎస్వీఆర్, సాయి సిరి ఆక్వా, అమృతబిందు, ఎస్వీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్) వాటర్ ప్లాంట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1 (ఉమా ఆక్వా), విజయనగరం జిల్లాలో 2 (ఆదిత్య మినరల్ వాటర్, శ్రీవారి ఆక్వా ఇండస్ట్రీస్), చిత్తూరు జిల్లాలో 2 (శ్రీకృష్ణా మినరల్స్, కింగ్ ఆక్వా), విశాఖపట్నం జిల్లాలో 1 (లక్ష్మీ ఆక్వా ఇండస్ట్రీ), కృష్ణా జిల్లాలో 2 (ఎస్ఎస్ అల్ట్రా టెక్, కె–వాటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్)లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3 వాటర్ ప్లాంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐఎస్ఐ గుర్తింపు లేకుండా.. విజయవాడ కృష్ణలంకలోని కె–వాటర్ ప్లాంట్‌లో ఈ–కామ్ పేరిట తెలంగాణలోని కీసర చిరునామాతో రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేషన్ ఉన్న పోస్టర్లు అతికించి ఉన్నాయి. ఈ ప్లాంట్‌కు ఐఎస్ఐ గుర్తింపు ఉన్నట్టు పోస్టర్లపై ఉంది. జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆన్లైన్లో పరిశీలించడంతో అది బోగస్ అని తేలింది. చాలా ప్లాంట్లు ఐఎస్ఐ గుర్తింపు లేకుండా నడుస్తున్నట్టు గుర్తించారు. వాటర్ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. అదే నీరు.. పేరే మారు! అధికారుల లెక్కల ప్రకారం విజయవాడ నగరంతోపాటు కృష్ణా జిల్లాలో అనుమతులు లేకుండా 1,200కు పైగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రిజిస్టరైన పేరుతోనే ప్లాంట్‌లో వాటర్ బాటిళ్లకు సీళ్లు వేసి మార్కెట్లో విక్రయించాలి. నగరంలో పలు ప్లాంట్లు అందుకు భిన్నంగా వివిధ రంగులు, మూడు నాలుగు ఆకర్షణీయమైన పేర్లతో లేబుళ్లను ముద్రిస్తున్నాయి. ఆ ప్లాంటులో నీటినే బాటిళ్లలోకి నింపి వేర్వేరు బ్రాండ్లతో అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో పాటు వాటర్ బాటిళ్లపై తయారీదారు పేరు, తయారీ తేదీ, తయారీ స్థలం చిరునామా వంటివి స్పష్టంగా ముద్రించి ఉండాలి. అలాంటివేమీ లేకుండా వాటర్ బాటిళ్లను నింపి విక్రయిస్తే మిస్ బ్రాండెడ్ కింద కేసు నమోదు చేసి రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తామని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. -
‘మాయా జలం’పై కదిలిన యంత్రాంగం
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా, తగిన అనుమతులు లేకుండా నడుపుతున్న వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మంజరి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణా జిల్లాలో అనధికార ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్, సూర్యారావుపేటలోని శ్రీగంగా వాటర్ ప్లాంట్లను జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. ప్లాంట్ల సీజ్: బ్లూ వాటర్ ప్లాంట్‌కు బీఐఎస్/ఐఎస్ఐ లైసెన్స్‌లతో పాటు ఇతర అనుమతులు లేవని, వాటర్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లలో అపరిశుభ్రత తాండవిస్తోందని అధికారులు గుర్తించారు. ఇంకా వివిధ కంపెనీల (బ్లూ, వేగా, శ్రీరాం) పేర్లతో లేబుళ్లను ముద్రించి పావు లీటరు, అర లీటరు, లీటరు బాటిళ్లకు అతికించి అక్రమంగా విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. సిబ్బంది కోవిడ్ జాగ్రత్తలు పాటించకపోవడాన్ని గుర్తించారు. రోజుకు 4 వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను ఎనిమిదేళ్ల క్రితం ఐఎస్ఐ గుర్తింపుతో ప్రారంభించి, ఆ తర్వాత నాలుగేళ్లుగా రెన్యువల్ చేయించకుండా, ఇతర అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నట్టు తనిఖీల్లో తేలిందని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. విజయవాడ పటమటలోని బ్లూ వాటర్ ప్లాంట్‌లో అధికారుల తనిఖీలు ఈ ప్లాంట్‌లో ఉన్న 6,125 సీల్డ్ వాటర్ బాటిళ్లను సీజ్ చేశామన్నారు. మరోవైపు అనుమతుల్లేకుండా నడుస్తున్న శ్రీగంగా వాటర్ ప్లాంట్‌లోనూ తనిఖీలు నిర్వహించామని, అక్కడ 90 ప్యాకెట్ల చొప్పున ఉండే 103 బ్యాగులను సీజ్ చేశామని చెప్పారు. ఈ రెండు ప్లాంట్లను సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు చెప్పారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు శేఖర్‌రెడ్డి శ్రీకాంత్, గోపాల్, విజిలెన్స్ సీఐ అశోక్‌రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని జాయింట్ కలెక్టర్ మాధవీలత చెప్పారు. కాగా, బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అనధికార వాటర్ ప్లాంట్లపై నిరంతరాయంగా దాడులు నిర్వహిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ చెప్పారు. -
అనధికార ‘ప్లాంట్ల’పై దాడులకు సన్నద్ధం
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ పేరిట పరిశోధనాత్మక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐఎస్ఐ సర్టిఫికేషన్ లేకుండా నడుస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై తనిఖీలు చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు జాయింట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. శాంపిళ్లలో లోపాలున్నట్టు తేలిన ప్లాంట్ల యజమానులపై కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. ఐఎస్ఐ సర్టిఫికేషన్ లేని ప్లాంట్లకు తాము ఫుడ్ లైసెన్స్ ఇవ్వడం లేదని, అలా నడిచేవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో అనధికార డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై మంగళవారం నుంచి దాడులు నిర్వహిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ‘సాక్షి’తో చెప్పారు. అనుమతులున్న వాటర్ ప్లాంట్లు విజయవాడ నగరంలో ఏడు, జిల్లాలో ఆరు, అనుమతులు లేనివి విజయవాడలో 180, జిల్లాలో 1,020 ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ వాటర్ ప్లాంట్లకు సంబంధించి జేసీ కోర్టులో 38, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో 17 కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. -
మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం
నీరు సృష్టిలో ప్రతి జీవరాశికి చాలా అవసరమైనది. మంచినీరు లేకపోతే మానవాళి లేదు. ప్రపంచంలో కేవలం 10 శాతం నీరు మాత్రమే తాగేందుకు అనువైనది. మారుతున్న కాలక్రమంలో పెరిగిపోతున్న జనాభా వల్ల మంచినీరు కొరత రోజురోజుకూ పెరిగిపోతోంది. భూగర్భజలాలు అడుగంటడం, నీటి కాలుష్యం పెరిగిపోవడంతో మనుషుల జీవన విధానం, ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో బావులు, బోర్ల నుంచి వచ్చే నీటిని, పట్టణాలు, నగరాల్లో కుళాయి నీటిని తాగేవారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు ధనిక, పేద అనే తేడా లేకుండా మినరల్ వాటర్‌ను ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రజల తాగునీటి అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకున్న వ్యాపారులు పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా వృద్ధి చెందింది. కాసులకు కక్కుర్తి పడిన వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండా వాటర్ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. మనం రోజూ మినరల్ వాటర్ పేరిట తాగుతున్న నీళ్లలోనూ ‘మినరల్’ అంతే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. తద్వారా వ్యాపారులు కోట్లు వెనకేసుకుంటున్నారు. (బొల్లం కోటేశ్వరరావు, సాక్షి అమరావతి బ్యూరో): మార్కెట్లో మినరల్ వాటర్ పేరిట మోసాల దందా జోరుగా సాగుతోంది. మారుమూల పల్లెల నుంచి పెద్దపెద్ద నగరాల వరకు అన్ని చోట్లా మినరల్ వాటరే ఆధిపత్యం సాధించడంతో జనం బావులు, బోరు నీళ్లకు, కుళాయి నీటికీ దాదాపు మంగళం పాడేశారు. తాము తాగేది సాదాసీదా నీరే అయినప్పటికీ మినరల్ వాటర్‌గానే భ్రమిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తమ ఇంటికి వాటర్ క్యాన్లు రప్పించుకోవడమో, క్యాన్లు తీసుకెళ్లి నీటిని తెచ్చుకోవడమో చేస్తున్నారు. ఇక బయటకు వెళ్లినా బాటిల్ నీళ్లు తాగడానికే మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ వాటర్ ప్లాంట్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి పొందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు 200లోపు ఉంటే.. ఆ సంస్థ అనుమతుల్లేకుండా నడుస్తున్నవి వేలల్లో ఉన్నాయి. ప్రజల్లో ఈ వాటర్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో వీటి ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదు. ఆర్వో(రివర్స్ ఆస్మాసిస్) ప్లాంట్లు, ఎక్స్ట్రా ఆడెడ్ మినరల్స్ అంటూ మోసం చేస్తున్నారు. మంచినీటి ఉత్పత్తిలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. అధికారుల తీరూ అలాగే ఉంది. వాటర్ ప్లాంట్‌కు దరఖాస్తు చేయగానే లోతుగా పరిశీలించకుండా ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేసేస్తున్నారు. ఆ తర్వాత మామూళ్ల రుచి మరిగి ఆ ప్లాంట్లలో జరుగుతున్న మోసాలను పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కుటుంబ ఖర్చులో పెరిగిన మంచి నీటి వాటా నలుగురు సభ్యులున్న కుటుంబం రోజుకు సగటున 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను వినియోగిస్తున్నారు. ఆ 20 లీటర్ల వాటర్ క్యాన్ ప్రాంతాన్ని, పోటీని బట్టి ప్లాంట్‌లో రూ.10 నుంచి 20 వరకు విక్రయిస్తున్నారు. అదే డోర్ డెలివరీ చేస్తే అదనంగా మరో రూ.10–15 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక కుటుంబం రోజుకు సగటున రూ.30 చొప్పున నెలకు రూ.900 వరకు వెచి్చస్తోంది. ఇది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్‌ను కొని తాగుతున్నారు. లీటరు వాటర్ బాటిల్ ఖరీదు రూ.20 ఉంది. ఇలా నెలలో సగటున ఐదారు బాటిళ్లు తాగినా రూ.100 వరకు ఖర్చవుతుంది. అంటే నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేలు కేవలం మంచినీళ్లకే చెల్లించాల్సి వస్తోంది. ఇక కార్యాలయాలకు 20 లీటర్ల వాటర్ క్యాన్ రూ.25–30కు సరఫరా చేస్తున్నారు. మారిన పరిస్థితుల్లో కూలింగ్ మినరల్ వాటర్ పేరిట కూడా నీటిని అమ్ముతున్నారు. 20 లీటర్ల కూలింగ్ క్యాన్‌కు రూ.40–50 వరకు వసూలు చేస్తున్నారు. ఫంక్షన్లలో ఇలాంటి కూలింగ్ వాటర్‌కు ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. పాలతో నీళ్లకు పోటీ.. రానురాను పరిస్థితి ఎలా తయారైందంటే తాము మంచినీళ్లకు పెట్టే ఖర్చు.. పాల కంటే మించిపోతోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. సగటు మధ్య తరగతి కుటుంబాలు మార్కెట్లో రూ.4–5 తక్కువ ధర ఉన్న పాల ప్యాకెట్‌కే మొగ్గు చూపుతాయి. ప్రస్తుతం మార్కెట్లో అర లీటరు పాల ప్యాకెట్ ధర వెన్న శాతాన్ని బట్టి రూ.26 నుంచి 32 వరకు ఉంది. ఇలా పాలకు వెచి్చంచే సొమ్ము గరిష్టంగా రూ.900 అవుతుంది. అంటే పాలతో నీళ్ల ధర పోటీ పడుతోందని స్పష్టమవుతోంది. మనుషుల్లో ‘మినరల్ వాటర్’పై మోజుకు ఇది దర్పణం పడుతోంది. విజయవాడ కృష్ణలంకలో నడుస్తున్న ఓ వాటర్ ప్లాంట్ ఇది. ఆ ప్లాంట్ బయట బోర్డుపై ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని రాసుంది. దాని దిగువనే ‘వివాహాది శుభకార్యాలకు ‘మినరల్ వాటర్’ సప్లై చేయబడును’ అని చిన్న అక్షరాలతో రాశారు. సాక్షి ప్రతినిధి అక్కడికి వెళ్లి టీడీఎస్ స్థాయిని గుర్తించే డిజిటర్ మీటర్ ఎక్కడని సిబ్బందిని ప్రశ్నిస్తే.. అసలు అలాంటిది ఉంటుందనే విషయమే వారికి తెలియదన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఐఎస్ సర్టిఫికెట్లు ఎక్కడ అని అడిగితే సమాధానం చెప్పలేదు. ఇళ్ల మధ్యలో ఇరుకుగా, పరిశుభ్రత లేకపోయినా అక్కడికి జనం వచ్చి నీటిని కొనుక్కొని వెళ్తున్నారు. అక్కడకు సమీపంలోనే మరో పెద్ద వాటర్ ప్లాంట్ ఉంది. అది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పేరిట ఐఎస్ఐ గుర్తింపు లేకుండా నడుస్తోంది. అక్కడ రిటైల్‌లో అర లీటరు బాటిల్ రూ.10లు, లీటర్ బాటిల్ రూ.20లు, 20 లీటర్ల వాటర్ క్యాన్ రూ.20ల చొప్పున అమ్ముతున్నారు. ఐఎస్ఐ అనుమతి లేకుండా ఇంత పెద్ద ప్లాంట్‌ను ఎలా నడుపుతున్నారన్న ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నకు నిర్వాహకుడి నుంచి సమాధానం లేదు. ఇలా ఐఎస్ఐ గుర్తింపు లేకుండా అనధికారికంగా నడుస్తున్న ప్లాంట్లు ఒక్క విజయవాడ నగరంలోనే వందల్లో ఉన్నాయి. ఇవీ నిబంధనలు.. ►ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు మొదటిగా వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలవనరుల శాఖ అనుమతి ఉండాలి. 500 మీటర్ల పరిధిలో మరో బోరు తవ్వకూడదు. ఫ్యాక్టరీలు, రసాయన కర్మాగారాలున్న చోట ఏర్పాటు చేయకూడదు. ►స్థానిక సంస్థలు (పంచాయతీ/మునిసిపాలిటీ/నగరపాలకçసంస్థ), రెవెన్యూ, కారి్మక, కాలుష్య నియంత్రణ మండలి, ప్రజారోగ్య శాఖ, తూనికలు, కొలతల శాఖ, ఆహార భద్రత అధికారి, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖల నుంచి అనుమతి పొందాలి. వీరి అనుమతి లేకుండా ప్లాంట్ ఏర్పాటు చేస్తే సంబంధిత అధికారులు సీజ్ చేయవచ్చు. ►ప్యాకింగ్, బాట్లింగ్ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌కు ఐఎస్ఐ గుర్తింపు తప్పనిసరి. దీనిని భారత ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. ఐఎస్ఐ గుర్తింపును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్‌ను ప్లాంట్‌లో కనిపించేలా వేలాడ దీయాలి. ఇది లేకుండా నడిచే వాటర్ ప్లాంట్‌ను సీజ్ చేసే అధికారం రెవెన్యూ అధికారులది. ►ఒక్కసారి బీఐఎస్/ఐఎస్ఐ సరి్టఫికేషన్ వచ్చాక ఏటా రెన్యువల్ చేయించుకోవాలి. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే రెన్యువల్ చేయాలి. ►ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌కు ఐఎస్–14543, మినరల్ వాటర్ ప్లాంట్‌కు ఐఎస్–13428 మార్కును జారీ చేస్తారు. వాటిని వాటర్ బాటిళ్లపై ముద్రిస్తారు. ►ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సరి్టఫికేషన్ కూడా ఉండాలి. ►ఈ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేయాలి. ►శుద్ధి చేసిన నీటిలో టోటల్ డిజాల్‌్వడ్ సాల్వెంట్స్ (టీడీఎస్–ఖనిజాల స్థాయి) స్థాయి లీటరుకు 500 మి.గ్రా. కంటే తక్కువ ఉండాలి. అది తెలియజేయడానికి డిజిటల్ మీటర్ ఏర్పాటు చేయాలి. ►టీడీఎస్ చెక్ చేయడానికి ప్లాంట్‌లో ల్యాబ్ ఉండాలి. ఈ ల్యాబ్‌లో ల్యాబ్ టెక్నీíÙయన్ను నియమించాలి. నీటిని స్టోర్ చేయడానికి ట్యాంకులు ఉండాలి. ►నీటిని శుద్ధి చేసేందుకు వాడే కెమికల్స్ క్వాలిటీని తనిఖీ చేయాలి. ఈ నీటిలో ఎలాంటి హానికర పదార్ధాలు లేకుండా మనుషులు తాగడానికి వీలుగా ఉందని నిర్ధారించాకే విక్రయించాలి. ►బీఐఎస్ సర్టిఫికేషన్ ఉంటేనే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ జారీ చేస్తుంది. ►బీఐఎస్ లైసెన్స్ పొందిన కంపెనీలకు తయారు చేసే వాటర్ బాటిళ్లను కూడా బీఐఎస్ అధికారులు టెస్టింగ్ చేస్తారు. ప్యాకింగ్ మెటీరియల్, పరిశుభ్రత, వర్కర్లకు హెల్త్ చెకప్, గోళ్లు తీసుకుంటున్నారా? హెయిర్ కవర్ చేస్తున్నారా? వంటివి కూడా పరిశీలిస్తారు. ►ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీస్ యాక్టు ప్రకారం బీఐఎస్ మార్కింగ్ లైసెన్స్ లేని మంచినీళ్ల తయారీ, విక్రయం నిషిద్ధం. అలాంటి ప్లాంట్లకు ఏ ప్రభుత్వ శాఖ లైసెన్స్ జారీ చేయకూడదు. ►నాన్ ఐఎస్ఐ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషన్ నం.9765/సీపీఆర్ అండ్ ఆర్ఈ/డీ3/2006లో సర్క్యులర్ మెమో జారీ చేసింది. ►బీఐఎస్ సర్టిఫికేషన్ లేని వాటర్ ప్లాంట్లకు ఐఎస్ఐ సరి్టఫికెట్, ఇన్సెంటివ్‌లు రద్దు చేయాలని, విద్యుత్ కనెక్షన్ తొలగించాలని పరిశ్రమల శాఖ 2002లోనే ఉత్తర్వులిచ్చింది. ►ఐఎస్ఐ మార్కు లేని ప్లాంట్లపై సీఆర్పీసీ సెక్షన్ 133 కింద కేసు నమోదు చేయాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులున్నాయి. కానీ ఇవన్నీ ఎక్కడ అమలవుతున్నాయి? నిబంధనలకు ‘నీళ్లు’ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న వాటర్ ప్లాంట్లు నిబంధనలు ఏవీ పాటించడం లేదు. అంతా ‘మినరల్ వాటర్’కే అలవాటు పడడం, వినియోగం పెరగడం, మంచి ఆదాయం సమకూరడంతో ఈ వాటర్ ప్లాంట్లు చిన్నచిన్న వీధుల్లోనూ పుట్టుకొస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలం 185 వరకు మాత్రమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లైసెన్స్‌లు పొందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. కానీ అనధికారికంగా 12 వేలకు పైగానే ఇలాంటివి ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు రెండువేల వరకు అనధికారిక వాటర్ ప్లాంట్లు ఉన్నాయని అంచనా. గుంటూరు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోనే చిన్న, చితకా కలిపి ఐదు వేలకు పైగా అనధికారిక వాటర్ ప్లాంట్లు ఉన్నట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో వాటర్ ప్లాంట్ల ద్వారా ఏటా వేల కోట్ల రూపాయల మంచినీటి వ్యాపారం జరుగుతున్నా ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో ఏమాత్రం జమ కావడం లేదు. మరోవైపు కొంతమంది చారిటీ, ట్రస్టుల పేరిట వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అడ్డదారుల్లో సంపాదిస్తున్నారు. చారిటీ సంస్థలకు పన్ను మినహాయింపులతో పాటు పలు రాయితీలు దక్కుతాయి. ఇలా రిజిష్టర్ అయిన సంస్థలు ప్రజలకు వాటర్‌ను కారు చౌకగా ఇవ్వాలి. కానీ అలా చేయడం లేదు. చారిటీ పేరుతో ఐటీ, జీఎస్టీలను ఎగవేస్తున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమేది? నిత్యం ఇళ్లు, కార్యాలయాల్లో వాడే వాటర్ క్యాన్లను తరుచూ విధిగా మార్చాలి. కానీ మూడు నాలుగేళ్ల వరకు మార్చరు. క్యాన్లపై సంస్థ లేబుల్ ఉండాలి. అవీ ఉండవు. ప్యాకింగ్ యూనిట్ స్టెరైల్గా, ఆపరేషన్ థియేటర్లా ఉండాలి. కానీ అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుంది. అయినా ఇటు ప్లాంట్ యజమానులు, అటు ప్రజలు పట్టించుకోవడం లేదు. తక్కువ ఖర్చుతో.. ఐఎస్ఐ ప్రమాణాలు పాటించి ప్లాంట్ ఏర్పాటు చేస్తే కనీసం రూ.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ ఆ ప్రమాణాలు పాటించకుండా రూ.4–5 లక్షలతోనే ఎడాపెడా ప్లాంట్లు పెట్టేస్తున్నారు. ఇలా ఏటా 20 శాతం చొప్పున ఈ వాటర్ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వేసవిలో మరింత ఆదాయం.. ఏడాదిలో ఎనిమిది నెలలు ఎంత ఆదాయం సమకూరుతుందో ఎండాకాలం నాలుగు నెలలూ అంత రాబడి వస్తుంది. వేసవిలో తాగునీటి వినియోగం ఇతర సీజన్లకంటే మూడు రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఈ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు ప్రస్తుత వేసవి సీజను ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అందుకే ఈ సీజనులో అధికారులు కూడా ‘అవగాహన’తో ఈ ప్లాంట్ల తనిఖీల జోలికి అంతగా వెళ్లరు. చూసీ చూడనట్టు వదిలేస్తుంటారు. ఆరోగ్యానికి ప్రమాదం.. శుద్ధి చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌లో టీడీఎస్ స్థాయి గరిష్టంగా లీటరుకు 500 మిల్లీగ్రాముల లోపు ఉండాలి. కానీ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అంతకు రెట్టింపు ఉంటున్నా పట్టించుకునే వారే లేరు. తాగునీటిలో టీడీఎస్ స్థాయి (లెడ్, ఫ్లోరిన్, నైట్రేట్, క్లోరైడ్స్ వంటివి)కి మించి ఉంటే దీర్ఘకాలంలో జీర్ణకోశ, కాలేయ, ఉదర సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని, ఎముకలు, పళ్లకు కూడా నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేసి విక్రయిస్తున్న ‘జనరల్’ వాటర్‌కంటే కుళాయి నీళ్లు చాలా బెటర్ అంటున్నారు నిపుణులు. అధికారుల మధ్య సమన్వయలేమి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసే అధికారం ఆర్డీవోలకే ఉంది. బీఐఎస్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులకు ప్లాంట్‌లో ఉన్న స్టాకు సీజ్ చేయడానికే అధికారం ఉంది. ఆర్డీవో నుంచి ఆదేశాలొస్తేనే తహసీల్దార్లు, ఆహార తనిఖీ, భద్రత అధికారులు సీజ్ చేస్తారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేటప్పుడే ఫుడ్ లైసెన్స్, బీఐఎస్, రెవెన్యూ పర్మిషన్లు ఉన్నాయా? లేదా చూసి ఇవ్వాలి. కానీ అవేమీ చూడకుండానే కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. పైగా ఇలాంటి అనధికారిక వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకునే విషయంలో సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లేదు. ఇవన్నీ వెరసి అనధికారిక వాటర్ ప్లాంట్ల యజమానులకు వరంగా మారింది. రెయిడ్స్‌కు సన్నద్ధమవుతున్నాం.. బీఐఎస్ లైసెన్స్ పొందిన వాటర్ ప్లాంట్లు రాష్ట్రంలో 185 వరకు ఉన్నాయి. బీఐఎస్ సరి్టఫికేషన్ లేకుండా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం. కొందరు కేవలం ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులతో వీటిని నడుపుతున్నారు. బీఐఎస్ లేని అనధికారిక ప్లాంట్లపై తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్చి 26న రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. త్వరలోనే బీఐఎస్ అనుమతుల్లేకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై రెవెన్యూ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, విజిలెన్స్, భూగర్భ జలవనరులశాఖ అధికారులతో కలిసి దాడులకు సన్నాహాలు చేస్తున్నాం. ఇలాంటి అడ్డగోలు ప్లాంట్లను, నీటి వ్యాపారాన్ని కట్టడి చేస్తాం. – బి.సంధ్య, సైంటిస్ట్–డి అండ్ హెడ్, బీఐఎస్, విశాఖపట్నం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు.. నాణ్యతా ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నీళ్లలో టీడీఎస్ సమతుల్యత పాటించకపోవడం, నిర్దేశిత స్థాయిలో శుద్ధి జరగకపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మంచినీటిలో కాపర్ అధికంగా ఉంటే కాలేయం, క్లోరైడ్ ఎక్కువైతే జీర్ణకోశ ఇబ్బందులు, నైట్రేట్స్ వల్ల కండరాలు, నరాల సంబంధ సమస్యలు దీర్ఘకాలంలో అంటే 5–10 ఏళ్లలో తలెత్తుతాయి. అందువల్ల బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న సంస్థలు ఉత్పత్తి చేసే నాణ్యమైన శుద్ధ జలాన్నే ప్రజలు తాగాలి. లేదంటే ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. –డాక్టర్ బి.రత్నగిరి, అసిస్టెంట్ గ్యాస్ట్రో ఎంటారాలజిస్ట్, జీజీహెచ్, విజయవాడ. ప్రభుత్వ ఖజానాకు గండి.. రాష్ట్రంలో అనుమతుల్లేకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్ల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఇలాంటి సంస్థలు అనధికారికంగా ప్లాంట్లు నిర్వహిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి తరచూ పౌరసరఫరాల శాఖ అధికారులు ఇతర విభాగాల వారితో సమీక్షలు నిర్వహించాలి. సంబంధిత శాఖలను సమన్వయం చేయాలి. విజిలెన్స్ కమిటీ సమావేశాల్లో అజెండాగా చేర్చాలి. ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలి. – కాండ్రేగుల వెంకటరమణ, విజిలెన్స్ కమిటీ సభ్యుడు, వినియోగదార్ల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ. అనుమతుల్లేని ప్లాంట్లను సీజ్ చేస్తాం.. డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లకు బీఐఎస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు తప్పనిసరి. ఈ లైసెన్స్‌లు పొందాకే వాటిని నడపాలి. అవి లేకుండా నడుస్తున్న వాటిని కలెక్టర్ అనుమతితో 133 సీఆర్పీసీ ప్రకారం సీజ్ చేస్తాం. ఈ వాటర్ ప్లాంట్లు రోజూ కెమికల్, బ్యాక్టీరియాలాజికల్ టెస్ట్‌లు నిర్వహించాలి. విధిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. వాటర్ క్యాన్లను 90 రోజులకు మించి వినియోగించరాదు. –ఎన్.పూర్ణచంద్రరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయవాడ. చదవండి: 1.43 లక్షల టన్నుల ఆక్సిజన్ సరఫరా పోలవరానికి రూ.333 కోట్లు -
వాటర్ ప్లాంట్‌లో విషద్రావణం
నెల్లూరు, కోవూరు: ఎదుట ఉన్న వాటర్ ప్లాంట్‌తో తన వ్యాపారం సక్రమంగా జరగడం లేదని ఓ ప్రబుద్ధుడు ఏకంగా మినరల్ వాటర్ ప్లాంటులో విషద్రావణం కలిపేశాడు. అయితే ప్లాంటు నిర్వాహడు ఆ వాసనను పసిగట్టి అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కోవూరులోని పెళ్లకూరు కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పెళ్లకూరు కాలనీ సమీపంలో కొంతకాలంగా కోదండరామయ్య అనే వ్యక్తి సాయిబాబ మినరల్ వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ సిద్ధం చేసిన తాగునీటిని అక్కడే క్యాన్లు నింపడంతో పాటు బయట ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఈ వాటర్ ప్లాంట్ సమీపంలో సుజల వాటర్‌ప్లాంట్‌ను శ్రావణ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. కాగా సాయిబాబ వాటర్ ప్లాంట్ కారణంగా తన ప్లాంటు సక్రమంగా జరగడం లేదని శ్రావణ్ కోదండరామయ్యపై అక్కసు పెంచుకొన్నాడు. సమయం కోసం వేచిచూస్తున్న అతను మంగళవారం అర్ధరాత్రి విషద్రావణం(పెనాయిల్,యాసిడ్ మిశ్రమం)ను వాటర్ ట్యాంక్ పైపుల ద్వారా కలిపేశాడు. బుధవారం కోదండరామయ్య కుమారుడు ప్లాంటు వద్దకు వచ్చి శుభ్రం చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో వాసన రావడంతో అనుమానం వచ్చి ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి వేళలో బైక్‌పై వచ్చిన శ్రావణ విషద్రావణాన్ని పైపుల్లో కలపడం స్పష్టంగా కనిపించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా గతంలో కూడా ఇదేవిధంగా రెండుసార్లు శ్రావణ్ తమ ప్లాంటుకు చెందిన విద్యుత్ వైర్లను కట్ చేశాడని బాధితులు పోలీసులకు తెలిపారు. దీంతో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సీహెచ్ కృష్ణారెడ్డి సీసీ ఫూటేజీలను పరిశీలించి నిందితులపై కేసు నమెదు చేశారు. అలాగే సుజల వాటర్‌ప్లాంట్‌ను సీజ్ చేశారు. -
తమ్ముళ్లా మజాకా!
అధికారంలో ఉండగా వాటర్ ప్లాంట్ల నిర్వహణను చేజిక్కించుకున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. ఎంచక్కా లాభాలను తమ జేబుల్లోకి వేసేసుకొని... వాటికి వచ్చే కరెంటు బిల్లులను మాత్రం చెల్లించకుండా విద్యుత్‌శాఖకు ఎగనామం పెట్టేశారు. – శింగనమల సాక్షి,శింగనమల: శింగనమలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను సప్తగిరి క్యాంపర్ సంస్థ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా ఉచితంగా అందించారు. దీనిని రామాలయంలోని కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ గ్రామ పంచాయతీ చేపట్టాలని నిర్ణయించారు. కానీ అధికారం ఉందన్న నెపంతో టీడీపీ కార్యకర్త దాని బాధ్యతలను అప్పగించారు. తన సొంత మినరల్ వాటర్ ప్లాంట్‌గా ఆయన నీటిని అమ్ముకుంటూ వచ్చారు. ఇంతవరకూ గ్రామ పంచాయతీకి ఎలాంటి డబ్బు జమ చేయలేదు. వాటర్ ప్లాంట్ విద్యుత్ బకాయి ఇప్పటి వరకు రూ.1.50 లక్షకు చేరింది. నేటికీ ఈ బకాయిని విద్యుత్ అధికారులు వసూలు చేయలేదు. వచ్చే ఆదాయమంతా టీడీపీ కార్యకర్తే తీసుకున్నా, విద్యుత్ అధికారులు మాత్రం ఆయన్నుంచి వసూలు చేసుకోలేదు. విద్యుత్ మీటర్‌ను మాత్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ పేరు మీద తీసుకున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం గ్రామ పంచాయతీ చెల్లిస్తుందిలేననే ధీమాగా ఉన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తే నిర్వహిస్తుంటం గమనార్హం. విద్యుత్ అధికారులు మాత్రం బకాయిలు వసూలు చేయకపోవడం విశేషం. ఈవిధంగా శింగనమల నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరు మీద వసూలు చేసిన వాటర్ ప్లాంట్లకు విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ వాటర్ ప్లాంట్లకు దాతలు సహకరించడం, వాటర్ షెడ్ ద్వారా నిధులు కేటాయించడం, ఎంపీ ల్యాండ్స్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లను గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. శింగనమల మండలంలో సలకంచెర్వు, నాయనవారిపల్లి, లోలూరు గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. సలకంచెర్వులో వాటర్ షెడ్ కింద ఏర్పాటు చేయగా, గత సర్పంచ్ , వారి అనుచరులు నిర్వహించారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకున్నారు. ప్రస్తుతం అది నిలిచిపోయింది. దీనికి రూ.50 వేలు విద్యుత్ బకాయి ఉంది. నాయనవారిపల్లిలో వాటర్‌షెడ్ కింద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. నిర్వహణ మాత్రం మాజీ సర్పంచ్ చేస్తున్నారు. విద్యుత్ బకాయి రూ.4 వేలు దాకా ఉంది. లోలూరులోనూ రూ.4 వేలు బకాయి చెల్లించాల్సి ఉంది. ఇక ఎంపీ ల్యాడ్స్ కింద కల్లుమడి, రాచేపల్లి, నిదనవాడ, ఉల్లికల్లు, సోదనపల్లి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం రూ.2.40 లక్షల విద్యుత్ బకాయి చెల్లించాల్సి ఉన్నా ఎవరూ చెల్లించడంలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే తంతు నార్పల మండలంలోనూ గూగూడు, బండ్లపల్లి, పూలసలనూతలలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయగా, నార్పల, బి.పప్పూరు, బొందలవాడ గ్రామాల్లో ఏర్పాటు చేసినా అవి ప్రారంభం కాలేదు. పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి, చెర్లోపల్లి, ఓబుళాపురం గ్రామాల్లో వాటర్‌షెడ్ నిధుల కింద వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వీటికి రూ.1.80 లక్షలు విద్యుత్ బకాయిలున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో పసూలూరు, సిద్దరాంపురం, కొర్రపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు రూ.1.50 లక్షలు విద్యుత్ బకాయి ఉన్నారు. గార్లదిన్నె మండలంలో మర్తాడు, కోటంక, గార్లదిన్నె గ్రామాల్లోనూ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వీటికి రూ. గార్లదిన్నెలో రూ.10 వేలు బకాయిలున్నాయి. మర్తాడులో విద్యుత్ మీటరు లేకుండానే నేటికీ వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈవిధంగా నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లుకు సంబంధించి రూ.5.70 లక్షలు విద్యుత్ బకాయిలున్నాయి. ప్రభుత్వం మారడంతో ఈ బకాయిలు ఎగవేతకు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బకాయి వసూలు చేస్తాం వాటర్ ప్లాంట్లకు ఉన్న విద్యుత్ బకాయి వసూలుకు చుంటున్నాం. శింగనమల మండలంలో నిర్వహణలో ఉన్న వాటర్ ప్లాంట్లకు సంబంధించి ఎంత బకాయి ఉందో నిర్వాహకులతో వసూలు చేస్తాం. విద్యుత్ బకాయి చెల్లించకపోతే మాత్రం విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తాం. – ప్రసాద్, ట్రాన్స్‌కో ఏఈ, శింగనమల -
వాటర్‌ప్లాంట్లపై దాడులు
మంచిర్యాలక్రైం : జిల్లా కేంద్రంలోని పలు వాటర్‌ప్లాంట్లపై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథి, కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారి రవీంద్రచారి ఆధ్వర్యంలో శనివారం దాడులు చేపట్టారు. ఈనెల 19న ‘సాక్షి’లో ‘నీళ్ల దందా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు పట్టణంలోని గంగోత్రి, జేఎస్ ఇండస్ట్రీస్, నేచర్ వాటర్‌ప్లాంట్లపై దాడులు చేసి నీటిశుద్ధి నిర్వహణ తీరును పరిశీలించారు. అనుమతి పత్రాలు తనిఖీలు చేశారు. పరీక్షల నిమిత్తం నీటి నమూనాలు సేకరించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పలువురు వాటర్ప్లాంట్లు నడుపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. సేకరించిన నీళ్లలో కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ టీం, కల్తీ నిరోధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
శుద్ధజలం.. అబద్ధం
జిల్లాలో అనధికారికంగా వాటర్ ప్లాంట్లు వెలిశాయని, ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా నీటిని అమ్ముతున్నారని, ఈ నీరు తాగడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదముందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) అధికారులు 2016లో అప్పటి కలెక్టర్ కోన శశిధర్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్, సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఉన్న మూడు వేల వాటర్ప్లాంట్లలో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ అనుమతి ఉందని అధికారులు తేల్చారు. గుంటూరులో కలుషిత నీరు తాగి 17 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. మినరల్ వాటర్ పేరుతో వేలాది వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బీఐఎస్ అనుమతుల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాత ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్, టీడీఎస్ ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించాలి. కానీ ఇటువంటి ప్రమాణాలేవీ పాటించకుండానే వాటర్ ప్లాంట్లు అక్రమంగా నడుపుతున్నట్లు ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో తేలింది. అనంతపురం న్యూసిటీ: జిల్లాలో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు మినరల్ పేరుతో అక్రమ దందా చేస్తున్నారు. వివిధ మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం...ఇదే అదునుగా వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు మినరల్ వాటర్ పేరిట గరలాన్ని ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గుర్తింపు లేకుండా జిల్లాలో మూడు వేలకు పైగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ గుర్తింపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రూ 10 నుంచి 15 లక్షల మంది మినరల్ నీటిని తాగుతూ అనారోగ్యం తెచ్చుకునే పరిస్థితి నెలకొనింది. తాగునీటి నాణ్యతను పరిశీలించాల్సిన రెవెన్యూ, పుడ్కంట్రోల్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. ప్రమాణాలేవీ? వాస్తవంగా బీఐఎస్ 60 రకాల నాణ్యత ప్రమాణాల పాటించాలని దిశానిర్ధేశం చేస్తోంది. కానీ నీటి శుద్ధి ప్లాంట్లు ప్రమాణాలను గాలికొదిలేసి అందులో పట్టుమని బేసిక్ ప్రమాణాలు కూడా పాటించడం లేదు. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం ఫిల్టర్ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిలో కరిగిన ఘన పదార్థాల మొతాదు లీటరు నీటికి 100–150 మి.గ్రా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నిబంధన పాటించడం లేదు. లీటరు నీటిలో క్యాల్షియం 75 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 30 మిల్లీ గ్రాములు ఉండాలి. అయితే ఇక్కడి ప్లాంట్లలో వివిధ రసాయనాలు కలిపి ఇచ్చేస్తున్నారు. ఫ్లోరైడ్ మోతాదు ఒక మిల్లి గ్రామ్ మించకూడదు. ఐరన్మోతాదు 0.3 మి.గ్రా ఉండాలి. నిద్రమత్తులో అధికారులు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, పుడ్ సేఫ్టీ అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అనధికారికంగా ప్లాంట్ నిర్వాహకులు యథేచ్ఛగా నీటి వ్యాపారం చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక ఆహార కల్తీ నిరోధకశాఖలో ఐదుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు గాను ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా నెల క్రితం ట్రైనింగ్‌కు వెళ్లారు. ఇక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రూ. కోట్లలో వ్యాపారం తాగునీటి వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. జిల్లాలో దాదాపుగా 43 లక్షల మంది జనాభా ఉంది. వీరిలో సగం మంది మినరల్ వాటర్‌కు అలవాటు పడ్డారు. బిందె రూ 6 నుంచి 10, క్యాన్ రూ 20తో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఇలా రోజూ రూ కోటికిపైగా జలవ్యాపారం జరుగుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ, మిగితా 11 మునిసిపాలిటీల్లో నీరు పూర్తీ స్థాయిలో సరఫరా చేయడం లేదు. కేటాయించిన ఎంఎల్డీ కంటే తక్కువే పదుల సంఖ్యలో మునిసిపాలిటీలకు నీరు సరఫరా అవుతోంది. అసలే వేసవికాలం కావడంతో నీరు సరిగా వస్తుందో లేదోనని ముందస్తుగా ప్రజలు నీటిని కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, గుత్తి, పామిడి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర, రాయదుర్గం, కదిరి తదితర ప్రాంతాల్లోని లక్షలాది మంది మినరల్ గరళాన్ని తాగుతున్నారు. ఇన్స్పెక్టర్ల కొరత ఉంది అనధికారికంగా వాటర్ ప్లాంట్ నిర్వహించే వారిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లే కేసులు పెట్టాలి. ప్రస్తుతం ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉంటే ఒకరే ఉన్నారు. అయినా నగరంలోని చాలా ప్లాంట్లపై కేసులు నమోదు చేసి, ఫైన్లు వేశాం. -నాగేశ్వరరావు, పుడ్,సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ రోగాలు వస్తున్నాయి గతంలో మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన వాటర్ప్లాంట్లను సైతం ఇప్పుడు నడుపుతున్నారు. వాళ్లు సరఫరా చేసే మినరల్‌వాటర్ ఉప్పునీళ్ల మాదిరి ఉంటున్నాయి. అవి తాగినవారు గొంతు సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. -బాబ్జాన్, విద్యార్థి, కదిరి దుష్పరిణామాలు తప్పవు ప్రమాణాలు లేని నీటిని తీసుకోవడం ద్వారా దుష్పరిణామాలు తప్పదు. నీటిలో రుచి కోసం రసాయనాలు కలపడం ద్వారా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కండరాలు, కీళ్ల నొప్పులు, యముకల్లో పటుత్వం కోల్పోయే అవకాశం ఉంది. బీఐఎస్, ఐఎస్ఓ సర్టిఫైడ్ చేసిన నీటిని తీసుకోవాలి. -డాక్టర్ కృష్ణకాంత్‌రెడ్డి, న్యూరాలజిస్టు, సర్వజనాస్పత్రి శుద్ధి జలాన్ని అందిస్తున్నాం బీఐఎస్ ప్రమాణాలతో ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి జలాన్ని అందిస్తున్నాం. కెమెస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి పరీక్షలు చేసి ప్రజలకు నీరందిస్తున్నాం. జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. గతంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అధికారులు తనిఖీ చేసి అనధికార ప్లాంట్లను గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్వాహకులపై ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజలు నీటిని కొనేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తీసుకోవాలి. -పురుషోత్తంరెడ్డి, లెజెండ్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు విధిలేక కొంటున్నాం మినరల్ వాటర్ పేరుతో ఆటోల్లో, వాటర్ ప్లాంట్లలో ఒక్కో క్యాన్‌కు రూ.10 నుండి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఆ నీరు ఏ మాత్రం బాగుండటం లేదు. గత్యంతరం లేక ఆ నీటిని తాగుతున్నాం. అధికారులు స్పందించి నాణ్యమైన నీటిని అందించేలా ప్రతి వాటర్ ప్లాంటూ ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలి. -మహేష్, ధర్మవరం -
ధనదాహం
♦ నీటిశుద్ధి పేరిట కాసుల వేట ♦ అనుమతులు లేకుండా విక్రయాలు ♦ పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు ♦ బీఎస్ఐ నిబంధనలకు మంగళం ♦ రూ.కోట్లల్లో పన్నుల ఎగవేత ♦ కేంద్రాలపై లోపించిన పర్యవేక్షణ జిల్లావ్యాప్తంగా 200కుపైగా వాటర్ ప్లాంట్లు అనుమతి లేకుండా నడుస్తున్నాయి. కేవలం ఐదింటికి మాత్రమే అనుమతి ఉంది.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నాణ్యతా ప్రమాణాలు పాటించ రు.. అనుమతులు తీసుకోరు.. ప్రాథమిక నిబంధనలు అమలు చేయరు.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు.. అయితేనేం రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో శుద్ధజలం పేరిట మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారుు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. కరువైన అధికారుల నియంత్రణతో ఇష్టారాజ్యంగా సాగుతున్న ‘నీళ్ల’ వ్యాపారంలో సామాన్యులే సమిధవులవుతున్నారు. మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తూ వినియోగదారులకు లేని రోగాలను అంటగడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భారత ప్రమాణా ల సంస్థ(బీఎస్ఐ) నిబంధనలను పూర్తిగా విస్మరించిన వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు ‘అమ్యామ్యాల’కు రుచి మరిగిన అధికారులు తోడు కావడం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధ న్, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా మంచి నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారుగా 200 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నా.. కేవలం ఐదింటికీ మాత్రమే బీఎస్ఐ అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ జిల్లాలో నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లలో చాలా మంది ప్రమాణాలు పాటించడం లేదు. డబ్బులు ఎరగా వేసి అరకొర వసతులున్న అనుమతులు తెచ్చుకుంటున్న వ్యాపారులు చిన్న చిన్న గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. నీటిని నిల్వచేసే క్యానులను ప్రతిసారి శుభ్రం చేయకుండానే సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డిలతోపాటు జిల్లా వ్యాప్తంగా వాటర్ ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు అందుబాటులో ఉండటం లేదు. పీహెచ్, టీడీఎస్ పరీక్షలు అసలే జరగడం లేదు. శానిటరీ అధికారులు మామూళ్లకు రుచిమరిగి అసలే తనిఖీలు చేయడం లేదు. కొన్ని సంస్థలు ఐఎస్ఐ సర్టిఫికెట్లు కలిగినప్పటికీ వాటిని ఏటా రెన్యూవల్ చేయడం లేదు. వాటర్ కేంద్రాలు కచ్చితంగా భూగర్భజలాలను ఉపయోగించాలి. అయితే కొందరు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా వుండగా ఒక లీటరు శుద్ధి జలాన్ని తయారు చేయడానికి మూడు లీటర్ల నీరు వృథా అవుతోంది. ఈ క్రమంలో భూగర్భజలాలను విరివిగా తీయడం వలన ఈ ప్లాంట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ నీటినిల్వలు తగ్గిపోతున్నాయని చుట్టు పక్కల ఉండేవారు ఫిర్యాదులు చేస్తున్నా అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారు. మినరల్ వాటర్‌పై కూడా 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, సేవ ముసుగులో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఆ పన్నులు ఎగవేస్తున్నారు. అధికారుల ఉదాసీనతే కారణం మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ) అనుమతుల సమయంలో ఇచ్చిన మార్గదర్శక సూత్రాలు అమలు చేయాలి. వాటర్ ప్లాంట్‌లో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు విధిగా ఉండాలి. వీరు శుద్ధి చేసిన ప్రతి బ్యాచ్‌కు చెందిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7 కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని బీఎస్ఐ, డాక్టర్లు చెప్తున్నారు. నీటిలో పూర్తిగా కరిగి ఉండే లవణాలను(టీడీఎస్) కూడా పరీక్షించాలి. కొత్తగా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులు ఉండేలా చూడాలి. ఇందులోనే నీటిని పరీక్ష చేసే ల్యాబ్, అందుకు ఉపయోగించే పరికరాల కోసం రెండు గదులు కేటాయించాలి. ఫిల్లింగ్ సెక్షన్, ఆర్వో సిస్టంలో 3,000 లీటర్ల కెపాసిటీ డ్రమ్ములను ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన జలాలను నిల్వచేసేందుకు 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన డ్రమ్ములు వాడాలి. శుద్ధి చేసిన నీటిని తప్పకుండా ఓజోనైజేషన్ చేయాలి. మినరల్ వాటర్‌ను బబుల్స్(క్యాను)లోకి పట్టే ముందు అల్ట్రావైరస్ రేస్‌తో వాటిని శుద్ధి చేయాలి. నీటిని క్యాన్‌లోకి పట్టిన తర్వాత రెండు రోజులపాటు భద్రపరిచి అనంతరం మార్కెట్లోకి పంపాలని బీఎస్ఐ నిబంధనలు సూచిస్తున్నాయి. నీటిని సరఫరా చేసే క్యానులకు ప్రతిసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపోసొల్యూషన్తో కెమికల్ క్లీనింగ్ చేయాలి. సీలుపై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ ను వేయాలి. నీటిని క్యానులలోకి నింపేవారు చేతులకు గ్లౌజస్ ధరించాలి. శానిటరీ అధికారుల చేత ప్రతినెలా నీటిని తనిఖీ చేయించి రిపోర్టును ఐఎస్ఐకి పంపాలి. ప్రతి ఏడాది ఐఎస్ఐ గుర్తింపు ఉన్నవాళ్లు తప్పనిసరిగా రెన్యూవల్ చేయించుకోవాలి. ఇవేమీ పాటించకున్నా నిర్వహిస్తున్నారంటే అధికారుల ఉదాసీనతే కారణమన్న చర్చ జరుగుతోంది. -
సుజలం .. దుర్లభం
నాణ్యత ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు కలుషితమవుతున్న మినరల్ వాటర్ రోగాల బారిన పడుతున్న ప్రజలు స్వార్థం మానవ విలువలను మింగేస్తోంది..ఏం కొనాలన్నా..ఏం తినాలన్నా కల్తీమయమై భయపెడుతున్నారుు.. తినే నూనె బొట్టులోనూ, తాగే నీటి చుక్కలోనూ నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయి.. అధికారుల అలసత్వం ఒకవైపు.. అలవిగాని దురాశ మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.. చిలకలూరిపేట : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని చోట్లా తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో ప్రజలు, అధికారులు ప్రత్యామ్నాయ జల వనరులపై దృష్టి కేంద్రీకరించారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ లేని విధంగా ఓగేరువాగు నీటిని ప్రజలకు సరఫరా చేసి విమర్శల పాలయ్యారు. ఒక వైపు ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా మినరల్ వాటర్ పేరుతో కొత్త దోపిడీకి తెరతీశారు. లాభార్జనే ధ్యేయంగా నీటి వ్యాపారం.. గ్రామీణ ప్రాంతల్లో అనుమతులు తీసుకొని వాటర్ ప్లాంట్ పెట్టాలంటే కనీసం రూ. 40 నుంచి 50 లక్షలు ఖర్చవుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో కోటిపైనే. ప్లాంట్ ఏర్పాటుకు 22 అంశాల్లో ప్రాధాన్యమివ్వాలి. నీటి నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్, అందులో బీఎస్సీ కెమిస్ట్రీ వ్యక్తిని, మైక్రోబయాలజీ ల్యాబ్, ఎమ్మెస్సీ బయాలజీ వ్యక్తిని నియమించాలి. వాటర్ బాటిల్స్ నింపే ప్రాంతంలోనూ, ల్యాబ్‌లోనూ ఏసీ సౌకర్యం కల్పించాలి. పూర్తి స్థాయిలో పరిశుభ్రత పాటించాలి. ప్రస్తుతం నెలకొల్పుతున్న ప్లాంట్లలో ఇవేమీ పాటించడం లేదు. దీంతో ప్రజారోగ్యం అందోళనలో పడింది. నీరు శుద్ధి చేయకపోతే డయేరియా, కామెర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీటి శుద్ది కోసం మోతాదు మించి క్లోరిన్ వాడితే ప్రాణాంతకరమైన క్యాన్సర్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. నిరుపయోగంగా మారిన నీటి పరీక్షల కిట్లు అర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతి ఏటా పరీక్షలు నిర్వహించి తాగటానికి నీరు పనికి వస్తుందా లేదా అని నిర్ధారిస్తారు. ప్రస్తుతం సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పంచాయతీల్లో తాగునీటి పరీక్షలు నిర్వహించడానికి కిట్స్ పంపిణీ చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటంతో ఇవి మూలన పడ్డాయి. తిరి ప్రస్తుతం ఫీల్ట్ టెస్టింగ్ కిట్స్ పేరుతో పంచాయతీలకు మళ్లీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవి వంద సార్లు ఉపయోగపడతాయి. ఈ కిట్స్ ద్వారా చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి పరీక్షలు నిర్వహించవచ్చు. పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించడానికి పంచాయతీ కార్యదర్శి, పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడు, అంగన్వాడీ, వెలుగు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. కుళాయి నీళ్లే భేష్.. మినరల్ వాటర్ పేరుతో సరఫరా అవుతున్న నీటికన్నా శుద్ధి చేసిన కుళాయి నీళ్లే సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సరఫరా చేసే నీటిలో రంగు, మట్టి శాతం, ఫ్లోరైడ్, క్లోరైడ్ ప్రమాణాల మేర ఉంటాయి. మినరల్ వాటర్ పేరుతో చలామణి అవుతున్న నీటిలో ఇవి ఉండవు. ఉదాహరణ లీటర్ నీటిలో 0.6 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉండాలి. దీంతో ఎముకలు పటిష్టమవుతారుు. శుద్ధి చేసిన నీటిలో 0.1 మిల్లీగ్రాముల మేర మాత్రమే ఫ్లోరైడ్ ఉంటుంది. దీంతో ఎముకలు పటిష్టత కోల్పోతారుు. -
సీఎంను తీసుకొచ్చి ఆలయ రూపురేఖలు మారుస్తా
⇒రెండేళ్లలో అన్ని గ్రామాలకు వాటర్ ప్లాంట్లు ⇒అర్హులందరికీ ఫించన్లు వస్తాయ్ ⇒ఎంపీ కడియం శ్రీహరి జీడికల్(లింగాలఘణపురం) : మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయానికి వచ్చే నవంబర్‌లోగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆలయ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న జీడికల్ ఆలయ అభివృద్ధికి తనతో పాటు డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్యతో కలిసి చర్యలు తీసుకుంటానన్నారు. రెండేళ్లలో మండలంలోని 17 గ్రామాలతోపాటు శివారు గ్రామాల్లో కూడా ఢీఫ్లోరైడ్ వాటర్ప్లాంట్లు ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మిస్తానని చెప్పారు. మొదటి విడతగా ప్రస్తుతం వాటర్‌ప్లాంట్‌లేని గ్రామాలకు మంజూరీ చేస్తానన్నారు. సమావేశంలో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్‌లు మదార్, సోమయ్య, మల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మధు, కృష్ణ, అంజయ్య, నాయకులు నాగరాజు, శ్రీనివాసు, పురుషోత్తంరెడ్డి, వీరస్వామి, ప్రభాకర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేశం, రవి పాల్గొన్నారు. విచారణ పూర్తి చేసి రెన్యూవల్ చేయండి లింగాలఘణపురం : కళ్లెం సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ నిర్వహించి త్వరగా రైతులకు రుణాలు రెన్యూవల్ చేయాలని ఎంపీ కడియం శ్రీహరి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్(డీసీఓ) సంజీవరెడ్డిని ఆదేశించారు. శనివారం ఆయన జీడికల్ వీరాచల రామచంద్రుడిని దర్శించుకున్న అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వైస్ చైర్మన్ దర్శన్‌రెడ్డి సొసైటీ సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే డీసీఓతో ఫోన్లో మాట్లాడారు. సొసైటీలో విచారణ పూర్తి చేసి త్వరగా రుణాలు రెన్యూవల్స్ చేయాలని ఆదేశించారు. సోమవారం విచారణ అధికారిని పంపిస్తానని డీసీఓ చెప్పినట్లు ఎంపీ శ్రీహరి వైస్‌చైర్మన్‌కు తెలిపారు. -
కొత్త టెక్నాలజీతో నీటి ప్లాంట్లు
సిద్దిపేట రూరల్: కొత్త టెక్నాలజీ ఉపయోగించి సిద్దిపేటలో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపూర్, బుస్సాపూర్, కోదండరావుపల్లి, బండచెర్లపల్లి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కార్డు పెట్టి నీళ్లు పట్టుకునే కొత్త టెక్నాలజీని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన మంచినీటిని తాగడం ద్వారా సిద్దిపేట రాష్ర్టంలోనే ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లాలో 74 వాటర్ ప్లాంట్లు ఉండగా 64 వాటర్ ప్లాంట్లు సిద్దిపేట నియోజకవర్గంలోనే ఏర్పాటు చేశామన్నారు. అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగాలన్నదే తమ లక్ష్యమన్నారు. మన ప్రాంత బియ్యం మనమే తయారు చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రసుత్తం ఇచ్చే బియ్యం కాకుండా ఆహార భద్రత పథకం కింద కోటా పెంపునకు ఆలోచన చేస్తున్నామన్నారు. గ్రామాల్లో చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు. అందుకోసం చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామన్నారు. అలాగే దేశంలోని ఏ రాష్ట్రంలో పింఛన్లను పెంచండంలేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నవంబరు నెల నుంచి పింఛన్లు ఇస్తున్నామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు. అంతముందు కోదండరావుపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ముంపు గ్రామాలకు పరిహారం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలు ఉంటే నష్టపరిహరం కింద అందరూ మెచ్చే విధంగా పాలసీ తెస్తున్నామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. భూములతో పాటు ఇళ్లు మొత్తం పోతే ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ విలువను బట్టి నాలుగింతలు పెంచి ఇస్తామని, బీసీలకు మార్కెట్ విలువను బట్టి మూడింతలు పెంచి ఇస్తామన్నారు. అదే విధంగా కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా రూ.5లక్షలను అందజేస్తామన్నారు. వెంకటాపూర్, బుస్సాపూర్ గ్రామాలు తడ్కపల్లి రిజర్వాయర్‌లో పోతున్నాయంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయగా నేనుండగా మీ ఊరు పోదని చెప్పడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సర్పంచ్‌లు ప్రతాప్‌రెడ్డి, మద్దూరి లలిత మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ప్యూరీ(హై)ఫై
సిద్దిపేట జోన్: మురికివాడలకు ఇది శుభవార్త. స్వచ్ఛమైన తాగునీటి కోసం అల్లాడుతున్న పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాల్టీలో వాటర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సేఫ్ వాటర్ పేరిట వినూత్న ప్రక్రియకు నాంది పలికింది. ఆ దిశలోనే జిల్లాలో సిద్దిపేట మున్సిపాల్టీలో ప్యూరీఫై వాటర్‌ను అందించేందుకు మున్సిపల్ అధికారులు అంకురార్పణ చేశారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో తొలి విడతగా సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛంద సంస్థ సహకారాలతో మున్సిపల్ యంత్రాంగం ఎంపిక చేసింది. ఆ దిశగా పట్టణంలోని 17 నిర్దేశిత ప్రాంతాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు శనివారం బృందాలుగా పట్టణంలో వాస్తవ వివరాల సేకరణకు సమగ్ర సర్వే నిర్వహించారు. గత కొంత కాలంగా గ్రామీణ ప్రాంతాలకు ఏటీడబ్ల్యూ (ఎనీ టైమ్ వాటర్) పేరిట స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న బాలవికాస్ సంస్థతో అనుసంధానంగా సిద్దిపేట మున్సిపల్ నీటి సరఫరా విభాగం నామమాత్ర రుసుముతో ప్యూరీఫై వాటర్ పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసింది. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రక్రియ సత్ఫలితాలను అందిస్తే భవిష్యత్తులో జిల్లాలోని మిగతా మున్సిపాల్టీలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. వివరాలు... స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా పేరొందిన సిద్దిపేటలో అధికారిక రికార్డుల ప్రకారం ప్రస్తుతం 1.50 లక్షల జనాభా ఉన్నట్లు సమాచారం. వీరందరికి గత కొంత కాలంగా కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి తాగునీటిని మున్సిపల్ యంత్రాంగం సరఫరా చేస్తుంది. మరోవైపు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గత కొన్ని నెలలుగా బాల వికాస్ నేతృత్వంలో వాటర్ ప్లాంట్ల నిర్వహణ కొనసాగుతుంది. సభ్యత్వ రుసుముతో నామమాత్ర ధరకే శుద్ధి చేసిన మినరల్ వాటర్‌ను అందిస్తున్న ప్రక్రియ పల్లెల్లో సత్ఫలితాలను కలిగిస్తుంది. ఈ క్రమంలో ఇదే విధానాన్ని పట్టణ ప్రాంత ప్రజలకు అందించాలన్న ఆశయంతో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఇటీవల మున్సిపల్ అధికారులతో ప్రణాళికపై సుదీర్ఘం గా చర్చించారు. జల కాలుష్యంతో వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ యంత్రాంగం భవిష్యత్ ప్రణాళికను రూపొందించింది. ఆ దిశగా పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న 132 చేతి పంపులు, 123 పవర్ బోర్ల ద్వారా అందుతున్న తాగునీటిని సేకరించిన అధికారులు సంబంధిత పరీక్షలను నిర్వహించారు. ప్యూరీఫైకి సానుకూలంగా జల వనరులు ఉండడంతో సిద్దిపేట పట్టణంలో తొలి ప్రక్రియగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి మున్సిపల్ నీటి సరఫరా విభాగం ముందుకొచ్చింది. అందులో భాగంగానే పట్టణంలోని 34 వార్డుల పరిధిలోని ప్రజలతో పాటు ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారికి మినరల్ వాటర్‌ను అందించాలని నిర్ణయించింది. ఆ దిశగా నెహ్రూ పార్క్, బారాయిమామ్, బాలాజీ థియేటర్, భారత్‌నగర్, ఖాదర్పురా, సాజీత్పురా, హనుమాన్ నగర్, హౌజింగ్ బోర్డ్, కేసీఆర్ నగర్, ఎఫ్‌సీఐ గోదాం, వడ్డెర కాలనీ, సుభాష్‌నగర్, ఎన్సాన్పల్లి రోడ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో మొత్తంగా 17 పాయింట్లను మున్సిపల్ నీటి సరఫరా విభాగం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లోని చేతి పంపులు, పవర్ బోర్ల స్థితిగతులను, అక్కడ ప్రభుత్వ భవనాలైన అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలను గుర్తించే ప్రక్రియను శనివారం చేపట్టింది. ఆ దిశగా మున్సిపాలిటీలోని ప్రత్యేక బృందాన్ని మూకుమ్మడి సర్వేకు ఆదేశించిన మున్సిపల్ అధికారులు ఆయా మురికివాడల్లో వాటర్ ప్లాంట్ల భవన నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులపై నివేదికను తయారు చేయడంలో నిమఘ్నమయ్యారు. బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ అందించే నీటి శుద్ధికరణ యంత్రాల ద్వారా పట్టణంలోని ప్రజలకు స్వచ్ఛమైన మినరల్ వాటర్‌ను నామమాత్ర రుసుముతో అం దించేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపడుతుం ది. ఈ ప్రక్రియకు అవసరమైన వాహన సౌకర్యం, వాటర్ క్యాన్ల సదుపాయాన్ని మంత్రి హరీష్‌రావు సమకూర్చగా, బోర్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, భవన నిర్మాణాల ప్రక్రియను మున్సిపాలిటీ పర్యవేక్షించనుంది. మరోపక్షం రోజుల్లో తొలి విడతగా జిల్లాల్లో సిద్దిపేటలో ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలకు నామమాత్ర రుసుముతో తా గునీటి అందించేందుకు సమాయత్తం అవుతోంది. ప్రయోగాత్మకంగా సిద్దిపేటలో చేపడుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియ సత్ఫలితాలు కలిగితే జిల్లాలోని మిగతా మున్సిపాల్టీలో, నగర పంచాయతీల్లో అమలు చేసేం దుకు జిల్లా అధికారులు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. ఏదేమైనా ఎనీటైం మనీ తరహాలో ప్రస్తుతం పల్లెల్లో ఎనీటైం వాటర్ ప్రక్రియ భవిష్యత్తులో పట్టణ వాసుల ముంగిట్లోకి రానున్నట్లు సమాచారం. -
అక్వెరియం పర్నీచర్
కంటికి ఇంపు.. ఇంటికి శోభ.. మనస్సుకు హాయి. అందానికి అందం.. ఆహ్లాదానికి ఆహ్లాదం. క్రియేటివిటీ అదిరింది. ఆకర్షణీయమైన డిజైన్లతో అక్వేరియంలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇంట్లో స్థలాన్ని ఆదా చేస్తున్నాయి. ఫర్నిచర్లో ఇమిడిపోతున్నాయి. భలే ఉన్నాయి. దేనిలోనైనా సౌకర్యంగా అమరిపోతున్నాయి ఫర్నిచర్ అక్వేరియంలు. ఇంటికి మరింత అందాన్ని తీసుకు వస్తున్న సరికొత్త అక్వేరియంల గురించి తెలుసుకుందాం... నాలుగు పలకల గాజు పెట్టె. అందులో రంగురాళ్లు, నీటిమొక్కలు. ఇదే కదా అక్వేరియమంటే. కాని ఇప్పుడు దాని లుక్కే మారిపోయింది. అక్వేరియంల కోసం స్పెషల్‌గా స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. టీపాయ్, డైనింగ్ టేబుల్, బుక్ ర్యాక్, వాష్ బేసిన్, బెడ్స్‌లో అక్వేరియంలు మన ముందుకు వచ్చాయి. మానసిక సాంత్వన బెడ్రూమ్లో మంచానికి ఉండే హెడ్‌బోర్డ్ భాగంలో అమర్చిన అక్వేరియంలు పడుకునే ముందుకు మానసిక సాంత్వననిస్తున్నాయి. ఫిష్ ట్యాంక్‌లను గోడల్లో భాగంగా ఏర్పాటు చేయడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. చిన్నారులకు ఇవి నేస్తాలుగా ఉండటానికి వీలుగా ఇంటి మధ్యలో గచ్చుకింది భాగంలో అక్వేరియంను అమర్చి దానిపైన గాజు టైల్స్‌ను అమరుస్తున్నారు. ఎఫెక్ట్ కోసం వీటిలో ఎల్ఈడీ లైట్లను కూడా సెట్ చూస్తున్నారు. చిన్న అక్వేరియంలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టేబుల్‌పై పెట్టుకునే ఎల్ఈడీ లైట్, పెన్ స్టాండ్ లాంటి మోడల్స్ వచ్చాయి. షాపుల్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి అక్వేరియంను తెప్పించుకోవచ్చు. వీటి ధర 5 వేలు మొదలు లక్షల రూపాయల వరకూ ఉన్నాయి. ఒకప్పుడు అక్వేరియంలు కొనాలంటే దానికోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి అనుకునేవారు. కాని నేడు ఆ పరిస్థితి లేదు. అక్వేరియంలు కావాలనుకుంటే ఇళ్లు కడుతున్నపుడే ప్లాన్ చేసుకుంటూ చక్కగా గోడల్లో అమరిపోయేవిధంగా వీటిని సెట్ చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల స్థలం ఆదా కావడమే కాకుండా చూడటానికి ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది. - విజయారెడ్డి -
జోరుగా మినరల్ వాటర్ వ్యాపారం
పరిగి, న్యూస్‌లైన్: లాభాల వేటలో వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. వేసవిలో నీటికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో బరిలోకి దిగిన వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన మినరల్ నీరంటూ 20 లీటర్ల డ బ్బాకు రూ. 15 వసూలు చేస్తున్నారు. అయితే ఈ నీటి తయారీకి కనీస ప్రమాణాలు పాటించకున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిగి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండటం, కొత్తగా పలు విద్యా సంస్థలు కూడా వెలియడంతో జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో పట్టణంలో మినరల్ వాటర్ వినియోగం పెరిగిపోయి వ్యాపారులకు కాసుల పంటపండిస్తోంది. పరిగి పట్టణంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆరు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ నుంచి రోజుకు 3వేల లీటర్ల వరకు నీటిని విక్రయిస్తున్నారు. ఆటోలు, ఇతర వాహనాల ద్వార డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే నీటిని సరఫరా చేసే కంపెనీ తమ బాటిళ్లపై కంపెనీ స్టిక్కర్ అతికించాలి. కాని పరిగిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లకు చెందిన ఏ ఒక్కరూ బాటిళ్లకు స్టిక్కర్లు అతికించడం లేదు. ఇంటి దగ్గరకే నీరు వస్తుండటంతో ప్రజలు కూడా ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిలో క్రిమికీటకాలు రాకుండా ఓ రసాయన పదార్థాన్ని కలుపుతారు. నీటిని ఫిల్టర్ చేశాక తిరిగి వాటిలో సమపాల్లలో మినరల్స్ కలపాల్సి ఉంటుంది. వీటని సంబంధిత కంపెనీలు ఆచరించటం లేదు. అంతేకాకుండా కనీసం బాటిళ్లను కూడా శుభ్రపర్చకపోవడంతో అవి నాచు పట్టి కనిపిస్తున్నాయి. గతంలో ఈ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఎవరూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తేల్చారు. అయితే ఆ తర్వాత మాత్రం సదరు కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేవు.... పరిగి పట్టణంలో ఏర్పాటు చేసిన ఐదు మినరల్ వాటర్ ప్లాంట్లకు ఎలాంటి అనుమతులు లేవు. గ్రామ పంచాయతీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. తదుపరి పంచాయతీ నుంచి ప్లాంటును నిర్మించడానికి, నీటిని విక్రయించడానికి ఎలాంటి అనుమతులు పొందలేదు. రెండు ప్లాంట్లకు తప్పా మిగితావాటికి ఐఎస్ఐ సర్టిఫికెట్లు కూడా లేవు. ఐఎస్ఐ సర్టిఫికెట్ పొందాలంటే అన్ని రకాల పరీక్షలను ప్లాంటు ఎదుర్కొవాల్సి ఉంటు ంది. దీంతో ప్లాంట్ల నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. నామమాత్రపు అనుమతులు తీసుకున్నవారు కూడా రెన్యువల్ చేసుకోవాల్సిన విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని, స్వచ్ఛమైన నీటిని పంపిణీ చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
నాణ్యత ‘నీటి’ మూట
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: పేరుకే మినరల్ వాటర్. ఆ పేరుతో జనాన్ని పచ్చి దగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడైంది. నిత్యం శుద్ధజలం పేరుతో లక్షల లీటర్లు రవాణా చేస్తూ నిర్వాహకులు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగుతున్న ప్యూరిఫైడ్ వ్యాపారంపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.. ప్రజలకు రక్షిత నీరు అందిచండంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు చేస్తున్న నీటి వ్యాపారం దినాదినాభివృద్ధి చెందుతోంది. జిల్లాకేంద్రం నెల్లూరుతో పాటు 46 మండలాల్లో దాదాపు 400కు పైగా ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఐఎస్ఐ మార్కుతో పాటు ప్రమాణాలు పాటిస్తున్నా.. దాదాపు 300కు పైగా వాటర్ప్లాంట్లలో ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఆయా వాటర్ప్లాంట్లలో నిత్యం లక్షల లీటర్ల నీరు ఉత్పత్తి అవుతోంది. అయితే పంచాయతీల్లో మలినాలతో కూడిన నీటితో వ్యాపార నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ.20 లక్షలు అర్జిస్తున్నట్టు అంచనా. అంటే నెలకు రూ.6కోట్లకు పైగా ధనాన్ని ప్రజలు వెచ్చిస్తున్నారు. అధికారుల పరిశీలన శూన్యం వాటర్ప్లాంట్ల నుంచి తయారవుతున్న నీటి నాణ్యతపై ప్రజారోగ్య విభాగం చర్యలు శూన్యం. ఈ నీళ్లు ఎంతవరకు సురక్షితమో గతంలో అధికారులు నిర్వహించిన దాడులే వెల్లడించాయి. పలుచోట్ల పంచాయతీ వాటర్ ట్యాప్‌ల నుంచి నీటిని నింపి అమ్ముతున్నట్టు ఆరోపణలున్నాయి. మార్కెట్లో విక్రయించే ముందు నీళ్లలోని జీవ, రసాయన కణాల ఉనికిని తెలుసుకోవడానికి మైక్రోబయాలజీ, బయోకెమికల్ పరీక్షలు నిర్వహించాలి. దీనికి ప్రతి ప్లాంట్‌లో తప్పనిసరిగా సొంత ప్రయోగశాల, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించాలి. దాదాపు 90 శాతం ప్లాంట్లలో ప్రయోగశాలల్లేవు. పరీక్షించకుండానే ప్రజలకు అంటగడుతున్నారు. చాపకింద నీరులా ఈ వ్యాపారం గ్రామాలకు విస్తరించింది. ఇకనైనా ప్రజారోగ్య విభాగం మామూళ్ల మత్తును వీడి నీటి నాణ్యత పాటించని వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.