మీరు బయట తాగే వాటర్‌ ప్యూరిఫైడ్‌గా భావిస్తున్నారా.? | Unauthorized Water Plants In Karimnagar | Sakshi
Sakshi News home page

మీరు బయట తాగే వాటర్‌ ప్యూరిఫైడ్‌గా భావిస్తున్నారా.?

Published Fri, Sep 23 2022 9:56 AM | Last Updated on Fri, Sep 23 2022 10:30 AM

Unauthorized Water Plants In Karimnagar - Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: మీరు బయట తాగే వాటర్‌ ప్యూరిఫైడ్‌గా భావిస్తున్నారా.? మీ భావన తప్పు. మీరు అనారోగ్యానికి దగ్గర పడుతున్నారనేదే వాస్తవం. ఆరోగ్యం కోసం శుద్ధి చేసిన నీళ్లు తాగుతుంటే అవి అనారోగ్యానికి కేరాఫ్‌ అని చెబుతున్నారని అనుకుంటున్నారా.? అదే నిజం. ఒకసారి సరఫరా చేసే శుద్ధ జల కేంద్రానికి వెళితే అర్థం అవుతుంది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూరు, గంగాధర, రామడుగు, శంకరపట్నం, తదితర ప్రాంతాల్లో సుమారు 800 వరకు శుద్ధ జల సరఫరా కేంద్రాలున్నాయి. పట్టణాల నుంచి పల్లెల దాకా విస్తరించాయి. వీటిలో బీఎస్‌ఐ అనుమతి ఉన్న కేంద్రాలు కేవలం నాలుగే ఉన్నాయి. మిగతావన్నీ నామమాత్రపు అనుమతితో నడుస్తున్నవే. నాణ్యత ప్రమాణాలు అటకెక్కగా తనిఖీల ఊసే లేదు. దీంఓ నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా అధికారులుండే కరీంనగరంలోనే వందల సంఖ్యలో కేంద్రాలు నడుస్తుండడం గమనార్హం. 

విచ్చలవిడిగా కేంద్రాలు.. లక్షల్లో వ్యాపారం
జిల్లావ్యాప్తంగా అనధికారికంగా నిర్వహిస్తున్న వా టర్‌ ప్లాంట్లలో కరీంనగర్‌ నగర పరిధిలో 300 వర కు ఉన్నాయి. కూల్‌వాటర్, మినరల్‌ వాటర్‌ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమ తి లేకుండా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న వాటర్‌ ప్లాంట్లపై ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. 
నీటిని శుద్ధి చేసేందుకు వినియోగిస్తున్న యంత్రాలకు ప్రభుత్వపరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. 
గంటకు 2 వేల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ప్లాంట్లు నివాస ప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో నిర్వహిస్తున్నారు. 
∙వాటర్‌ ప్లాంట్లలో వినియోగించే పైపులు, నిల్వ చేసే ట్యాంకులు స్టీలువి వినియోగించాల్సి ఉండగా ప్లాస్టిక్‌ వాడుతున్నారు. 
ప్రతిరోజూ సరఫరా అయ్యే నీటిని తనిఖీలు చేయాల్సి ఉన్నా ఏ ఒక్కచోటా అది జరగడం లేదు. 
నీటి కోసం మున్సిపల్‌ శాఖ అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. అక్కడ వచ్చిన నీటిని పరీక్షించి దానికనుగుణంగా యంత్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. 
∙నీటి నిల్వకు కనీసం ఏడు సెంట్ల స్థలం కావాల్సి ఉండగా 200 అడుగుల గదుల్లోనే ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. నామమాత్రంగా శుద్ధి చేసి క్యానుల్లో నింపుతున్నారు. 
క్యాన్‌లను వేడి నీటిని ఉపయోగించి ప్రెజర్‌ బ్రష్‌లతో చేయాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించారు. 
మున్సిపల్‌ కుళాయిల్లో వస్తున్న నీటినే క్యాన్లలో నింపి మినరల్‌ వాటర్‌ పేరుతో విక్రయించి సొమ్ముచేసుకునే వారూ ఉన్నారు.

కేంద్రంలో ఇవి తప్పనిసరి
సాధారణంగా వాటర్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలంటే అందుకు మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి ముందస్తుగా నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ విధిగా పొందాలి. ఎన్‌వోసీ ఆధారంగా ప్లాంటు స్థాపించేందుకు విద్యుత్‌ శాఖ నుంచి కనెక్షన్‌ కోసం అనుమతి పొందాలి. 

శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించాలంటే భారత ప్రమాణాల సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారం మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్‌ 7.5శాతం కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా నీటి «శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులుండాలి. ఫిల్లింగ్‌ సెక్షన్, ఆర్‌వో సిస్టంలో మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రమ్ములు ఏర్పాటు చేయాలి.

శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు 304 గ్రేడ్‌ స్టెయిలెస్‌ స్టీలు డ్రమ్ములు వాడాలి. ఈ నీటికి తప్పకుండా ఓజోనైజేషన్‌ చేయాలి. మినరల్‌ వాటర్‌ను బబుల్స్‌(క్యాన్‌)లోకి పట్టే ముందు అల్ట్రావయోలెట్‌ కిరణాలతో శుద్ధి చేయాలి. 
క్యాన్లను ప్రతీసారి పొటాషియం పర్మాంగనేట్‌ లేదా హైపో సొల్యూషన్‌తో శుభ్రం చేయాలి. వీటిని శుద్ధి చేసిన తేదీ బ్యాచ్‌ నంబర్‌ను సీలుపై ముద్రించాలి. 
 శానిటరీ అధికారులతో ప్రతినెలా నీటిని పరీక్షింపజేసి బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌)కు పంపించాలి. 
నాణ్యత ప్రమాణాలను ఫుడ్‌ కంట్రోల్‌ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు వాటర్‌ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రమాణాలు పాటించకుంటే     రుగ్మతలకు అవకాశం
ఆల్కలైన్‌ తగిన మోతాదులో వాడకపోతే ఎముకల పటుత్వంలో సమస్యలు ఏర్పడుతాయి. సరైన శుద్ధి చేయకుండా నీరు తాగడం వలన గొంతు సంబంధ సమస్యలు, ఒంటినొప్పులు, వివిధ రకాల రుగ్మతలు వస్తాయి. ప్లాస్టిక్‌ వాటర్‌ ప్యాకెట్లు, క్యాన్లలో ఎక్కువ కాలం నిలువ ఉంచిన నీరు తాగడం వలన క్యాన్సర్లు వచ్చే ప్రమాదముంది. వాటర్‌ ప్లాంట్లు పరిశుభ్రత విషయంలో నిబంధనలు పాటించకున్నా వ్యాధులు వస్తాయి. 
– డా.సాయిని నరేందర్, ఎండీ చెస్ట్‌ క్రిటికల్‌ కేర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement