సాక్షి, అమరావతి: పెరుగుతున్న కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం యాప్ ద్వారా రోజూ క్షేత్రస్థాయిలో కూరగాయల ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తోంది. ఉల్లి, ఇతర కూరగాయల ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా.. టమాటా ధర పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, కృష్ణా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోనే టమాట ధర పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా టమాటాతో పాటు ముందస్తు చర్యల్లో భాగంగా ఉల్లి, బంగాళదుంపలు, మిరప వంటి ఇతర కూరగాయల ధరలను సమీక్షిస్తున్నారు.
మరో వైపు ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపింది. ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లో టమాటా ధర బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 32 నుంచి రూ. 65 మధ్యలో, ఉల్లిపాయలు కిలో రూ.20 నుంచి 25 మధ్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ఈ రెండింటి ధరలు బహిరంగ మార్కెట్‌కంటే తక్కువగా ఉండేలా చర్యలు చేపట్టారు. టమాటా కిలో రూ.100 దాటితే మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బుధవారం రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో రైతుబజార్ల సీఈవో నందకిషోర్ సమీక్షించనున్నారు. సీఎం యాప్ ద్వారా రోజూ జిల్లాలవారీగా కూరగాయల ధరలను సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైతే మార్కెట్‌లో జోక్యం చేసుకుంటామని చెప్పారు.
మిర్చి రైతుకు పండగే
కంకిపాడు: రాష్ట్రంలో మిర్చి రైతుకు పండగొచ్చింది. సంవత్సర కాలంగా కిలో రూ.50 కి మించని పచ్చి మిర్చి ప్రస్తుతం రూ. 100 దాటింది. వారం, పది రోజులుగా మిర్చి ధర రూ 35 నుంచి క్రమేపీ పెరిగింది. వేసవి కారణంగా మిర్చి సాగు తగ్గింది. డిమాండ్‌కు సరిపడా దిగుబడి లేకపోవడంతో ధర పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment