అవినీతి కంపు!
► పారిశుద్ధ్య కార్మికుల ప్రోత్సాహకాల్లో చేతివాటం
► రూ.130 కొబ్బరి నూనెకు రూ.260 బిల్లు
► రూ.16 సబ్బుకు రూ.23 దండుకున్న వైనం
► చెప్పుల పంపిణీలోనూ చిలక్కొట్టుడు
► చిత్తూరు కార్పొషన్‌లో ఇదీ సంగతి
పారిశుద్ధ్య కార్మికులు.. ఎండనక వాననక, పగలనక రాత్రనక రోడ్లపై చెత్తను తీసి, కాలువల్లో మురుగును తొలగిస్తూ సేవలందించే వాళ్లు. ఎంతటి వారైనా చేతనైతే వీళ్లకు సాయం చేస్తారనుకుంటారే తప్ప, వారి వద్ద దోచుకోవాలని అనుకోరు. కానీ చిత్తూరు కార్పొరేషన్‌లో చెత్త తీసే కార్మికుల్నీ వదల లేదు. కార్మికులకు ఇచ్చే కొబ్బరి నూనె, చెప్పులు, సబ్బుల్లో చేతివాటం చూపించి రూ.లక్షలు మింగేస్తున్నారు.
చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య పనులుచేసే కార్మికులకు ప్రతి నెలా 350 మి.లీ కొబ్బరినూనె, నెలకు ఓ సబ్బు, ఆర్నెళ్లకు జత పాదరక్షలు ఇవ్వాలి. కాలువల్లో దిగి పనులు చేసేటప్పుడు, చెత్తను శుభ్రం చేసేటప్పుడు నూనెను చర్మానికి రాసుకోవడం, పనులు పూర్తయిన తరువాత సబ్బుతో కడుక్కోవడానికి ఇలా ఇవ్వాలనేది నిబంధన. ఇందుకోసం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి టెండర్లు పిలిచి, ఎవరైతే నాణ్యమైన వస్తువుల్ని అందిస్తారో అలాంటి వారికి పనులు అప్పగించాలి.
ఇలా జరిగింది..
2015-16 ఆర్థిక సంవత్సరానికి చిత్తూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు (శాశ్వత ప్రాతిపదికన) ఇటీవల అధికారులు ఈ వస్తువులను అందచేశారు. ఇందులో కాంట్రాక్టర్ చెప్పిందే వేదంగా అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు విమర్శలకు, ఆరోపణలకు దారితీస్తోంది. ఏడాదికి ఒక్కో కార్మికుడికి 4.200 లీటర్ల కొబ్బరి నూనెను ఇవ్వాల్సి ఉండగా, 4.100 లీటర్లు మాత్రమే ఇచ్చారు. ఇందులో వంద గ్రాములు కొట్టేశారు. ఇక కార్మికులకు రూ.23 వెచ్చించి ఒక్కొక్కరికీ 12 సర్ఫ్‌ఎక్సెల్ సబ్బు ఇచ్చినట్లు చూపించారు. కానీ ఇచ్చింది మాత్రం రూ.16 విలువ చేసే రిన్ సబ్బు.
ఒక్కో సబ్బుపై రూ.7 కమీషన్ దక్కింది. అది కూడా 11 సబ్బులే ఇచ్చారు. రెండు జతల చెప్పులకు రూ.900 పైగా బిల్లులు చేసుకున్న వ్యక్తులు కార్మికులకు రూ.400 విలువ కూడా చేయని చెప్పుల్ని అంటగట్టారు. వీటిని ఏ మాత్రం తనిఖీ చేయకుండా, పరిశీలించని అధికారులు దాదాపు రూ.7 లక్షల వరకు బిల్లులు చెల్లించేశారు. ఇందులో కార్పొరేషన్‌లో గతంలో పనిచేసిన ఓ అధికారికి, ప్రస్తుతం పనిచేస్తున్న మరో ఉన్నతాధికారికి భారీగా ముడుపులు అందాయని తెలిసింది. తాజాగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 176 మంది పారిశుద్ధ్య కార్మికులకు సైతం ఇదే తరహా వస్తువులు పంపిణీ చేసి మరోమారు దోపిడీ చేయడానికి రంగం సిద్ధమవుతుండటం కొసమెరుపు.
‘చిత్తూరు కార్పొరేషన్‌లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఇటీవల పంపిణీ చేసిన కొబ్బరి నూనె డబ్బా ఇది. దీనిపై ఎక్కడా ఐఎస్‌ఐ మార్కు లేదు. బ్యాచ్ నంబరు లేదు. 15 కిలోల కొబ్బరి నూనె రూ.2 వేలని ముద్రించి ఉంది. అంటే కిలో రూ.133 అన్నమాట. పెద్ద మొత్తంలో కొంటే దీన్ని రూ.వందకు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ ఈ నూనెకు కార్పొరేషన్‌లో అధికారులు ఇచ్చిన బిల్లు లీటరుకు రూ.240.’
విచారిస్తా
ఈ వ్యవహారం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయిస్తా. ఎక్కడైనా అవినీతి జరినట్లు నిర్ధారణయితే డబ్బును రికవరీ చేయడంతో పాటు, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెడతా. ప్రస్తుతం సెలవులో ఉన్నా. రెండు రోజుల్లో వచ్చేస్తా.. దీనిపై విచారణకు ఆదేశిస్తా.
- జేఆర్.సురేష్, కమిషనర్, చిత్తూరు కార్పొరేషన్