- బీటీ పత్తి విత్తనాల ధర పెంచడానికి సర్కార్ విముఖత
- రెండు మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం
- ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం
- జిల్లాలో విత్తనాల అమ్మకాలు షురూ
- పొంచివున్న ‘బ్లాక్ మార్కెట్’ ముప్పు
- వ్యవసాయశాఖ అప్రమత్తమైతేనే ఫలితం
బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల ధరపై ప్రతిష్టంభన తొలగిపోనుంది... కంపెనీల ఎత్తుగడను సర్కార్ చిత్తు చేసింది. ధర పెంచాలని కంపెనీలు కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నా అందుకు ససేమిరా అంటోంది. ఇక పాత ధరకే విత్తనాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. ఈ మేరకు పాత ధరకే జిల్లాకు నిల్వలు వస్తున్నట్టు సమాచారం.
గజ్వేల్: జిల్లాలో ప్రధాన పంటల్లో పత్తి ఒకటి. గతేడాది ఇక్కడ 1.26 లక్షల హెక్టార్లకు పైగా పత్తి సాగవగా ఈసారి కూడా అదేస్థాయిలో విస్తీర్ణం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా. ఇందుకోసం 5 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని భావించి ఉన్నతాధికారులకు ఇండెంట్ పంపారు. 30 రకాల కంపెనీలకుపైగా విక్రయాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అనుమతిచ్చింది. కంపెనీలు కొన్ని రోజులుగా విత్త ప్యాకెట్ ధరను పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెల్సిందే. ఫలితంగా ఈ వ్యవహారంపై కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెల కొంది. ఈ క్రమంలో పాత ధరకే (450 గ్రాముల పరిమాణం గల విత్తన ప్యాకెట్‌ను రూ.930కే) విక్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ఆదేశాలు వెలువడనున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
పొంచివున్న ‘బ్లాక్ మార్కెట్’ ముప్పు....
ఎప్పటిలాగే ఈసారికూడా ఇక్కడ ఓ ప్రధాన కంపెనీకి చెందిన ప్యాకెట్‌పై రైతుల్లో పోటీని కలిగించడానికి వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. అలాచేస్తే యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడి లక్షలాది రూపాయలను సంపాదించవచ్చనే ఆలోచనతో ముందుకుసాగుతున్నారు. బీటీ పత్తి విత్తనాలన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయని మూడేళ్లుగా వ్యవసాయ, ‘ఆత్మ’ శాఖలు పలు గ్రామాల్లో ఐదు రకాల బీటీ విత్తనాలను సాగుచేసిన పంటలపై పరిశీలన జరి పింది. ప్రయోగాత్మకంగా కూడా నిరూపించిన విషయం తెల్సిందే.
దీనిపై విస్తృతంగా కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోతుంది. వ్యాపారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఒకటి రెండు రకాల విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమనే విషయాన్ని చెబుతూ ఈ రకాలవైపే రైతులను తిప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమేతై ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడే అవకాశముంది.
పాత ధరే!
Published Sat, May 2 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement