ఓ పాఠశాలలో తరగతి గదిని శుభ్రం చేస్తున్న విద్యార్థిని
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో సర్కారు బడుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కనీస అవసరాలకు నిధులు విదిల్చని సర్కారు తీరు, విద్యాశాఖాధికారుల ప్రేక్షక పాత్ర నిరుపేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు విద్యార్ధులతో పారిశుద్ధ్య పనులు చేయించడం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా కంటే ముందు సర్కారు బడుల్లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నా.. ఆ తర్వాత సరైన నిర్వహణ లేకుండా పోయింది. ఒక వైపు ఉపాధ్యాయుల కొరతతో బోధన అంతంత మాత్రం కాగా, మరోవైపు వసతుల లేమి, పారిశుధ్య పనులు కూడా సమస్యగా తయారయ్యాయి.
పాఠశాల నిర్వహణకు నిధులేవీ..?
గత రెండేళ్లుగా పాఠాశాల నిర్వహణకు నిధుల కొరత వెంటాడుతోంది. గతంలో స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిధులు కేటాయించేది. 1 నుంచి 15 మంది విద్యార్థులు గల పాఠశాలకు ఏడాదికి రూ.12,500, 16 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25,000, అదేవిధంగా 101 నుంచి 250 మంది ఉంటే రూ.50,000, 251 నుంచి 1000 మంది ఉంటే రూ,75,000, వెయ్యికి పైగా విద్యార్థులు గల పాఠశాలలకు రూ. లక్ష కేటాయించేవారు. ఆయా స్కూళ్లకు ఇచి్చన నిధులను రిజిస్టర్లు, చాక్‌పీస్‌లు, విద్యుత్ బిల్లులు, కంప్యూటర్ల మరమ్మతుల ఖర్చుతోపాటు, స్కావెంజర్ల వేతనాలు చెల్లింపునకు వినియోగించేవారు. మొత్తం మీద విడుదలైన నిధులను హెచ్‌ఎంలు సర్దుబాటు చేస్తూ పనులను పూర్తి చేసేవారు.
స్కావెంజర్లు లేక..
సర్కారు బడుల్లో తరగతి గదులు, మరుగుదొడ్లను శుభ్రం చేసే ఒక్కో స్కావెంజర్‌కు రూ.2,500 నుంచి రూ.3000 చెల్లించేవారు. కరోనాతో 2020 మార్చిలో పాఠశాలలు మూతపడినప్పటి నుంచి స్కూల్ మెయింటనెన్స్ నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో స్కావెంజర్ల సమస్య ఏర్పడింది. రెండేళ్లుగా స్కూల్ మెయింటెనెన్స్ నిధులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కొన్ని స్కూళ్లలో టీచర్లు సొంతంగా డబ్బులు సమకూర్చుకుని స్కావెంజర్లను నియమించుకున్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్ధులతో తరగతి గదులు, టాయిలెట్లను శుభ్రం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సర్కారు బడులు ఇలా
►మహానగర పరిధిలో సుమారు 2497 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 3.67 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే..
►హైదరాబాద్ జిల్లాలో 691 పాఠశాలల్లో 1,12, 686 మంది విద్యనభ్యసిస్తున్నారు.
►రంగారెడ్డిలో 1301 స్కూళ్లలో 165,856 మంది విద్యార్థులు చదువు తున్నారు.
►మేడ్చల్‌లోని 505 బడుల్లో 90,358 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు.
సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్లు, స్కావెంజర్లు లేకపోవడంతో విద్యార్థినులతో తరగతి గదులు, టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచి్చంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సదరు ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. తరగతి గదులు శుభ్రం చేస్తే తప్పేంటని, ఇష్టం లేకుంటే స్కూల్ నుంచి టీసీ తీసుకెళ్లండని ఆయన దురుసుగా సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. నగరంలో సుమారు 40 శాతం పైగా స్కూళ్లల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment