జిల్లాలో నీళ్ల దందా జోరుగా | Water the plant have no permission of the Bureau of Indian Standard, ISI Mark | Sakshi
Sakshi News home page

జిల్లాలో నీళ్ల దందా జోరుగా

Published Tue, May 6 2014 1:15 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Water the plant  have no permission of the Bureau of Indian Standard, ISI Mark

 ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో నీళ్ల దందా జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్‌లలో వాటర్‌ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎండాకాలం కావడం, ‘మంచి’ నీరు దొరికే పరిస్థితి లేకపోవడంతో వాటర్ క్యాన్, బాటిళ్లు, ప్యాకెట్లకు గిరాకీ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని వాటర్‌ప్లాంట్ యజమానులు అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్లను నిర్మిస్తున్నారు. సాధారణంగా వాటర్‌ప్లాంటు  నిర్మించాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఐఎస్), ఐఎస్‌ఐ మార్క్ అనుమతి పొందాలి. ఈ అనమతులు పొందాలంటే రూ.లక్షలతో కూడుకున్న పని.

ఇవేమిలేకుండానే సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్లాంట్లను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా లో వందకుపైగా వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. అనుమతి లేనివి అధికంగా ఉండగా, అనుమతి ఉన్నవి మాత్రం ఖానాపూర్‌లో ఒకటి, మంచిర్యాలలో ఒకటి మాత్రమే. అన్ని వాటర్ ప్లాంట్ల ద్వారా జిల్లాలో రోజు 3.50 లక్షల లీటర్లకు పైనే మినరల్ వాటర్ వ్యాపారం జరుగుతుండగా.. రూ. 1.50 కోటిపైగా దం దా సాగుతుంది. ప్లాంట్లు ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

 ప్రమాణాలకు తిలోదకాలు
 వాటర్‌ప్లాంట్ నెలకొల్పాలంటే బీఐఎస్ నుంచి సర్టిఫికెట్ పొందాలి. సర్టిఫికెట్ ఇచ్చే ముందు వాటర్‌ప్లాంట్ నెలకొల్పే ప్రాంతంలో పక్కా భవనం, కనీసం ఐదారు గదులు, లేబోరేటరీ, వాటర్ ప్యూరిఫికేషన్ పరికరాలు ఉం డాలి. అధికారులు భూమిలోని నీటిని పరి శీలిస్తారు. ఆ నీటి రంగు, వాసన, మడ్డి, ఉదజని సూచిక, ఇనుము, క్లోరైడ్, నీటిలో కరిగే లవణాలు, సల్ఫైడ్, నైట్రేట్, ఫ్లోరైడ్, కాలుష్యం వంటి అంశాలు పరిశీలిస్తారు. దీని ప్రకా రం ప్యారామిటర్ నిర్ధారించి ప్లాంట్ నెలకొల్పేందుకు ఐఎస్‌ఐ సర్టిఫికెట్ ఇస్తారు. దీని ఆధారంగా జిల్లా కేంద్రంలోని ఆహార నియంత్రణ సంస్థ ఆ ప్లాంట్‌కు లెసైన్స్ జారీ చేస్తుం ది.

ఈ నిబంధనల ప్రకారం ఒక వాటర్ ప్లాం ట్ నెలకొల్పాలంటే రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. ఏటా సర్టిఫికెట్ రెన్యూవల్‌కు రూ.లక్ష వరకు చెల్లించాలి. దీనికితోడు ఆహార నియంత్రణ శాఖాధికారులకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. మూడు మాసాలకోసారి బీఐఎస్ అధికారులు ప్లాంట్‌ను పరిశీలించి నివేదికను ఇస్తారు. రోజు ప్లాంట్ ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించడంతో పాటు 15 రోజులకోసారి బీఐఎస్ గుర్తింపు పొందిన ల్యాబ్‌కు నీటి శాంపిల్స్ పంపి నివేదికలు బీఐఎస్‌కు సమర్పించాలి. అదేవిధంగా శుద్ధమైన వాతావరణంలో ఎయిర్‌టైట్‌లో నీటిని క్యాన్‌లు, బాటి ళ్లు, ప్యాకెట్లలో నింపాలి. వీటిపై బ్యాచ్ నంబ ర్, ప్యాక్ చేసిన తేదీ, గడువు తేదీ, కంపెనీ వివరాలు ముద్రించాలి. ఈ ప్రక్రియ కొనసాగితే బీఐఎస్ గుర్తింపు ఇస్తుంది.

 నిబంధనలు హుష్‌కాకి
 ప్రతి ప్లాంట్‌లోనూ ఎంఎస్సీ, బీఎస్సీ పట్టభద్రులు నీటిని పరీక్షించేందుకు నియమించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలో ఏ ప్లాంట్‌లోనూ వారి ఆచూకీ కనబడదు. దీంతో నీటిశుద్ధి అనేది నామమాత్రంగా జరుగుతుందనేది వాస్తవం. అన్ని ప్లాంట్లలో అపరిశుభ్రమైన వాతావరణంలో నీటిని ప్యాక్ చేస్తున్నారు. ఎయిర్‌టైట్‌లో నీటిని నింపాల్సి ఉండగా అదేమీ పట్టించుకోకుండా నింపుతుండడంతో నీటిలో క్రిములు చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇవి తాగిన ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారు.

 అధికారులకు మామూలే..
 బీఐఎస్ అనుమతి పొందిన ప్లాంట్లను ఆహార నియంత్రణ సంస్థ అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ నీటి శుద్ధత విషయంలో నిఘా ఉంచాలి. అదేవిధంగా నాన్ బీఐఎస్ ప్లాం ట్లపై కూడా వారి నిఘా కొనసాగాలి. అయితే ఈ శాఖాధికారులు మామూళ్ల మత్తులో మునిగి ప్లాంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలు పాటించని ప్లాంట్లపై పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేయాలి.

అలా జరగడం లేదు. బీఐఎస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైతే ఐఎస్‌ఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్రభుత్వ పథకాల ద్వారా అందజేసే ప్రోత్సాహకాలు, విద్యుత్ పంపిణీ నిలిపివేయాలి. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల కలెక్టర్ అహ్మద్‌బాబు జిల్లాలోని నాన్ బీఐఎస్ ప్లాంట్లను గుర్తించి సీజ్ చేయాలని రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆహార నియంత్రణ శాఖాధికారులను ఆదేశించారు. ఎన్నికల బిజీలో ఉం డడంతో అధికారులు ఇప్పటివరకు వాటిపై దృష్టి సారించలేదు. ఇప్పటికైనా వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలకు నాణ్యమైన నీటిని అందించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement