పిల్లలతో అనిత
అది దేశరాజధాని నగరం ఢిల్లీలో ఓ చిన్న కాలనీ. పేరు ఆనంద్ పర్బత్ కాలనీ. మొత్తం 52 కుటుంబాలు నివసిస్తాయి. సమాజం నుంచి అనధికార వెలివేతకు గురయిన కుటుంబాలే అవన్నీ. తమ ప్రమేయం లేకనే వివక్షను ఎదుర్కొంటున్న జీవితాలవి. ఒక్కో కుటుంబానిది ఒక్కో దీనగాధ. అందుకు అనిత జీవితమే ఓ ఉదాహరణ.
పని ఎవరిస్తారు?
అనిత సూర్యోదయానికి ముందే నిద్రలేస్తుంది. ఇంటి పనులు, వంట చేసి పెడుతుంది. ముగ్గురు పిల్లలను నిద్రలేపి తాను ఎనిమిదన్నరకంతా బయటపడుతుంది. రోజూ ఇదే ఆమె దినచర్య. ఆమె డ్యూటీకి వెళ్లినట్లు ఆ వెళ్లడం ఉద్యోగానికి కాదు, రోడ్డు సిగ్నళ్ల దగ్గర యాచన కోసం. దీనమైన ఆమె ముఖం చూసి ఒక రూపాయి ఇచ్చే వాళ్లు ముఖం చిట్లించి ‘పని చేసుకోవచ్చు కదా! ఒళ్లు వంచి పని చేయాలనుకుంటే స్వీపర్ ఉద్యోగం వంటిదేదో రాకపోతుందా’ అని చిరాకు పడుతుంటారు. ‘ఆ పని కూడా ఎవరూ ఇవ్వకపోవడం వల్లనే ఇలా’ అంటూ ఒంటి మీద మచ్చలను చూపిస్తుంది అనిత. ‘చెప్పండి... నాకు పని ఎవరిస్తారు?’ అని అడుగుతుంది దీనంగా.
‘సిగ్నళ్ల దగ్గర రోజంతా యాచిస్తే ఎంత వస్తుంది’ ఎవరో అడుగుతారు కొంత సానుభూతితో.
‘వంద రూపాయలు వచ్చిన రోజు నలుగురమూ కడుపు నిండా తింటాం’ అని ఆవేదనగా చెబుతుంది అనిత. ఆమె ఇంకా చాలా చెప్తోంది... పాదాలరిగిపోయాయి! ‘‘మా లాంటి వాళ్ల కోసం ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందట. కానీ మా పేర్లు రాసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులెవరూ రారు. మేమే పెన్షన్ కోసం అప్లయ్ చేయడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అంటరాని వారిని చూసినట్లు చూస్తారు.
అలా చూసినా సరే... చీదరతోనైనా త్వరగా పని చేసి పంపించేస్తారా అంటే అదీ ఉండదు. తిరిగి తిరిగి మా కాళ్లరిగిపోతాయి. అసలే అనారోగ్యంతో అరిగిపోయిన పాదాలు మావి. వయసు మీరిన వాళ్లకయితే వేళ్లు కూడా ఊడిపోయి ఉంటాయి. వేళ్లు ఊడిపోయిన చేతులతో దణ్ణం పెట్టి వేడుకున్నా సరే... కనికరించాలనే కరుణ ఉండదు. రోజులు లెక్కపెట్టుకుంటన్న మా బతుకులకు ఆసరాగా ఉంటోంది జయ దీదీ. మా బతుకుల్లో కొండంత అండగా ఉంది’’ అని చెబుతోంది అనిత.
వేరే బెంచీ!
‘లెప్రసీ వ్యాధిగ్రస్థులను మాత్రమే కాదు, ఆ ఇంట్లో వాళ్లను కూడా సమాజం చూపులతోనే దూరం పెట్టేస్తుంది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే లెప్రసీ బాధితుల కోసం పని చేయడానికి ముందుకు వచ్చా’నని చెప్పింది జయారెడ్డి. ‘‘నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మా అమ్మానాన్నలకు ఈ వ్యాధి సోకింది. గాయాలకు డ్రెస్సింగ్ చేసుకోవడం లో వాళ్లకు సహాయం చేసేదాన్ని.
మా పేరెంట్స్ తరచూ హాస్పిటల్‌కు వెళ్లాల్సి రావడం గురించి మా టీచర్‌కు తెలిసిన తర్వాత ఆమె నన్ను క్లాసులో అందరితో కలిసి కూర్చోనివ్వలేదు. నాకు వేరే బెంచీ, ఆ బెంచీ మీద మరెవరూ కూర్చోరు. మా పేరెంట్స్‌ను తాకిన నా నుంచి బ్యాక్టీరియా క్యారీ అవుతుందని, నాతో ఆడుకుంటే, నాకు దగ్గరగా మసలితే మిగిలిన వాళ్లకూ సోకుతుందనే అపోహతోనే నన్ను వెలివేశారు. సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకోవడంతో మా పేరెంట్స్ కోలుకున్నారు.
లెప్రసీ వ్యాధిగ్రస్తుడికి మందులు అందిస్తున్న జయారెడ్డి
కానీ ఆ తర్వాత మా నాన్న ఈ వ్యాధిగ్రస్థుల కోసం పని చేయడానికే తన జీవితాన్ని అంకితం చేశారు. వీళ్లకు పెన్షన్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డుల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి సాధించేవారు. హాస్పిటల్‌లో మందులిచ్చే సమయం తెలుసుకుని పేషెంట్‌లను తీసుకుని వెళ్లడం, వాళ్లను ఓ చెట్టుకింద కూర్చోబెట్టి ఆయన క్యూలో నిలబడి మందులు తీసుకునేవారు. అలా ఓ పదేళ్లపాటు పని చేసిన తర్వాత ఆయన కాలం చేశారు. ఆయన పోయి ఇరవై ఏళ్లయింది. నాన్న వదిలిన పనిని నేను అందుకున్నాను.
నేను ఈ కాలనీ వాసులతో చొరవగా మెలగడాన్ని గమనించిన ఓ ఎన్‌జీవో నన్ను గౌరవవేతనంతో వాలంటీర్‌గా చేర్చుకుంది. లెప్రసీని పారదోలడానికి ఓ తపస్సు జరుగుతోంది. కానీ అది ఇంకా పూర్తికాలేదు. సరైన వైద్యంతో మామూలు మనుషులైన వాళ్లకు స్వయం ఉపాధి కల్పిస్తే సమాజంలో గౌరవంగా జీవించగలుగుతారనేది నా ఆశ. ఆ రోజు ఎప్పుడు వస్తుందో...’’ అని అర్ధోక్తిలో ఆగిపోయిందామె.
ఇది 21వ శతాబ్దం... లెప్రసీపై పోరాటం ఇంకా ముగిసిపోకపోవడం నిజంగా దురదృష్టకరం.
Comments
Please login to add a commentAdd a comment