ఆర్‌ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్‌ 500 ఎం.జీ దాటితే! | Reverse Osmosis Water Know What Measures To Take Install Water Plant | Sakshi
Sakshi News home page

ఆర్‌ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. వాటర్‌ ప్లాంట్లు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ వద్దు?

Published Wed, Jan 26 2022 2:29 PM | Last Updated on Wed, Jan 26 2022 2:49 PM

Reverse Osmosis Water Know What Measures To Take Install Water Plant - Sakshi

మనకు, ప్రకృతి అందించిన సహజ సంపద నీరు. భూమి మీద నీరు లేనిదే మానవులకు, పశు పక్ష్యాదులకు, ఇతర జీవరాశులకు మనుగడే లేదు. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీటితో మమేకమై ఉంటాం. మానవ అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు తలసరిన 55 లీటర్లు (55 లీటర్స్‌ పర్‌ కాపిటా పర్‌ డే), పట్టణ ప్రాంతాల ప్రజలకు రోజుకు తలసరిన 135 లీటర్లు సరిపోతాయని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు భావిస్తున్నాయి.

కానీ, ప్రతి సంవత్సరం లక్షల మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే డయేరియా, టైఫాయిడ్‌ మొదలైన వ్యాధులకు గురవుతున్నారు. దీని వల్ల ఎన్నో లక్షల పనిదినాలు వృథా అవుతున్నాయి. యూనిసెఫ్‌ ఇండియా ప్రకారం.. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 60 కోట్ల అమెరికన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ‘సురక్షితమైన నీరు’ అంటే రసాయనాలు, బ్యాక్టీరియా రహితమైన నీరు. రసాయన రహిత నీరు అంటే.. ఫ్లోరైడ్, ఆర్సెనిక్, లవణీయత వంటి నీటిలో కరిగే లవణాలు (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాల్ట్స్‌– టి.డి.ఎస్‌.) అనుమతించదగిన పరిమితిలో కలిగి ఉన్న నీరు.

బ్యాక్టీరియా రహిత నీరు అంటే.. ఈ–కొలి, సాల్మొనెల్లా టైఫి మొదలైన సూక్ష్మక్రిములు లేని నీరు. సురక్షితమైన నీటి గురించి కరపత్రాలు, కళా జాతాలు, లఘు చిత్రాల ప్రదర్శన, పోస్టర్లతో కూడిన అవగాహన కార్యక్రమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. తద్వారా ప్రజల్లో సురక్షితమైన నీరు తాగడం గురించిన అవగాహన పెరిగింది. 

అంతేకాకుండా, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంఘాలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సి.ఎస్‌.ఆర్‌.) మొదలైనవన్నీ సురక్షితమైన నీటిని ప్రజలకు అందించడంలో భాగంగా ఆర్‌.ఓ. (రివర్స్‌ ఆస్మోసిస్‌) ప్లాంట్స్‌ను విరివిగా నెలకొల్పాయి. ఇటువంటి ప్లాంట్లలో చాలా చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నీటి నాణ్యతను పరీక్షించాయి. తద్వారా ప్రజలు నీటిని కొనే స్థాయికి చేరుకుంటున్నారు. దీని పర్యవసానంగా ‘వాటర్‌ మార్కెట్లు’ వచ్చాయి. 

టిడిఎస్‌ 500 ఎం.జి. కన్నా ఎక్కువైతేనే..
ఈ మధ్య కాలంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా నిర్మించే ఇళ్లల్లో డొమెస్టిక్‌ ఆర్‌. ఓ. ప్లాంట్లు కూడా పెడుతున్నారు. రివర్స్‌ ఆస్మోసిస్‌ అనేది మంచినీటిని అందించే సాంకేతిక ప్రక్రియ. లీటరు నీటిలో 500 మిల్లీ గ్రాముల పరిమితికి మించిన స్థాయిలో టి.డి.ఎస్‌. ఉన్న నీటిని మాత్రమే శుద్ధి చేసి, ఆ పరిమితికి మించి ఆ నీటిలో ఉన్న ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఐరన్, లవణీయతలను తొలగించాల్సి ఉంటుంది.

ఆర్‌.ఓ. ఫిల్టరేషన్‌ సిస్టం ఇలా పనిచేస్తుంది.. కంటికి కనిపించని మలినాలను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన పొర (మెంబ్రేన్‌ / ఫిల్టర్‌) ద్వారా పీడనం కలిగిస్తూ నీటిని శుద్ధి చేస్తుంది. అయితే ఈ పద్ధతిలో బాక్టీరియా, రసాయనాలతోపాటు మానవ శరీరానికి అవసరమైన  కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం బై కార్బొనేట్‌ మొదలైన ఖనిజాలు కూడా పోతాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని తాగు నీటి వ్యాపార కంపెనీలు తిరిగి ఈ ఖనిజాలను ఆర్‌.ఓ. నీటిలో కలిపి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో చాలా మటుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆర్‌.ఓ. వాటర్‌ సిస్టమ్స్‌ పనిచేస్తున్నాయి. ఈ నీటిని ప్రజలు కొని తాగుతున్నారు. 20 లీటర్ల క్యాన్‌ను రూ. 5 నుంచి 10 దాకా అమ్ముతున్నారు. 

గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు
ముడి నీటిలో టి.డి.ఎస్‌. లీటరు నీటికి 500 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే ఈ ఆర్‌.ఓ. ప్లాంట్స్‌ పెట్టవలసి ఉంది. కానీ విచక్షణ రహితంగా వీటిని పెట్టడం వలన ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్‌ నేషనల్‌ ట్రిబ్యునల్‌ – నీటిలో టి.డి.ఎస్‌. స్థాయి లీటరు నీటికి 500 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రమే నీటి శుద్ధీకరణ ఆర్‌. ఓ. ప్లాంట్స్‌ నెలకొల్పడానికి అనుమతివ్వాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సి.పి.సి.బి.)ని కోరింది. 

వ్యర్థ జలాల పునర్వినియోగం ఎలా?
ఆర్‌.ఓ. ద్వారా శుద్ధమైన నీటిని తయారు చేసే క్రమంలో కొంత నీరు వృథా అవుతుంది. ఎంత శాతం నీరు వృథా అవుతుందన్నది అక్కడి ముడి నీటిలో టి.డి.ఎస్‌. ఎంత ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నీటి రికవరీ 60% కన్నా ఎక్కువ ఉండేలా చూడాలని కూడా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. అంటే.. వంద లీటర్ల సాధారణ నీటిని ఆర్‌.ఓ. యంత్రం ద్వారా శుద్ధి చేస్తే.. కనీసం 60 లీటర్లు మంచినీరు రావాలి. వ్యర్థ జలాలు 40 శాతానికి మించకుండా వెలువడేలా శుద్ధి యంత్రాల సామర్థ్యం ఉండేలా చూడమని ట్రిబ్యునల్‌ ఆదేశించింది.

ఆర్‌.ఓ. శుద్ధి యంత్రాల ద్వారా వచ్చిన వృథా (రిజెక్టెడ్‌ వాటర్‌) నీటిని పాత్రలను, ఇంట్లో గచ్చును, వాహనాలను శుభ్రం చేయడానికి.. టాయిలెట్లలో ఫ్లషింగ్‌ కోసం, పచ్చదనాన్నిచ్చే మొక్కల పెంపకానికి ఉపయోగించాలని జి.ఎన్‌.టి. ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఆర్‌.ఓ. సిస్టమ్స్‌ వెలువరించే తాగు నీటిలో టి.డి.ఎస్‌. లీటరుకు 150 ఎం.జి.కి తగ్గకుండా ఉండేలా చూడాలి. లేదా  పరిమిత స్థాయిలో కాల్షియం, మెగ్నీషియం ఆ నీటిలో ఉండేలా చూడాలని కూడా ట్రిబ్యునల్‌ ఆదేశించింది. 

7 రాష్ట్రాల్లో అధ్యయనం.. ఆసక్తికర అంశాలు
► జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌.ఐ.ఆర్‌.డి–పి.ఆర్‌.) 2016వ సంవత్సరంలో వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌.ఓ. నీటి శుద్ధి ప్లాంట్ల తీరుతెన్నులపై విస్తృతమైన అధ్యయనం చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 

► అధ్యయనం జరిపిన రాష్ట్రాలు.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌.

► ఈ ఏడు రాష్ట్రాలలో ఆర్‌.ఓ. సిస్టమ్స్‌ ఉన్న 21 గ్రామ పంచాయితీలను  ఎన్నుకున్నారు. ∙ఈ గ్రామ పంచాయతీలలో ఆర్‌.ఓ. సిస్టమ్స్‌ పెట్టే ముందుగానే నీటిని పరీక్షించారు. అందులో 13 గ్రామ పంచాయతీలలో లీటరు నీటికి టి.డి.ఎస్‌. 500 ఎం.జి. కంటే ఎక్కువగా ఉంది. పంచాయితీ సర్పంచుల చొరవతో అక్కడ ఆర్‌.ఓ. సిస్టమ్స్‌ నెలకొల్పారు.

► మిగిలిన 8 గ్రామ పంచాయతీలలో టి.డి.ఎస్‌. 500 మి. గ్రా. కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సర్పంచులే అత్యుత్సాహం చూపి ఆర్‌.ఓ. ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయించారు.

► ఈ 21 గ్రామ పంచాయితీలలో ఆర్‌.ఓ. సిస్టమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ప్రైవేటు సంస్థలు ఆర్‌.ఓ. యూనిట్లను ఏర్పాటు చేశాయి. వీటి నిర్వహణను గ్రామ పంచాయతీలు లాభాపేక్ష లేకుండా చూస్తున్నాయి.

► అధ్యయనం జరిగిన 21 గ్రామ పంచాయతీలలో ఎనీటైమ్‌ వాటర్‌ (ఎ.టి.డబ్లు్య.) కార్డులను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధంగా పోగైన డబ్బును ఆర్‌.ఓ. సిస్టమ్స్‌ నిర్వహణకు వినియోగిస్తున్నారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు నేపథ్యంలో ప్రజల్లో ఆర్‌.ఓ. నీటి గురించి లోతైన అవగాహన కలిగించాల్సిన తక్షణ అవసరం ఉంది. 
-డా. పి. శివరాం, జాతీయ గ్రామీణ, పంచాయతీరాజ్‌ అభివృద్ధి సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
polankis@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement