ISI Mark
-
హెల్మెట్ రూల్స్ కఠినతరం: ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు..
న్యూఢిల్లీ: బండి నడిపే వాళ్లకు హెల్మెట్ తప్పనిసరితో పాటు వెనకాల కూర్చునే వాళ్లకు సైతం హెల్మెట్ తప్పనిసరి నిబంధనలు చాలా చోట్ల అమలు అవుతున్నాయి. అయితే హెల్మెట్ విషయంలో మోటార్ వెహికిల్స్ యాక్ట్ కొత్త సవరణను కఠినంగా అమలు చేయబోతోంది. తేడాలొస్తే.. జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మీద వేటు తప్పదని స్పష్టం చేసింది. నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు ధరించినా ఫైన్ మోత తప్పదు ఇక నుంచి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లపై తప్పక ఉండాల్సిందే. పూర్తిస్థాయిలో రక్షణ కలిగించే హెల్మెట్లు మాత్రమే.. అదీ సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అలా లేకుంటే.. మోటర్ వెహికిల్స్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 129 ఉల్లంఘనల కింద సెక్షన్-194డీ ప్రకారం.. వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్‌పై వేటు వేస్తారు. ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే టూవీలర్స్‌పై ఉపయోగించడం తప్పనిసరి చేస్తూ జూన్ 1, 2021లో ఆదేశాలు జారీ అయ్యాయి. నాన్-ఐఎస్ఐ హెల్మెట్లను బ్యాన్ చేసినా.. ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తుండడం గమనార్హం. బైక్ రైడింగ్‌లో ఉన్నప్పుడు హెల్మెట్ బకెల్, బ్యాండ్ గనుక పెట్టుకోకున్నా.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఐఎస్ఐ మార్క్, బీఎస్ఐ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ గనుక ఉపయోగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. హెల్మెట్ సక్రమంగా ధరించినా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, రెడ్ లైట్ జంపింగ్ చేయడం లాంటివాటికి కూడా 2 వేల రూపాయల జరిమానా తప్పదు. చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు -
వాటర్ ప్లాంట్లపై కొరడా
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న మినరల్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ‘మాయాజలం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాంట్లలో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం రాష్ట్రంలోని 25 వాటర్ ప్లాంట్లపై దాడులు జరిపారు. అనంతపురం జిల్లాలో 6 (సాయి సవేరా, హనీ, ఎస్వీఆర్, సాయి సిరి ఆక్వా, అమృతబిందు, ఎస్వీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్) వాటర్ ప్లాంట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1 (ఉమా ఆక్వా), విజయనగరం జిల్లాలో 2 (ఆదిత్య మినరల్ వాటర్, శ్రీవారి ఆక్వా ఇండస్ట్రీస్), చిత్తూరు జిల్లాలో 2 (శ్రీకృష్ణా మినరల్స్, కింగ్ ఆక్వా), విశాఖపట్నం జిల్లాలో 1 (లక్ష్మీ ఆక్వా ఇండస్ట్రీ), కృష్ణా జిల్లాలో 2 (ఎస్ఎస్ అల్ట్రా టెక్, కె–వాటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్)లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3 వాటర్ ప్లాంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐఎస్ఐ గుర్తింపు లేకుండా.. విజయవాడ కృష్ణలంకలోని కె–వాటర్ ప్లాంట్‌లో ఈ–కామ్ పేరిట తెలంగాణలోని కీసర చిరునామాతో రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేషన్ ఉన్న పోస్టర్లు అతికించి ఉన్నాయి. ఈ ప్లాంట్‌కు ఐఎస్ఐ గుర్తింపు ఉన్నట్టు పోస్టర్లపై ఉంది. జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆన్లైన్లో పరిశీలించడంతో అది బోగస్ అని తేలింది. చాలా ప్లాంట్లు ఐఎస్ఐ గుర్తింపు లేకుండా నడుస్తున్నట్టు గుర్తించారు. వాటర్ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. అదే నీరు.. పేరే మారు! అధికారుల లెక్కల ప్రకారం విజయవాడ నగరంతోపాటు కృష్ణా జిల్లాలో అనుమతులు లేకుండా 1,200కు పైగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రిజిస్టరైన పేరుతోనే ప్లాంట్‌లో వాటర్ బాటిళ్లకు సీళ్లు వేసి మార్కెట్లో విక్రయించాలి. నగరంలో పలు ప్లాంట్లు అందుకు భిన్నంగా వివిధ రంగులు, మూడు నాలుగు ఆకర్షణీయమైన పేర్లతో లేబుళ్లను ముద్రిస్తున్నాయి. ఆ ప్లాంటులో నీటినే బాటిళ్లలోకి నింపి వేర్వేరు బ్రాండ్లతో అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో పాటు వాటర్ బాటిళ్లపై తయారీదారు పేరు, తయారీ తేదీ, తయారీ స్థలం చిరునామా వంటివి స్పష్టంగా ముద్రించి ఉండాలి. అలాంటివేమీ లేకుండా వాటర్ బాటిళ్లను నింపి విక్రయిస్తే మిస్ బ్రాండెడ్ కింద కేసు నమోదు చేసి రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తామని జోనల్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. -
అనధికార ‘ప్లాంట్ల’పై దాడులకు సన్నద్ధం
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘మాయా జలం’ పేరిట పరిశోధనాత్మక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐఎస్ఐ సర్టిఫికేషన్ లేకుండా నడుస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై తనిఖీలు చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు జాయింట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. శాంపిళ్లలో లోపాలున్నట్టు తేలిన ప్లాంట్ల యజమానులపై కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. ఐఎస్ఐ సర్టిఫికేషన్ లేని ప్లాంట్లకు తాము ఫుడ్ లైసెన్స్ ఇవ్వడం లేదని, అలా నడిచేవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో అనధికార డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై మంగళవారం నుంచి దాడులు నిర్వహిస్తామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ‘సాక్షి’తో చెప్పారు. అనుమతులున్న వాటర్ ప్లాంట్లు విజయవాడ నగరంలో ఏడు, జిల్లాలో ఆరు, అనుమతులు లేనివి విజయవాడలో 180, జిల్లాలో 1,020 ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ వాటర్ ప్లాంట్లకు సంబంధించి జేసీ కోర్టులో 38, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో 17 కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. -
అవినీతి కంపు!
► పారిశుద్ధ్య కార్మికుల ప్రోత్సాహకాల్లో చేతివాటం ► రూ.130 కొబ్బరి నూనెకు రూ.260 బిల్లు ► రూ.16 సబ్బుకు రూ.23 దండుకున్న వైనం ► చెప్పుల పంపిణీలోనూ చిలక్కొట్టుడు ► చిత్తూరు కార్పొషన్‌లో ఇదీ సంగతి పారిశుద్ధ్య కార్మికులు.. ఎండనక వాననక, పగలనక రాత్రనక రోడ్లపై చెత్తను తీసి, కాలువల్లో మురుగును తొలగిస్తూ సేవలందించే వాళ్లు. ఎంతటి వారైనా చేతనైతే వీళ్లకు సాయం చేస్తారనుకుంటారే తప్ప, వారి వద్ద దోచుకోవాలని అనుకోరు. కానీ చిత్తూరు కార్పొరేషన్లో చెత్త తీసే కార్మికుల్నీ వదల లేదు. కార్మికులకు ఇచ్చే కొబ్బరి నూనె, చెప్పులు, సబ్బుల్లో చేతివాటం చూపించి రూ.లక్షలు మింగేస్తున్నారు. చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్లో పారిశుద్ధ్య పనులుచేసే కార్మికులకు ప్రతి నెలా 350 మి.లీ కొబ్బరినూనె, నెలకు ఓ సబ్బు, ఆర్నెళ్లకు జత పాదరక్షలు ఇవ్వాలి. కాలువల్లో దిగి పనులు చేసేటప్పుడు, చెత్తను శుభ్రం చేసేటప్పుడు నూనెను చర్మానికి రాసుకోవడం, పనులు పూర్తయిన తరువాత సబ్బుతో కడుక్కోవడానికి ఇలా ఇవ్వాలనేది నిబంధన. ఇందుకోసం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి టెండర్లు పిలిచి, ఎవరైతే నాణ్యమైన వస్తువుల్ని అందిస్తారో అలాంటి వారికి పనులు అప్పగించాలి. ఇలా జరిగింది.. 2015-16 ఆర్థిక సంవత్సరానికి చిత్తూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు (శాశ్వత ప్రాతిపదికన) ఇటీవల అధికారులు ఈ వస్తువులను అందచేశారు. ఇందులో కాంట్రాక్టర్ చెప్పిందే వేదంగా అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు విమర్శలకు, ఆరోపణలకు దారితీస్తోంది. ఏడాదికి ఒక్కో కార్మికుడికి 4.200 లీటర్ల కొబ్బరి నూనెను ఇవ్వాల్సి ఉండగా, 4.100 లీటర్లు మాత్రమే ఇచ్చారు. ఇందులో వంద గ్రాములు కొట్టేశారు. ఇక కార్మికులకు రూ.23 వెచ్చించి ఒక్కొక్కరికీ 12 సర్ఫ్ఎక్సెల్ సబ్బు ఇచ్చినట్లు చూపించారు. కానీ ఇచ్చింది మాత్రం రూ.16 విలువ చేసే రిన్ సబ్బు. ఒక్కో సబ్బుపై రూ.7 కమీషన్ దక్కింది. అది కూడా 11 సబ్బులే ఇచ్చారు. రెండు జతల చెప్పులకు రూ.900 పైగా బిల్లులు చేసుకున్న వ్యక్తులు కార్మికులకు రూ.400 విలువ కూడా చేయని చెప్పుల్ని అంటగట్టారు. వీటిని ఏ మాత్రం తనిఖీ చేయకుండా, పరిశీలించని అధికారులు దాదాపు రూ.7 లక్షల వరకు బిల్లులు చెల్లించేశారు. ఇందులో కార్పొరేషన్లో గతంలో పనిచేసిన ఓ అధికారికి, ప్రస్తుతం పనిచేస్తున్న మరో ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందాయని తెలిసింది. తాజాగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 176 మంది పారిశుద్ధ్య కార్మికులకు సైతం ఇదే తరహా వస్తువులు పంపిణీ చేసి మరోమారు దోపిడీ చేయడానికి రంగం సిద్ధమవుతుండటం కొసమెరుపు. ‘చిత్తూరు కార్పొరేషన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఇటీవల పంపిణీ చేసిన కొబ్బరి నూనె డబ్బా ఇది. దీనిపై ఎక్కడా ఐఎస్ఐ మార్కు లేదు. బ్యాచ్ నంబరు లేదు. 15 కిలోల కొబ్బరి నూనె రూ.2 వేలని ముద్రించి ఉంది. అంటే కిలో రూ.133 అన్నమాట. పెద్ద మొత్తంలో కొంటే దీన్ని రూ.వందకు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ ఈ నూనెకు కార్పొరేషన్లో అధికారులు ఇచ్చిన బిల్లు లీటరుకు రూ.240.’ విచారిస్తా ఈ వ్యవహారం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయిస్తా. ఎక్కడైనా అవినీతి జరినట్లు నిర్ధారణయితే డబ్బును రికవరీ చేయడంతో పాటు, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడతా. ప్రస్తుతం సెలవులో ఉన్నా. రెండు రోజుల్లో వచ్చేస్తా.. దీనిపై విచారణకు ఆదేశిస్తా. - జేఆర్.సురేష్, కమిషనర్, చిత్తూరు కార్పొరేషన్ -
జిల్లాలో నీళ్ల దందా జోరుగా
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో నీళ్ల దందా జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో వాటర్ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎండాకాలం కావడం, ‘మంచి’ నీరు దొరికే పరిస్థితి లేకపోవడంతో వాటర్ క్యాన్, బాటిళ్లు, ప్యాకెట్లకు గిరాకీ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని వాటర్‌ప్లాంట్ యజమానులు అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్లను నిర్మిస్తున్నారు. సాధారణంగా వాటర్‌ప్లాంటు నిర్మించాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఐఎస్), ఐఎస్ఐ మార్క్ అనుమతి పొందాలి. ఈ అనమతులు పొందాలంటే రూ.లక్షలతో కూడుకున్న పని. ఇవేమిలేకుండానే సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్లాంట్లను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా లో వందకుపైగా వాటర్ప్లాంట్లు ఉన్నాయి. అనుమతి లేనివి అధికంగా ఉండగా, అనుమతి ఉన్నవి మాత్రం ఖానాపూర్‌లో ఒకటి, మంచిర్యాలలో ఒకటి మాత్రమే. అన్ని వాటర్ ప్లాంట్ల ద్వారా జిల్లాలో రోజు 3.50 లక్షల లీటర్లకు పైనే మినరల్ వాటర్ వ్యాపారం జరుగుతుండగా.. రూ. 1.50 కోటిపైగా దం దా సాగుతుంది. ప్లాంట్లు ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రమాణాలకు తిలోదకాలు వాటర్‌ప్లాంట్ నెలకొల్పాలంటే బీఐఎస్ నుంచి సర్టిఫికెట్ పొందాలి. సర్టిఫికెట్ ఇచ్చే ముందు వాటర్‌ప్లాంట్ నెలకొల్పే ప్రాంతంలో పక్కా భవనం, కనీసం ఐదారు గదులు, లేబోరేటరీ, వాటర్ ప్యూరిఫికేషన్ పరికరాలు ఉం డాలి. అధికారులు భూమిలోని నీటిని పరి శీలిస్తారు. ఆ నీటి రంగు, వాసన, మడ్డి, ఉదజని సూచిక, ఇనుము, క్లోరైడ్, నీటిలో కరిగే లవణాలు, సల్ఫైడ్, నైట్రేట్, ఫ్లోరైడ్, కాలుష్యం వంటి అంశాలు పరిశీలిస్తారు. దీని ప్రకా రం ప్యారామిటర్ నిర్ధారించి ప్లాంట్ నెలకొల్పేందుకు ఐఎస్ఐ సర్టిఫికెట్ ఇస్తారు. దీని ఆధారంగా జిల్లా కేంద్రంలోని ఆహార నియంత్రణ సంస్థ ఆ ప్లాంట్‌కు లెసైన్స్ జారీ చేస్తుం ది. ఈ నిబంధనల ప్రకారం ఒక వాటర్ ప్లాం ట్ నెలకొల్పాలంటే రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. ఏటా సర్టిఫికెట్ రెన్యూవల్‌కు రూ.లక్ష వరకు చెల్లించాలి. దీనికితోడు ఆహార నియంత్రణ శాఖాధికారులకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. మూడు మాసాలకోసారి బీఐఎస్ అధికారులు ప్లాంట్‌ను పరిశీలించి నివేదికను ఇస్తారు. రోజు ప్లాంట్ ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించడంతో పాటు 15 రోజులకోసారి బీఐఎస్ గుర్తింపు పొందిన ల్యాబ్‌కు నీటి శాంపిల్స్ పంపి నివేదికలు బీఐఎస్‌కు సమర్పించాలి. అదేవిధంగా శుద్ధమైన వాతావరణంలో ఎయిర్టైట్లో నీటిని క్యాన్లు, బాటి ళ్లు, ప్యాకెట్లలో నింపాలి. వీటిపై బ్యాచ్ నంబ ర్, ప్యాక్ చేసిన తేదీ, గడువు తేదీ, కంపెనీ వివరాలు ముద్రించాలి. ఈ ప్రక్రియ కొనసాగితే బీఐఎస్ గుర్తింపు ఇస్తుంది. నిబంధనలు హుష్‌కాకి ప్రతి ప్లాంట్‌లోనూ ఎంఎస్సీ, బీఎస్సీ పట్టభద్రులు నీటిని పరీక్షించేందుకు నియమించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలో ఏ ప్లాంట్‌లోనూ వారి ఆచూకీ కనబడదు. దీంతో నీటిశుద్ధి అనేది నామమాత్రంగా జరుగుతుందనేది వాస్తవం. అన్ని ప్లాంట్లలో అపరిశుభ్రమైన వాతావరణంలో నీటిని ప్యాక్ చేస్తున్నారు. ఎయిర్టైట్లో నీటిని నింపాల్సి ఉండగా అదేమీ పట్టించుకోకుండా నింపుతుండడంతో నీటిలో క్రిములు చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇవి తాగిన ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారు. అధికారులకు మామూలే.. బీఐఎస్ అనుమతి పొందిన ప్లాంట్లను ఆహార నియంత్రణ సంస్థ అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ నీటి శుద్ధత విషయంలో నిఘా ఉంచాలి. అదేవిధంగా నాన్ బీఐఎస్ ప్లాం ట్లపై కూడా వారి నిఘా కొనసాగాలి. అయితే ఈ శాఖాధికారులు మామూళ్ల మత్తులో మునిగి ప్లాంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలు పాటించని ప్లాంట్లపై పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేయాలి. అలా జరగడం లేదు. బీఐఎస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైతే ఐఎస్ఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్రభుత్వ పథకాల ద్వారా అందజేసే ప్రోత్సాహకాలు, విద్యుత్ పంపిణీ నిలిపివేయాలి. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల కలెక్టర్ అహ్మద్‌బాబు జిల్లాలోని నాన్ బీఐఎస్ ప్లాంట్లను గుర్తించి సీజ్ చేయాలని రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆహార నియంత్రణ శాఖాధికారులను ఆదేశించారు. ఎన్నికల బిజీలో ఉం డడంతో అధికారులు ఇప్పటివరకు వాటిపై దృష్టి సారించలేదు. ఇప్పటికైనా వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలకు నాణ్యమైన నీటిని అందించాలని పలువురు కోరుతున్నారు.