శింగనమలలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్
అధికారంలో ఉండగా వాటర్ ప్లాంట్ల నిర్వహణను చేజిక్కించుకున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. ఎంచక్కా లాభాలను తమ జేబుల్లోకి వేసేసుకొని... వాటికి వచ్చే కరెంటు బిల్లులను మాత్రం చెల్లించకుండా విద్యుత్‌శాఖకు ఎగనామం పెట్టేశారు. – శింగనమల
సాక్షి,శింగనమల: శింగనమలలో ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పేరుతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను సప్తగిరి క్యాంపర్ సంస్థ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా ఉచితంగా అందించారు. దీనిని రామాలయంలోని కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ గ్రామ పంచాయతీ చేపట్టాలని నిర్ణయించారు. కానీ అధికారం ఉందన్న నెపంతో టీడీపీ కార్యకర్త దాని బాధ్యతలను అప్పగించారు. తన సొంత మినరల్ వాటర్ ప్లాంట్‌గా ఆయన నీటిని అమ్ముకుంటూ వచ్చారు. ఇంతవరకూ గ్రామ పంచాయతీకి ఎలాంటి డబ్బు జమ చేయలేదు. వాటర్ ప్లాంట్ విద్యుత్ బకాయి ఇప్పటి వరకు రూ.1.50 లక్షకు చేరింది. నేటికీ ఈ బకాయిని విద్యుత్ అధికారులు వసూలు చేయలేదు.
వచ్చే ఆదాయమంతా టీడీపీ కార్యకర్తే తీసుకున్నా, విద్యుత్ అధికారులు మాత్రం ఆయన్నుంచి వసూలు చేసుకోలేదు. విద్యుత్ మీటర్‌ను మాత్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ పేరు మీద తీసుకున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం గ్రామ పంచాయతీ చెల్లిస్తుందిలేననే ధీమాగా ఉన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తే నిర్వహిస్తుంటం గమనార్హం. విద్యుత్ అధికారులు మాత్రం బకాయిలు వసూలు చేయకపోవడం విశేషం. ఈవిధంగా శింగనమల నియోజకవర్గంలో ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పేరు మీద వసూలు చేసిన వాటర్ ప్లాంట్లకు విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి.
ఈ వాటర్ ప్లాంట్లకు దాతలు సహకరించడం, వాటర్ షెడ్ ద్వారా నిధులు కేటాయించడం, ఎంపీ ల్యాండ్స్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లను గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. శింగనమల మండలంలో సలకంచెర్వు, నాయనవారిపల్లి, లోలూరు గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. సలకంచెర్వులో వాటర్ షెడ్ కింద ఏర్పాటు చేయగా, గత సర్పంచ్ , వారి అనుచరులు నిర్వహించారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకున్నారు.
ప్రస్తుతం అది నిలిచిపోయింది. దీనికి రూ.50 వేలు విద్యుత్ బకాయి ఉంది. నాయనవారిపల్లిలో వాటర్‌షెడ్ కింద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. నిర్వహణ మాత్రం మాజీ సర్పంచ్ చేస్తున్నారు. విద్యుత్ బకాయి రూ.4 వేలు దాకా ఉంది. లోలూరులోనూ రూ.4 వేలు బకాయి చెల్లించాల్సి ఉంది. ఇక ఎంపీ ల్యాడ్స్ కింద కల్లుమడి, రాచేపల్లి, నిదనవాడ, ఉల్లికల్లు, సోదనపల్లి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం రూ.2.40 లక్షల విద్యుత్ బకాయి చెల్లించాల్సి ఉన్నా ఎవరూ చెల్లించడంలేదు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే తంతు
నార్పల మండలంలోనూ గూగూడు, బండ్లపల్లి, పూలసలనూతలలో వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయగా, నార్పల, బి.పప్పూరు, బొందలవాడ గ్రామాల్లో ఏర్పాటు చేసినా అవి ప్రారంభం కాలేదు. పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి, చెర్లోపల్లి, ఓబుళాపురం గ్రామాల్లో వాటర్‌షెడ్ నిధుల కింద వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వీటికి రూ.1.80 లక్షలు విద్యుత్ బకాయిలున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో పసూలూరు, సిద్దరాంపురం, కొర్రపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు రూ.1.50 లక్షలు విద్యుత్ బకాయి ఉన్నారు.
గార్లదిన్నె మండలంలో మర్తాడు, కోటంక, గార్లదిన్నె గ్రామాల్లోనూ వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. వీటికి రూ. గార్లదిన్నెలో రూ.10 వేలు బకాయిలున్నాయి. మర్తాడులో విద్యుత్ మీటరు లేకుండానే నేటికీ వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈవిధంగా నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లుకు సంబంధించి రూ.5.70 లక్షలు విద్యుత్ బకాయిలున్నాయి. ప్రభుత్వం మారడంతో ఈ బకాయిలు ఎగవేతకు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బకాయి వసూలు చేస్తాం
వాటర్ ప్లాంట్లకు ఉన్న విద్యుత్ బకాయి వసూలుకు చుంటున్నాం. శింగనమల మండలంలో నిర్వహణలో ఉన్న వాటర్ ప్లాంట్లకు సంబంధించి ఎంత బకాయి ఉందో నిర్వాహకులతో వసూలు చేస్తాం. విద్యుత్ బకాయి చెల్లించకపోతే మాత్రం విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తాం.
– ప్రసాద్, ట్రాన్స్‌కో ఏఈ, శింగనమల
Comments
Please login to add a commentAdd a comment