Water Plants In Hyderabad: రోగాలకు పుట్టి‘నీళ్లు’ | Sakshi Research Report On Filter Water Plants In Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 8 వేలకుపైనే వాటర్‌ ప్లాంట్లు

Published Mon, Jul 12 2021 1:30 PM | Last Updated on Mon, Jul 12 2021 2:06 PM

Sakshi Research Report On Filter Water Plants In Hyderabad

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఫిల్టర్‌ వాటర్‌ ప్లాంట్‌. ఐడీఎల్‌ చెరువు కట్ట వద్ద ఉన్న ఈ ప్లాంట్‌ చుట్టూ చెత్తాచెదారం, దుమ్ము ధూళి.. నీటి ట్యాంకుల పక్కనే పారుతున్న మురుగునీరు.. కనీస పరిశుభ్రత కూడా లేని ఇక్కడి నీళ్లు తాగితే.. ఏ రోగాలు వస్తాయో తెలియని దుస్థితి. నిజానికి మనం కలుషితాలు ఉండవని, ఆరోగ్యం కోసమని వాటర్‌ ప్లాంట్లలో నీళ్లను కొనుక్కుని మరీ తాగుతున్నాం. కానీ ఇలాంటి చోట్ల నుంచి డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.

మంచి నీళ్లంటే..?
మనం తాగడానికి పనికొచ్చే నీళ్లు.. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే నీళ్లు.. 
అందులోనూ శుద్ధి చేసిన నీళ్లంటే..?
మనకు మరింతగా ‘మంచి’ చేయాల్సిన నీళ్లు.. అనారోగ్యానికి దూరంగా ఉంచాల్సిన నీళ్లు.. 
మరి హైదరాబాద్‌లోని వాటర్‌ ప్లాంట్లలో శుద్ధి చేసిన మంచి నీళ్లు అయితే.. 
ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టే నీళ్లు..! కొత్త కొత్త రోగాలను తెచ్చిపెట్టే నీళ్లు!?

మరీ కఠినంగా ఉన్నా చాలా వరకు ఇదే నిజం. ప్లాంట్లలో, చుట్టూ అపరిశుభ్ర పరిస్థితులు.. సరిగా శుభ్రం చేయని ట్యాంకులు, పైపులు.. నామ్‌కేవాస్తేగా పైపైన కడిగి నీళ్లు నింపే బబుల్స్‌.. కొన్నిచోట్ల మరీ మురుగునీరు పారుతున్నా ఆ పక్కనే కొనసాగుతున్న వాటర్‌ ప్లాంట్లు.. ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్‌లకు నిలయాలు. అన్నీ కాకున్నా చాలా వాటర్‌ ప్లాంట్లతో పరిస్థితి ఇదే.. నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టించుకోనితనం కలిసి జనం ఆరోగ్యానికి ముప్పు తెచి్చపెడుతున్న దుస్థితీ ఇదే. అసలే వానాకాలం మొదలైంది. విషజ్వరాలు, డయేరియా వంటివి విజృంభించే ఇలాంటి సమయంలో.. వాటర్‌ ప్లాంట్ల అపరిశుభ్రతపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది.  ఇందులో వెల్లడైన అంశాలతో ప్రత్యేక  కథనం.. 
– ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్‌


ఇదీ వాటర్‌ ప్లాంటే..
ఇది హైదరాబాద్‌లోని నాగోల్‌ జైపురి కాలనీలో అపరిశుభ్ర పరిస్థితుల మధ్య కొనసాగుతున్న ఒక నీటి శుద్ధి ప్లాంట్‌. శిథిలమయ్యే దశలో ఉన్న రేకుల షెడ్, దాని ఆవరణ, నీటి ట్యాంకు, పైపులు.. ఎక్కడా పరిశుభ్రత మచ్చుకైనా లేదు. అపరిశుభ్రతతో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌తో నీళ్లు కలుíÙతమై.. జనం రోగాల బారినపడే ప్రమాదం ఉంది. 


గల్లీకొకటిగా పుట్టగొడుగుల్లా
గ్రేటర్‌ హైదరాబాద్‌లో అనుమతి లేని వేలాది వాటర్‌ ఫిల్టర్‌ ప్లాంట్లు జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. అపరిశుభ్ర పరిసరాలు.. ప్రమా ణాల ప్రకారం శుద్ధి చేయని నీళ్లతో జనం రోగాల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. మహా నగరంలో గల్లీకొకటిగా పుట్టగొడుగుల్లా వెలిసిన నీటి శుద్ధి కేంద్రాలు 8 వేలకు పైగానే ఉండగా.. అందులో భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) గుర్తింపు పొందిన ఫిల్టర్‌ ప్లాంట్లు 1,500 లోపే ఉన్నట్టు అధికార వర్గాలే చెప్తున్నాయి.  ప్రతీ నెలా గ్రేటర్‌ పరిధిలో సుమారు రూ.150 కోట్ల ఫిల్టర్‌ నీళ్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా.

వాటర్‌ ప్లాంట్ల పరిస్థితిపై సాక్షి ప్రతినిధులు కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, మల్లాపూర్, మల్కాజ్‌గిరి, సరూర్‌నగర్, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. వాటర్‌ ప్లాంట్లు కొనసాగుతున్న తీరును గుర్తించారు. బీఐఎస్‌ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాల్లో చాలా వరకు ఫిల్టర్‌ ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదని నిర్ధారించారు. ఇంత జరుగుతున్నా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) సంస్థ మొద్దునిద్ర వీడని పరిస్థితి ఉందని తేల్చారు. 

కూకట్‌పల్లిలోని ఓ వాటర్‌ ప్లాంట్లో పరిస్థితి ఇదీ..

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా.. 
ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలోనే చాలా ప్లాంట్లు కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 500కుపైగా వాటర్‌ ప్లాంట్లు ఉన్నట్టు అంచనా. చాలా చోట్ల నీటి బబుల్స్‌ (క్యాన్ల)ను పైపైనే శుభ్రం చేస్తున్నారు. ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కొందరు కిరాణా, ఇతర షాపుల యజమానులు 2000, 5000 లీటర్ల ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. వాటర్‌ ప్లాంట్ల నుంచి టోకుగా నీళ్లు తెప్పించి, వాటిలో నింపుకొని అమ్ముతున్నారు. వారు కూడా సరిగా ట్యాంకులను, పైపులను శుభ్రం చేయకపోవడంతో బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి పెరుగుతున్నాయి. 

కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలోనూ చాలా వాటర్‌ ప్లాంట్లు అపరిశుభ్ర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇరుకు గదులు, పాత షెడ్లలో కొనసాగుతున్నాయి. చెరువులు, నాలాలకు సమీపంలో బోర్లు వేసి.. ఆ నీటితో ప్లాంట్లు నడిపిస్తున్నారు. కూకట్‌పల్లి ఐడియల్‌ చెరువు కట్ట క్రింద మూడు వాటర్‌ ప్లాంట్లు నడుస్తున్నాయి. వాటిలో నీటి సంపులు, గుంతలు మురికి నీటితో నిండి ఉండగా.. పక్కనే వాటర్‌ నింపుతున్నారు. ట్యాంకుల చుట్టూ వ్యర్థాలు, దుమ్ము, ధూళి నిండి ఉంటున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గచి్చబౌలి, మియాపూర్, చందానగర్, మక్తా మహబూబ్‌పేట్, ఎనీ్టఆర్‌ కాలనీ, ఎంఐజీ కాలనీ, హఫీజ్‌పేట వంటి ప్రాంతాల్లో విస్తృతంగా వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. ట్యాంకులు, నీటిని సరఫరా చేసే క్యాన్లు మురికిపట్టి కనిపిస్తున్నాయి. వాటితో అలాగే నీళ్లను సరఫరా చేస్తున్నారు. 


అపరిశుభ్రంగా ఉన్న వాటర్‌ ప్లాంట్‌

బాధ్యత వహించేవారేరీ? 
వాటర్‌ ప్లాంట్లలో పరిశుభ్రత ఉండేలా, వాటి యజమానులు తప్పుడు విధానాలకు పాల్పడకుండా ఉండేలా కట్టడి చేసే విషయంలో ప్రభుత్వ శాఖలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆహార కల్తీ, పరిశుభ్రత అంశం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఉంటుంది. కానీ వాటర్‌ ప్లాంట్లను తనిఖీ చేసే అధికారాలను ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)’కు అప్పజెప్పామంటూ జీహెచ్‌ఎంసీ చేతులు దులుపుకొంటోంది. దీనిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్, అదనపు కమిషనర్‌ (హెల్త్‌) సంతోష్‌లను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. 

ఇది ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌ జడ్జెస్‌ కాలనీలోని వాటర్‌ ప్లాంట్‌. ఆరు బయటే నీటి ట్యాంకులు, వాటి పక్కనే చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు నిల్వ నీటితో చిత్తడిగా ఉండటంతో నీళ్లు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. ఆ నీటిని తాగితే జనం రోగాల పాలుగాక తప్పదన్న ఆందోళన కనిపిస్తోంది. 

సరిగా శుభ్రం చేయని బబుల్స్‌లో నీళ్లను నింపుతున్న నిర్వాహకులు

ఇష్టారాజ్యంగా వాటర్‌ ప్లాంట్లు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి జనాభా పెరిగినకొద్దీ మంచి నీటి కోసం భారీగా డిమాండ్‌ వస్తోంది. ముఖ్యంగా పది, ఇరవై రూపాయలకే 20 లీటర్లు ఇస్తుండటంతో ఫిల్టర్‌ వాటర్‌ను కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ వేలాదిగా వాటర్‌ ప్లాంట్లు వెలిశాయి. 

బీఐఎస్‌ నిబంధనల ప్రకారం.. వాటర్‌ ప్లాంట్లలో నీటి టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉండాలి. శుద్ధి చేసిన నీటి గాఢత (పీహెచ్‌), కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్‌), ఆవశ్యక మూలకాలు, ఇతర అంశాలను పరీక్షించి నమోదు చేసేందుకు బయో కెమిస్ట్‌ సదరు ప్లాంట్‌లో పనిచేయాలి. కానీ వాటర్‌ ప్లాంట్లలో ఎక్కడా ల్యాబ్‌లు, బయోకెమిస్టులు ఉన్న దాఖాలాలే లేవు. పరిసరాలు పరిశుభ్రత లేకపోవడం, ట్యాంకులు, పైపులు, ఇతర సామగ్రిని సరిగా శుభ్రం చేయకపోవడంతో ఈ.కొలి, కొలిఫాం వంటి హానికారక బ్యాక్టీరియా, ఫంగస్‌లు వృద్ధి చెందుతున్నాయి.

శుద్ధి చేసిన నీటిని కొంత సమయం తర్వాతే తాగేందుకు వినియోగించాలి. కానీ వెంటవెంటనే పంపించేస్తున్నారు. వాటర్‌ బబుల్స్‌ను వినియోగించిన ప్రతిసారీ క్లోరిన్‌తో శుద్ధి చేయాలి. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి నశిస్తాయి. కానీ చాలా చోట్ల క్లోరిన్‌ వాడటం లేదు. నామమాత్రంగా కడిగి మళ్లీ నీళ్లు నింపేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిలో నిర్ణీత శాతం ఖనిజాలు ఉండేలా చూడాలి. కానీ ఇష్టమొచి్చనట్టుగా శుద్ధి చేస్తుండటంతో నీటిలోని ఖనిజాలు పూర్తిగా బయటికి పోతున్నాయి. ఇది జనంలో ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కారణమవుతోంది.  కొన్ని వాటర్‌ ప్లాంట్లు నీళ్లు రుచిగా ఉన్నట్టు అనిపించడం కోసం రసాయనాలు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటివల్ల ఆరోగ్యానికి హానికలిగే ప్రమాదం ఉంది. 

తనిఖీలకు ఆదేశాలిచ్చాం 
‘‘ఈ సీజన్‌లో వాటర్‌ ప్లాంట్లను తనిఖీ చేయాల్సిందిగా మా పరిధిలో పనిచేస్తున్న జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’’ 
– డాక్టర్‌ శంకర్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ 

నీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటుకు కావాల్సినవి ఇవీ.. 
► భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) నుంచి గుర్తింపు ధ్రువీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి. 
►  ప్రతి ప్లాంటులో అధునాతన టెస్టింగ్‌ ల్యాబ్, బయో కెమిస్ట్‌ ఉండాలి. 
► నీటి శుద్ధికి సంబంధించి 60 ప్రమాణాలను పాటించాలి. ట్యాంకులు, బబుల్స్‌ వంటివాటిని క్లోరిన్‌తో శుభ్రం చేయాలి. 
► తాగునీటిలో ఆవశ్యక మూలకాలను పూర్తిగా తొలగించకూడదు. రుచి కోసం ఎలాంటి రసాయనాలను కలపకూడదు. 
► ప్రతి లీటరు నీటిలో టీడీఎస్‌ మోతాదు కనీసం 100 నుంచి 150 మిల్లీగ్రాములు ఉండాలి. 


ఉండాల్సినవి లేవు.. ఉండకూడనివి ఉంటున్నాయి 
► ప్రతి లీటర్‌ నీటిలో కనీసంగా.. కాల్షియం 75 మిల్లీగ్రాములు (ఎంజీ), మెగ్నీíÙయం 30, ఐరన్‌ 0.3 మిల్లీగ్రాములు ఉండాలి. కానీ ఇవేవీ ఉండటం లేదు. దీనివల్ల శరీరానికి ఆవశ్యక పోషకాలు సరిగా అందని పరిస్థితి తలెత్తి.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 

► ప్రతి లీటర్‌ నీటిలో ఫ్లోరైడ్‌ ఒక మిల్లీ గ్రాము మించకూడదు. చాలాచోట్ల 1.5 మిల్లీగ్రాములకుపైన ఉన్నట్టు తేలింది. దీనితోపాటు అసలు ఉండకూడని కాల్షియం కార్బొనేట్, బైకార్బొనేట్లు ఉంటున్నాయి. ఇవి అనారోగ్యానికి కారణమవుతాయి. 

హానికర బ్యాక్టీరియాతో ప్రమాదం 
అపరిశుభ్ర వాతావరణంలో, నాలాలకు ఆనుకొని ఏర్పాటు చేసిన ఫిల్టర్‌ ప్లాంట్ల నీటిలో ఈ.కొలి, కొలిఫాం వంటి హానికర బ్యాక్టీరియాలు, పాథోజెన్స్‌ చేరే ప్రమాదముంది. వానాకాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. కలుషిత నీటిని తాగితే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. టైఫాయిడ్‌ వంటివి రావొచ్చు. ఫిల్టర్‌ ప్లాంట్ల నీళ్లు అయినా, నల్లా నీళ్లు అయినా బాగా కాచి చల్లార్చి, వడబోసిన తరువాత మాత్రమే తాగాలి. 
– డాక్టర్‌ బీరప్ప, నిమ్స్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ 


ఆ నీళ్లతో నష్టమే ఎక్కువ 
సరైన ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించకపోతే ఫిల్టర్‌ వాటర్‌తో ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. అపరిశుభ్రత కారణంగా రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఇక నీటి శుద్ధి ప్రమాణాల మేరకు లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాగునీటి ద్వారా  కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఆవశ్యక పోషకాలు శరీరంలోకి చేరుతాయి. ఆహారం ద్వారా కంటే నీటి ద్వారా వచ్చే వీటిని శరీరం త్వరగా, బాగా సంగ్రహిస్తుంది. నీటి శుద్ధి ప్రక్రియలో ఆవశ్యక మూలకాలను తొలగిస్తున్న ప్లాంట్ల నిర్వాహకులు.. తర్వాత ఫోర్టిఫైడ్‌ టెక్నాలజీ ద్వారా అవసరమైన మినరల్స్‌ను నీళ్లలో కలపాలి. కానీ ఎవరూ కలపడం లేదు. 
– డాక్టర్‌ రమేశ్‌కుమార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement