సిద్దిపేట జోన్: మురికివాడలకు ఇది శుభవార్త. స్వచ్ఛమైన తాగునీటి కోసం అల్లాడుతున్న పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాల్టీలో వాటర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సేఫ్ వాటర్ పేరిట వినూత్న ప్రక్రియకు నాంది పలికింది. ఆ దిశలోనే జిల్లాలో సిద్దిపేట మున్సిపాల్టీలో ప్యూరీఫై వాటర్‌ను అందించేందుకు మున్సిపల్ అధికారులు అంకురార్పణ చేశారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో తొలి విడతగా సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛంద సంస్థ సహకారాలతో మున్సిపల్ యంత్రాంగం ఎంపిక చేసింది.
ఆ దిశగా పట్టణంలోని 17 నిర్దేశిత ప్రాంతాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు శనివారం బృందాలుగా పట్టణంలో వాస్తవ వివరాల సేకరణకు సమగ్ర సర్వే నిర్వహించారు. గత కొంత కాలంగా గ్రామీణ ప్రాంతాలకు ఏటీడబ్ల్యూ (ఎనీ టైమ్ వాటర్) పేరిట స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న బాలవికాస్ సంస్థతో అనుసంధానంగా సిద్దిపేట మున్సిపల్ నీటి సరఫరా విభాగం నామమాత్ర రుసుముతో ప్యూరీఫై వాటర్ పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసింది. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రక్రియ సత్ఫలితాలను అందిస్తే భవిష్యత్తులో జిల్లాలోని మిగతా మున్సిపాల్టీలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. వివరాలు... స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా పేరొందిన సిద్దిపేటలో అధికారిక రికార్డుల ప్రకారం ప్రస్తుతం 1.50 లక్షల జనాభా ఉన్నట్లు సమాచారం.
వీరందరికి గత కొంత కాలంగా కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి తాగునీటిని మున్సిపల్ యంత్రాంగం సరఫరా చేస్తుంది. మరోవైపు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గత కొన్ని నెలలుగా బాల వికాస్ నేతృత్వంలో వాటర్ ప్లాంట్ల నిర్వహణ కొనసాగుతుంది. సభ్యత్వ రుసుముతో నామమాత్ర ధరకే శుద్ధి చేసిన మినరల్ వాటర్‌ను అందిస్తున్న ప్రక్రియ పల్లెల్లో సత్ఫలితాలను కలిగిస్తుంది. ఈ క్రమంలో ఇదే విధానాన్ని పట్టణ ప్రాంత ప్రజలకు అందించాలన్న ఆశయంతో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఇటీవల మున్సిపల్ అధికారులతో ప్రణాళికపై సుదీర్ఘం గా చర్చించారు. జల కాలుష్యంతో వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ యంత్రాంగం భవిష్యత్ ప్రణాళికను రూపొందించింది.
ఆ దిశగా పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న 132 చేతి పంపులు, 123 పవర్ బోర్ల ద్వారా అందుతున్న తాగునీటిని సేకరించిన అధికారులు సంబంధిత పరీక్షలను నిర్వహించారు. ప్యూరీఫైకి సానుకూలంగా జల వనరులు ఉండడంతో సిద్దిపేట పట్టణంలో తొలి ప్రక్రియగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి మున్సిపల్ నీటి సరఫరా విభాగం ముందుకొచ్చింది. అందులో భాగంగానే పట్టణంలోని 34 వార్డుల పరిధిలోని ప్రజలతో పాటు ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారికి మినరల్ వాటర్‌ను అందించాలని నిర్ణయించింది. ఆ దిశగా నెహ్రూ పార్క్, బారాయిమామ్, బాలాజీ థియేటర్, భారత్‌నగర్, ఖాదర్‌పురా, సాజీత్‌పురా, హనుమాన్ నగర్, హౌజింగ్ బోర్డ్, కేసీఆర్ నగర్, ఎఫ్‌సీఐ గోదాం, వడ్డెర కాలనీ, సుభాష్‌నగర్, ఎన్సాన్‌పల్లి రోడ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో మొత్తంగా 17 పాయింట్లను మున్సిపల్ నీటి సరఫరా విభాగం గుర్తించింది.
ఆయా ప్రాంతాల్లోని చేతి పంపులు, పవర్ బోర్ల స్థితిగతులను, అక్కడ ప్రభుత్వ భవనాలైన అంగన్‌వాడీలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలను గుర్తించే ప్రక్రియను శనివారం చేపట్టింది. ఆ దిశగా మున్సిపాలిటీలోని ప్రత్యేక బృందాన్ని మూకుమ్మడి సర్వేకు ఆదేశించిన మున్సిపల్ అధికారులు ఆయా మురికివాడల్లో వాటర్ ప్లాంట్ల భవన నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులపై నివేదికను తయారు చేయడంలో నిమఘ్నమయ్యారు. బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ అందించే నీటి శుద్ధికరణ యంత్రాల ద్వారా పట్టణంలోని ప్రజలకు స్వచ్ఛమైన మినరల్ వాటర్‌ను నామమాత్ర రుసుముతో అం దించేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపడుతుం ది. ఈ ప్రక్రియకు అవసరమైన వాహన సౌకర్యం, వాటర్ క్యాన్‌ల సదుపాయాన్ని మంత్రి హరీష్‌రావు సమకూర్చగా, బోర్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, భవన నిర్మాణాల ప్రక్రియను మున్సిపాలిటీ పర్యవేక్షించనుంది.
మరోపక్షం రోజుల్లో తొలి విడతగా జిల్లాల్లో సిద్దిపేటలో ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలకు నామమాత్ర రుసుముతో తా గునీటి అందించేందుకు సమాయత్తం అవుతోంది. ప్రయోగాత్మకంగా సిద్దిపేటలో చేపడుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియ సత్ఫలితాలు కలిగితే జిల్లాలోని మిగతా మున్సిపాల్టీలో, నగర పంచాయతీల్లో అమలు చేసేం దుకు జిల్లా అధికారులు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. ఏదేమైనా ఎనీటైం మనీ తరహాలో ప్రస్తుతం పల్లెల్లో ఎనీటైం వాటర్ ప్రక్రియ భవిష్యత్తులో పట్టణ వాసుల ముంగిట్లోకి రానున్నట్లు సమాచారం.
ప్యూరీ(హై)ఫై
Published Sun, Oct 5 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement