
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ పేరిట పరిశోధనాత్మక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐఎస్‌ఐ సర్టిఫికేషన్ లేకుండా నడుస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై తనిఖీలు చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు జాయింట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. శాంపిళ్లలో లోపాలున్నట్టు తేలిన ప్లాంట్ల యజమానులపై కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు.
ఐఎస్‌ఐ సర్టిఫికేషన్ లేని ప్లాంట్లకు తాము ఫుడ్ లైసెన్స్ ఇవ్వడం లేదని, అలా నడిచేవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో అనధికార డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై మంగళవారం నుంచి దాడులు నిర్వహిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ‘సాక్షి’తో చెప్పారు. అనుమతులున్న వాటర్ ప్లాంట్లు విజయవాడ నగరంలో ఏడు, జిల్లాలో ఆరు, అనుమతులు లేనివి విజయవాడలో 180, జిల్లాలో 1,020 ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ వాటర్ ప్లాంట్లకు సంబంధించి జేసీ కోర్టులో 38, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో 17 కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు.