సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెలరోజుల క్రితం వరకు రూ.వందకు నాలుగు కిలోల చొప్పున అమ్మిన టమాటాల ధర ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ రిటైల్ మార్కెట్‌లో టమాటా కిలో రూ.100కు చేరింది. పావుకిలో కొనాలంటే రూ.30 ఇస్తే తప్ప దొరకని పరిస్థితి. అలాగే, పచ్చిమిర్చి, బీన్స్, చిక్కుడుతోపాటు అన్ని కూరల్లో వాడే అల్లం, వెల్లుల్లి ధరలు కూడా సామాన్యుడికి ఏమాత్రం అందనంతగా పెరిగిపోయాయి.
పచ్చిమిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు తప్ప బెండకాయలు, బీరకాయలు, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కిలో రూ.60–80కి మధ్య ఉండటం గమనార్హం. రైతుబజార్లు, మార్కెటింగ్ శాఖ మొబైల్ వ్యాన్‌లలో విక్రయించే చోట ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రిటైల్ దుకాణాల్లో కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సూపర్‌మార్కెట్లలో రిటైల్ మార్కెట్ల కన్నా కిలోకు రూ.10–15 వరకు అధికంగా ఉంది.
అల్లం కిలో రూ.300
కూరల్లో రుచికి తప్పనిసరైన అల్లం ధర ఊహించని విధంగా కిలో రూ.300కి చేరింది. మంగళవారం హైదరాబాద్ చింతలబస్తీలో బండ్లపైన అల్లం పావుకిలో రూ.80 ఉండగా, కిలోకు రూ.300 చెప్పడం గమనార్హం. వెల్లుల్లి కిలో రూ.200 ఉండగా, మేలురకం ధర రూ.240 ఉంది.
మూడు నెలల క్రితం వరకు కిలో రూ.100కి లభించిన అల్లం, వెల్లుల్లి ధరలు ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయి సామాన్యుడు కొనలేనంత పైకి చేరుకున్నాయి. బీన్స్ నాణ్యతను బట్టి కిలో రూ.120 నుంచి రూ.160 వరకు ఉండగా, చిక్కుడుకాయలు కిలో రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు.
వేసవిలో కూరగాయలు పండించకనే..
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మూడునెలలుగా రాష్ట్రంలో కూరగాయల పంటలు ఆశించిన స్థాయిలో లేవు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో అకాల వర్షాలు, మే, జూన్‌లలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఏపీ నుంచి కూడా ఆశించినస్థాయిలో తెలంగాణకు దిగుమతులు లేవు. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, క్యారెట్ వంటివి తప్ప నిత్యం వండుకునే కూరగాయల దిగుమతులు తక్కువగానే ఉన్నట్లు హైదరాబాద్ రైతుబజార్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment