RO Water Plant
-
ఆర్ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్ 500 ఎం.జీ దాటితే!
మనకు, ప్రకృతి అందించిన సహజ సంపద నీరు. భూమి మీద నీరు లేనిదే మానవులకు, పశు పక్ష్యాదులకు, ఇతర జీవరాశులకు మనుగడే లేదు. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీటితో మమేకమై ఉంటాం. మానవ అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు తలసరిన 55 లీటర్లు (55 లీటర్స్ పర్ కాపిటా పర్ డే), పట్టణ ప్రాంతాల ప్రజలకు రోజుకు తలసరిన 135 లీటర్లు సరిపోతాయని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు భావిస్తున్నాయి. కానీ, ప్రతి సంవత్సరం లక్షల మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే డయేరియా, టైఫాయిడ్ మొదలైన వ్యాధులకు గురవుతున్నారు. దీని వల్ల ఎన్నో లక్షల పనిదినాలు వృథా అవుతున్నాయి. యూనిసెఫ్ ఇండియా ప్రకారం.. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 60 కోట్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ‘సురక్షితమైన నీరు’ అంటే రసాయనాలు, బ్యాక్టీరియా రహితమైన నీరు. రసాయన రహిత నీరు అంటే.. ఫ్లోరైడ్, ఆర్సెనిక్, లవణీయత వంటి నీటిలో కరిగే లవణాలు (టోటల్ డిసాల్వ్డ్ సాల్ట్స్– టి.డి.ఎస్.) అనుమతించదగిన పరిమితిలో కలిగి ఉన్న నీరు. బ్యాక్టీరియా రహిత నీరు అంటే.. ఈ–కొలి, సాల్మొనెల్లా టైఫి మొదలైన సూక్ష్మక్రిములు లేని నీరు. సురక్షితమైన నీటి గురించి కరపత్రాలు, కళా జాతాలు, లఘు చిత్రాల ప్రదర్శన, పోస్టర్లతో కూడిన అవగాహన కార్యక్రమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. తద్వారా ప్రజల్లో సురక్షితమైన నీరు తాగడం గురించిన అవగాహన పెరిగింది. అంతేకాకుండా, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంఘాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) మొదలైనవన్నీ సురక్షితమైన నీటిని ప్రజలకు అందించడంలో భాగంగా ఆర్.ఓ. (రివర్స్ ఆస్మోసిస్) ప్లాంట్స్‌ను విరివిగా నెలకొల్పాయి. ఇటువంటి ప్లాంట్లలో చాలా చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నీటి నాణ్యతను పరీక్షించాయి. తద్వారా ప్రజలు నీటిని కొనే స్థాయికి చేరుకుంటున్నారు. దీని పర్యవసానంగా ‘వాటర్ మార్కెట్లు’ వచ్చాయి. టిడిఎస్ 500 ఎం.జి. కన్నా ఎక్కువైతేనే.. ఈ మధ్య కాలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా నిర్మించే ఇళ్లల్లో డొమెస్టిక్ ఆర్. ఓ. ప్లాంట్లు కూడా పెడుతున్నారు. రివర్స్ ఆస్మోసిస్ అనేది మంచినీటిని అందించే సాంకేతిక ప్రక్రియ. లీటరు నీటిలో 500 మిల్లీ గ్రాముల పరిమితికి మించిన స్థాయిలో టి.డి.ఎస్. ఉన్న నీటిని మాత్రమే శుద్ధి చేసి, ఆ పరిమితికి మించి ఆ నీటిలో ఉన్న ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఐరన్, లవణీయతలను తొలగించాల్సి ఉంటుంది. ఆర్.ఓ. ఫిల్టరేషన్ సిస్టం ఇలా పనిచేస్తుంది.. కంటికి కనిపించని మలినాలను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన పొర (మెంబ్రేన్ / ఫిల్టర్) ద్వారా పీడనం కలిగిస్తూ నీటిని శుద్ధి చేస్తుంది. అయితే ఈ పద్ధతిలో బాక్టీరియా, రసాయనాలతోపాటు మానవ శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం బై కార్బొనేట్ మొదలైన ఖనిజాలు కూడా పోతాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని తాగు నీటి వ్యాపార కంపెనీలు తిరిగి ఈ ఖనిజాలను ఆర్.ఓ. నీటిలో కలిపి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో చాలా మటుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆర్.ఓ. వాటర్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. ఈ నీటిని ప్రజలు కొని తాగుతున్నారు. 20 లీటర్ల క్యాన్‌ను రూ. 5 నుంచి 10 దాకా అమ్ముతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ముడి నీటిలో టి.డి.ఎస్. లీటరు నీటికి 500 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే ఈ ఆర్.ఓ. ప్లాంట్స్ పెట్టవలసి ఉంది. కానీ విచక్షణ రహితంగా వీటిని పెట్టడం వలన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ నేషనల్ ట్రిబ్యునల్ – నీటిలో టి.డి.ఎస్. స్థాయి లీటరు నీటికి 500 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రమే నీటి శుద్ధీకరణ ఆర్. ఓ. ప్లాంట్స్ నెలకొల్పడానికి అనుమతివ్వాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సి.పి.సి.బి.)ని కోరింది. వ్యర్థ జలాల పునర్వినియోగం ఎలా? ఆర్.ఓ. ద్వారా శుద్ధమైన నీటిని తయారు చేసే క్రమంలో కొంత నీరు వృథా అవుతుంది. ఎంత శాతం నీరు వృథా అవుతుందన్నది అక్కడి ముడి నీటిలో టి.డి.ఎస్. ఎంత ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నీటి రికవరీ 60% కన్నా ఎక్కువ ఉండేలా చూడాలని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంటే.. వంద లీటర్ల సాధారణ నీటిని ఆర్.ఓ. యంత్రం ద్వారా శుద్ధి చేస్తే.. కనీసం 60 లీటర్లు మంచినీరు రావాలి. వ్యర్థ జలాలు 40 శాతానికి మించకుండా వెలువడేలా శుద్ధి యంత్రాల సామర్థ్యం ఉండేలా చూడమని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆర్.ఓ. శుద్ధి యంత్రాల ద్వారా వచ్చిన వృథా (రిజెక్టెడ్ వాటర్) నీటిని పాత్రలను, ఇంట్లో గచ్చును, వాహనాలను శుభ్రం చేయడానికి.. టాయిలెట్లలో ఫ్లషింగ్ కోసం, పచ్చదనాన్నిచ్చే మొక్కల పెంపకానికి ఉపయోగించాలని జి.ఎన్.టి. ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఆర్.ఓ. సిస్టమ్స్ వెలువరించే తాగు నీటిలో టి.డి.ఎస్. లీటరుకు 150 ఎం.జి.కి తగ్గకుండా ఉండేలా చూడాలి. లేదా పరిమిత స్థాయిలో కాల్షియం, మెగ్నీషియం ఆ నీటిలో ఉండేలా చూడాలని కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. 7 రాష్ట్రాల్లో అధ్యయనం.. ఆసక్తికర అంశాలు ► జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి–పి.ఆర్.) 2016వ సంవత్సరంలో వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్.ఓ. నీటి శుద్ధి ప్లాంట్ల తీరుతెన్నులపై విస్తృతమైన అధ్యయనం చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ► అధ్యయనం జరిపిన రాష్ట్రాలు.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ► ఈ ఏడు రాష్ట్రాలలో ఆర్.ఓ. సిస్టమ్స్ ఉన్న 21 గ్రామ పంచాయితీలను ఎన్నుకున్నారు. ∙ఈ గ్రామ పంచాయతీలలో ఆర్.ఓ. సిస్టమ్స్ పెట్టే ముందుగానే నీటిని పరీక్షించారు. అందులో 13 గ్రామ పంచాయతీలలో లీటరు నీటికి టి.డి.ఎస్. 500 ఎం.జి. కంటే ఎక్కువగా ఉంది. పంచాయితీ సర్పంచుల చొరవతో అక్కడ ఆర్.ఓ. సిస్టమ్స్ నెలకొల్పారు. ► మిగిలిన 8 గ్రామ పంచాయతీలలో టి.డి.ఎస్. 500 మి. గ్రా. కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సర్పంచులే అత్యుత్సాహం చూపి ఆర్.ఓ. ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయించారు. ► ఈ 21 గ్రామ పంచాయితీలలో ఆర్.ఓ. సిస్టమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రైవేటు సంస్థలు ఆర్.ఓ. యూనిట్లను ఏర్పాటు చేశాయి. వీటి నిర్వహణను గ్రామ పంచాయతీలు లాభాపేక్ష లేకుండా చూస్తున్నాయి. ► అధ్యయనం జరిగిన 21 గ్రామ పంచాయతీలలో ఎనీటైమ్ వాటర్ (ఎ.టి.డబ్లు్య.) కార్డులను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధంగా పోగైన డబ్బును ఆర్.ఓ. సిస్టమ్స్ నిర్వహణకు వినియోగిస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో ప్రజల్లో ఆర్.ఓ. నీటి గురించి లోతైన అవగాహన కలిగించాల్సిన తక్షణ అవసరం ఉంది. -డా. పి. శివరాం, జాతీయ గ్రామీణ, పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్. polankis@gmail.com -
Water Plants In Hyderabad: రోగాలకు పుట్టి‘నీళ్లు’
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఫిల్టర్ వాటర్ ప్లాంట్. ఐడీఎల్ చెరువు కట్ట వద్ద ఉన్న ఈ ప్లాంట్ చుట్టూ చెత్తాచెదారం, దుమ్ము ధూళి.. నీటి ట్యాంకుల పక్కనే పారుతున్న మురుగునీరు.. కనీస పరిశుభ్రత కూడా లేని ఇక్కడి నీళ్లు తాగితే.. ఏ రోగాలు వస్తాయో తెలియని దుస్థితి. నిజానికి మనం కలుషితాలు ఉండవని, ఆరోగ్యం కోసమని వాటర్ ప్లాంట్లలో నీళ్లను కొనుక్కుని మరీ తాగుతున్నాం. కానీ ఇలాంటి చోట్ల నుంచి డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మంచి నీళ్లంటే..? మనం తాగడానికి పనికొచ్చే నీళ్లు.. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే నీళ్లు.. అందులోనూ శుద్ధి చేసిన నీళ్లంటే..? మనకు మరింతగా ‘మంచి’ చేయాల్సిన నీళ్లు.. అనారోగ్యానికి దూరంగా ఉంచాల్సిన నీళ్లు.. మరి హైదరాబాద్‌లోని వాటర్ ప్లాంట్లలో శుద్ధి చేసిన మంచి నీళ్లు అయితే.. ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టే నీళ్లు..! కొత్త కొత్త రోగాలను తెచ్చిపెట్టే నీళ్లు!? మరీ కఠినంగా ఉన్నా చాలా వరకు ఇదే నిజం. ప్లాంట్లలో, చుట్టూ అపరిశుభ్ర పరిస్థితులు.. సరిగా శుభ్రం చేయని ట్యాంకులు, పైపులు.. నామ్కేవాస్తేగా పైపైన కడిగి నీళ్లు నింపే బబుల్స్.. కొన్నిచోట్ల మరీ మురుగునీరు పారుతున్నా ఆ పక్కనే కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లు.. ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్లకు నిలయాలు. అన్నీ కాకున్నా చాలా వాటర్ ప్లాంట్లతో పరిస్థితి ఇదే.. నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పట్టించుకోనితనం కలిసి జనం ఆరోగ్యానికి ముప్పు తెచి్చపెడుతున్న దుస్థితీ ఇదే. అసలే వానాకాలం మొదలైంది. విషజ్వరాలు, డయేరియా వంటివి విజృంభించే ఇలాంటి సమయంలో.. వాటర్ ప్లాంట్ల అపరిశుభ్రతపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలతో ప్రత్యేక కథనం.. – ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్ ఇదీ వాటర్ ప్లాంటే.. ఇది హైదరాబాద్‌లోని నాగోల్ జైపురి కాలనీలో అపరిశుభ్ర పరిస్థితుల మధ్య కొనసాగుతున్న ఒక నీటి శుద్ధి ప్లాంట్. శిథిలమయ్యే దశలో ఉన్న రేకుల షెడ్, దాని ఆవరణ, నీటి ట్యాంకు, పైపులు.. ఎక్కడా పరిశుభ్రత మచ్చుకైనా లేదు. అపరిశుభ్రతతో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్‌తో నీళ్లు కలుíÙతమై.. జనం రోగాల బారినపడే ప్రమాదం ఉంది. గల్లీకొకటిగా పుట్టగొడుగుల్లా గ్రేటర్ హైదరాబాద్‌లో అనుమతి లేని వేలాది వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. అపరిశుభ్ర పరిసరాలు.. ప్రమా ణాల ప్రకారం శుద్ధి చేయని నీళ్లతో జనం రోగాల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. మహా నగరంలో గల్లీకొకటిగా పుట్టగొడుగుల్లా వెలిసిన నీటి శుద్ధి కేంద్రాలు 8 వేలకు పైగానే ఉండగా.. అందులో భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గుర్తింపు పొందిన ఫిల్టర్ ప్లాంట్లు 1,500 లోపే ఉన్నట్టు అధికార వర్గాలే చెప్తున్నాయి. ప్రతీ నెలా గ్రేటర్ పరిధిలో సుమారు రూ.150 కోట్ల ఫిల్టర్ నీళ్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. వాటర్ ప్లాంట్ల పరిస్థితిపై సాక్షి ప్రతినిధులు కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, మల్లాపూర్, మల్కాజ్గిరి, సరూర్‌నగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. వాటర్ ప్లాంట్లు కొనసాగుతున్న తీరును గుర్తించారు. బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాల్లో చాలా వరకు ఫిల్టర్ ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదని నిర్ధారించారు. ఇంత జరుగుతున్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) సంస్థ మొద్దునిద్ర వీడని పరిస్థితి ఉందని తేల్చారు. కూకట్‌పల్లిలోని ఓ వాటర్ ప్లాంట్‌లో పరిస్థితి ఇదీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలోనే చాలా ప్లాంట్లు కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 500కుపైగా వాటర్ ప్లాంట్లు ఉన్నట్టు అంచనా. చాలా చోట్ల నీటి బబుల్స్ (క్యాన్ల)ను పైపైనే శుభ్రం చేస్తున్నారు. ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కొందరు కిరాణా, ఇతర షాపుల యజమానులు 2000, 5000 లీటర్ల ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ ప్లాంట్ల నుంచి టోకుగా నీళ్లు తెప్పించి, వాటిలో నింపుకొని అమ్ముతున్నారు. వారు కూడా సరిగా ట్యాంకులను, పైపులను శుభ్రం చేయకపోవడంతో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరుగుతున్నాయి. కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలోనూ చాలా వాటర్ ప్లాంట్లు అపరిశుభ్ర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇరుకు గదులు, పాత షెడ్లలో కొనసాగుతున్నాయి. చెరువులు, నాలాలకు సమీపంలో బోర్లు వేసి.. ఆ నీటితో ప్లాంట్లు నడిపిస్తున్నారు. కూకట్పల్లి ఐడియల్ చెరువు కట్ట క్రింద మూడు వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. వాటిలో నీటి సంపులు, గుంతలు మురికి నీటితో నిండి ఉండగా.. పక్కనే వాటర్ నింపుతున్నారు. ట్యాంకుల చుట్టూ వ్యర్థాలు, దుమ్ము, ధూళి నిండి ఉంటున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గచి్చబౌలి, మియాపూర్, చందానగర్, మక్తా మహబూబ్పేట్, ఎనీ్టఆర్ కాలనీ, ఎంఐజీ కాలనీ, హఫీజ్‌పేట వంటి ప్రాంతాల్లో విస్తృతంగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ట్యాంకులు, నీటిని సరఫరా చేసే క్యాన్లు మురికిపట్టి కనిపిస్తున్నాయి. వాటితో అలాగే నీళ్లను సరఫరా చేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్న వాటర్ ప్లాంట్ బాధ్యత వహించేవారేరీ? వాటర్ ప్లాంట్లలో పరిశుభ్రత ఉండేలా, వాటి యజమానులు తప్పుడు విధానాలకు పాల్పడకుండా ఉండేలా కట్టడి చేసే విషయంలో ప్రభుత్వ శాఖలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆహార కల్తీ, పరిశుభ్రత అంశం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఉంటుంది. కానీ వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసే అధికారాలను ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)’కు అప్పజెప్పామంటూ జీహెచ్ఎంసీ చేతులు దులుపుకొంటోంది. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అదనపు కమిషనర్ (హెల్త్) సంతోష్‌లను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఇది ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ జడ్జెస్ కాలనీలోని వాటర్ ప్లాంట్. ఆరు బయటే నీటి ట్యాంకులు, వాటి పక్కనే చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు నిల్వ నీటితో చిత్తడిగా ఉండటంతో నీళ్లు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. ఆ నీటిని తాగితే జనం రోగాల పాలుగాక తప్పదన్న ఆందోళన కనిపిస్తోంది. సరిగా శుభ్రం చేయని బబుల్స్‌లో నీళ్లను నింపుతున్న నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వాటర్ ప్లాంట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధి జనాభా పెరిగినకొద్దీ మంచి నీటి కోసం భారీగా డిమాండ్ వస్తోంది. ముఖ్యంగా పది, ఇరవై రూపాయలకే 20 లీటర్లు ఇస్తుండటంతో ఫిల్టర్ వాటర్‌ను కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ వేలాదిగా వాటర్ ప్లాంట్లు వెలిశాయి. బీఐఎస్ నిబంధనల ప్రకారం.. వాటర్ ప్లాంట్లలో నీటి టెస్టింగ్ ల్యాబ్ ఉండాలి. శుద్ధి చేసిన నీటి గాఢత (పీహెచ్), కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్), ఆవశ్యక మూలకాలు, ఇతర అంశాలను పరీక్షించి నమోదు చేసేందుకు బయో కెమిస్ట్ సదరు ప్లాంట్‌లో పనిచేయాలి. కానీ వాటర్ ప్లాంట్లలో ఎక్కడా ల్యాబ్‌లు, బయోకెమిస్టులు ఉన్న దాఖాలాలే లేవు. పరిసరాలు పరిశుభ్రత లేకపోవడం, ట్యాంకులు, పైపులు, ఇతర సామగ్రిని సరిగా శుభ్రం చేయకపోవడంతో ఈ.కొలి, కొలిఫాం వంటి హానికారక బ్యాక్టీరియా, ఫంగస్‌లు వృద్ధి చెందుతున్నాయి. శుద్ధి చేసిన నీటిని కొంత సమయం తర్వాతే తాగేందుకు వినియోగించాలి. కానీ వెంటవెంటనే పంపించేస్తున్నారు. వాటర్ బబుల్స్‌ను వినియోగించిన ప్రతిసారీ క్లోరిన్‌తో శుద్ధి చేయాలి. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి నశిస్తాయి. కానీ చాలా చోట్ల క్లోరిన్ వాడటం లేదు. నామమాత్రంగా కడిగి మళ్లీ నీళ్లు నింపేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిలో నిర్ణీత శాతం ఖనిజాలు ఉండేలా చూడాలి. కానీ ఇష్టమొచి్చనట్టుగా శుద్ధి చేస్తుండటంతో నీటిలోని ఖనిజాలు పూర్తిగా బయటికి పోతున్నాయి. ఇది జనంలో ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కారణమవుతోంది. కొన్ని వాటర్ ప్లాంట్లు నీళ్లు రుచిగా ఉన్నట్టు అనిపించడం కోసం రసాయనాలు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటివల్ల ఆరోగ్యానికి హానికలిగే ప్రమాదం ఉంది. తనిఖీలకు ఆదేశాలిచ్చాం ‘‘ఈ సీజన్లో వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాల్సిందిగా మా పరిధిలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’’ – డాక్టర్ శంకర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సినవి ఇవీ.. ► భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నుంచి గుర్తింపు ధ్రువీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి. ► ప్రతి ప్లాంటులో అధునాతన టెస్టింగ్ ల్యాబ్, బయో కెమిస్ట్ ఉండాలి. ► నీటి శుద్ధికి సంబంధించి 60 ప్రమాణాలను పాటించాలి. ట్యాంకులు, బబుల్స్ వంటివాటిని క్లోరిన్‌తో శుభ్రం చేయాలి. ► తాగునీటిలో ఆవశ్యక మూలకాలను పూర్తిగా తొలగించకూడదు. రుచి కోసం ఎలాంటి రసాయనాలను కలపకూడదు. ► ప్రతి లీటరు నీటిలో టీడీఎస్ మోతాదు కనీసం 100 నుంచి 150 మిల్లీగ్రాములు ఉండాలి. ఉండాల్సినవి లేవు.. ఉండకూడనివి ఉంటున్నాయి ► ప్రతి లీటర్ నీటిలో కనీసంగా.. కాల్షియం 75 మిల్లీగ్రాములు (ఎంజీ), మెగ్నీíÙయం 30, ఐరన్ 0.3 మిల్లీగ్రాములు ఉండాలి. కానీ ఇవేవీ ఉండటం లేదు. దీనివల్ల శరీరానికి ఆవశ్యక పోషకాలు సరిగా అందని పరిస్థితి తలెత్తి.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ► ప్రతి లీటర్ నీటిలో ఫ్లోరైడ్ ఒక మిల్లీ గ్రాము మించకూడదు. చాలాచోట్ల 1.5 మిల్లీగ్రాములకుపైన ఉన్నట్టు తేలింది. దీనితోపాటు అసలు ఉండకూడని కాల్షియం కార్బొనేట్, బైకార్బొనేట్లు ఉంటున్నాయి. ఇవి అనారోగ్యానికి కారణమవుతాయి. హానికర బ్యాక్టీరియాతో ప్రమాదం అపరిశుభ్ర వాతావరణంలో, నాలాలకు ఆనుకొని ఏర్పాటు చేసిన ఫిల్టర్ ప్లాంట్ల నీటిలో ఈ.కొలి, కొలిఫాం వంటి హానికర బ్యాక్టీరియాలు, పాథోజెన్స్ చేరే ప్రమాదముంది. వానాకాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. కలుషిత నీటిని తాగితే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. టైఫాయిడ్ వంటివి రావొచ్చు. ఫిల్టర్ ప్లాంట్ల నీళ్లు అయినా, నల్లా నీళ్లు అయినా బాగా కాచి చల్లార్చి, వడబోసిన తరువాత మాత్రమే తాగాలి. – డాక్టర్ బీరప్ప, నిమ్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆ నీళ్లతో నష్టమే ఎక్కువ సరైన ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించకపోతే ఫిల్టర్ వాటర్‌తో ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. అపరిశుభ్రత కారణంగా రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఇక నీటి శుద్ధి ప్రమాణాల మేరకు లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాగునీటి ద్వారా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఆవశ్యక పోషకాలు శరీరంలోకి చేరుతాయి. ఆహారం ద్వారా కంటే నీటి ద్వారా వచ్చే వీటిని శరీరం త్వరగా, బాగా సంగ్రహిస్తుంది. నీటి శుద్ధి ప్రక్రియలో ఆవశ్యక మూలకాలను తొలగిస్తున్న ప్లాంట్ల నిర్వాహకులు.. తర్వాత ఫోర్టిఫైడ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మినరల్స్‌ను నీళ్లలో కలపాలి. కానీ ఎవరూ కలపడం లేదు. – డాక్టర్ రమేశ్‌కుమార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి -
మినరల్‌తో ముప్పే
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం) : వేసవి ఎండలు నీటి వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు మండుతుంటే మరో వైపు గత ప్రభుత్వ హయాంలో రక్షిత మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు తాగునీరు అందించలేకపోయింది. ఇదే అదునుగా చూసుకున్న వ్యాపారులు మినరల్ పేరుతో జనరల్ నీటిని తూతూ మంత్రంగా శుద్దిచేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులైతే వారి బోర్లు ఒట్టిపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి మరీ మినరల్ వాటర్‌ను విక్రయిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా అందించే నీరే దిక్కైంది. నిత్యావసర పనులకు ఆ నీళ్లు ఉపయోగపడుతుండగా తాగేందుకు నీళ్లు దొరకడం లేదు. కొందరు పంట పొలాల్లోని వ్యవసాయ బోర్లవద్ద నుంచి నీళ్ళు తెచ్చుకుంటుండగా ఎక్కువ భాగం ప్రజలు మినరల్ వాటర్‌ను కొనుగోలు చేసి తాగుతున్నారు. ప్రజల అవసరాలు డిమాండ్ నేపథ్యంలో మినరల్‌వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటర్ ప్లాంట్ల నిర్వహణకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అది ఎక్కడా అమలు కావడం లేదు. ప్లాంట్ ఏర్పాటుకు నిబంధనలు వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధిత పంచాయతీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి భారతీయ ప్రమాణాలు (ఐఎస్ఐ) అనుమతి పొందాలి. ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమికల్ ల్యాబ్, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి ప్రతి 3 నెలలకొకసారి నీటి నాణ్యత ప్రమాణాలు నిర్థారించేందుకు పరీక్షలు చేయాలి. నీటి శుభ్రత ఇలా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో లభించే నీటిలో టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ (టీడీఎస్) 1500 నుంచి దాదాపు 200 దాకా ఉంటుంది. నీటిలో అత్యధికంగా 1000 టీడీఎస్ దాటితే అవి తాగేందుకు పనికి రావు. ఆ నీటిని తాగితే కిడ్నీ సమస్యలు, ఇతర అవయవాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్వో ప్లాంట్లలో విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేసి రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో శుభ్రపరుస్తూ జనాలకు విక్రయిస్తున్నారు. ఒక లీటర్ నీటిలో ఉండే 1500 టీడీఎస్ శుద్ధి చేసేందుకు అంతకు మించి రెండు లీటర్ల నీరు వృథాగా పోతుంది. శుద్ధి చేసిన నీటిలో తొలగించిన టీడీఎస్ వృథాగా పోయే నీటిలో కలుస్తుంది. ఆ నీటిని భూగర్భంలోకి పంపడం, మురుగు కాలువల్లోకి వదలడం ఎట్టి పరిస్థితుల్లోను చేయకూడదు. వ్యర్థనీటిని డ్రైబెడ్స్‌లో కేక్‌గా మార్చి పారబోయాలి. అయితే ఆర్వో ప్లాంట్లలో ప్రమాదకర నీటిని మురుగు కాలువల్లో వదిలేస్తుంటే మరికొందరు ప్లాంట్ల నిర్వాహకులు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆ నీటిని కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు నీళ్ళు : మండలంలో సుమారు 25 కు పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉండగా నియోజకవర్గంలో సుమారు 200 కు పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. మండలంలో ఒకటి రెండు ప్లాంట్లకు మినహా మిగిలిన వాటిలో ఏ ఒక్కదానికి ఐఎస్ఐ మార్కు కానీ అధికారుల అనుమతులు కానీ ఉన్నట్లు కనబడటం లేదు. గుర్తింపు లేని ప్లాంట్ల యజమానులకు నీటి స్వచ్ఛతను, నాణ్యతను పాటించకుండా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో క్యాన్ల విక్రయం మరింత పెరిగిపోయింది. పలుమార్లు ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడటం లేదు. నాణ్యత లేని క్యాన్లలో వేసి మామూలు నీళ్ల క్యాను రూ.15, కూలింగ్ నీళ్లు క్యాను రూ. 30 కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ఐఎస్ఐ గుర్తింపు ఉంటేనే నీటి వ్యాపారం చేయాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకునే అధికారులే కరువయ్యారు. అధికారులకు సైతం భారీగా మామూళ్లు అందుతుండటంతో మినరల్ ప్లాంట్ల పై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు నాణ్యమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దాహం తీర్చని ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి గత టీడీపీ ప్రభుత్వం పేదలకు 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలన్న లక్ష్యం ప్రారంభించిన శుద్ద జలకేంద్రాలు పేదల దాహార్తి తీర్చకుండానే మూతపడ్డాయి. స్థానిక కందులాపురం పంచాయతీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ శుద్దజల కేంద్రం ప్రారంభించిన కొద్దిరోజులకే మూత పడిపోయింది. దీంతో పేదలు కూడా గత్యంతరం లేక రూ. 15 పెట్టి ప్రైవేటు వ్యక్తుల వద్ద నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. -
ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో రూ.12 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. అలాగే అగ్రహారం రైల్వే ఓవర్‌బ్రిడ్జి, అండర్‌పాస్‌ల ఏర్పాటుకు మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. అధికారులతో కలిసి ఆ స్థలాన్ని సందర్శించారు. తక్షణమే కచ్చితమైన ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.