సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన ధరలను పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం వద్దని మొరపెట్టుకున్నా వినలేదు. విత్తన ధరలు పెంచితే రైతులకు నష్టం వస్తుందని అధికారులు లేఖ రాసినా పట్టించుకోలేదు. పత్తి విత్తన ధరల పెంపుపై కేంద్రం నిర్వహించిన సమావేశాల్లోనూ తెలంగాణ వ్యవసాయశాఖ వ్యతిరేకించింది. రెండేళ్లుగా పత్తి విత్తన ధరల పెంపు కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి.
తాజాగా 475 గ్రాముల బీజీ–2 పత్తి ప్యాకెట్‌పై రూ.43 అదనంగా పెరిగింది. 2020–21లో పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.730 ఉండగా, 2021–22లో రూ.767కు పెంచింది. ఇప్పుడు 2022–23లో ప్యాకెట్ ధర రూ.810కు పెంచుతూ కేంద్రం తాజాగా గెజిట్ జారీ చేసింది. కరోనా సమయంలో ఇలా పెంచుతూపోవడం సమంజసం కాదని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. కాటన్ సీడ్ కంట్రోల్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది.
1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు...: రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి, పత్తి అత్యధికంగా సాగవుతాయి. గతేడాది 50.94 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో వరికి ప్రత్యామ్నాయంగా ఇతరత్రా పంటలను సాగు చేయించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఇందులో పత్తిపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనా.. ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున 1.20 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి.
అయితే కంపెనీలు అవసరానికి మించి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతాయి. పెరిగిన ధరల ప్రకారం.. రూ.కోట్లలో రైతులపై భారం పడనుంది. ఒక్కోసారి సకాలంలో వర్షాలు కురవక, విత్తనాలు మొలకెత్తక భూమిలోనే ఎండిపోతాయి. అప్పుడు రైతులు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి వేస్తారు. పత్తి విత్తన ధరల పెంపుపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని వ్యవసాయ వర్గాలు కోరుతున్నాయి.
కంపెనీలకు లాభం చేకూర్చేందుకే..
విత్తన కంపెనీలకు లాభం చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ధరలను ఏటేటా పెంచుతూ వస్తోంది. అంతేగాకుండా సీడ్ ఆర్గనైజర్ల జేబులు నింపేలా కుట్ర పన్నుతోంది. కొందరు పెద్దల కనుసన్నల్లో ఇది జరుగుతోంది. ఈ పెంపుతో పత్తివిత్తన రైతులకు ఒరిగేది కూడా ఏమీలేదు. వారికి ప్యాకెట్‌పై కేవలం 32 శాతమే ఇస్తున్నారు. మిగతాది కంపెనీలకే వెళ్తుంది. కాబట్టి ఇది విత్తన కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లకు లాభం చేకూరుస్తుందనేది అర్థమవుతోంది.
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment