రోజూ సాయంకాలం అయ్యిందంటే చాలు పిల్లలు, పెద్దలు ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినాలనుకుంటారు. చిప్స్‌లాంటి జంక్ ఫుడ్‌ని బయట కొని తింటుంటారు. వాటిలో పోషకాల లేమి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని గమనించిన డాక్టర్ సౌమ్య మందరపు పోషకాలు పుష్కలంగా ఉండే చిరుతిళ్లను కూరగాయలు, చిరుధాన్యాలతో తయారుచేస్తున్నారు. ఉదయపు అల్పాహారంగానూ బ్రేక్‌ఫాస్ట్ బార్‌ను అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉంటున్న ఈ పోషకాహార నిపుణురాలు చేస్తున్న కృషికి సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు.
‘వరి,గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒకసారి భోజనంగా తీసుకుంటూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు తింటే జీవనశైలి జబ్బులతో బాధపడేవారు నెలరోజుల్లోనే తమ ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు’ అంటున్నారు డాక్టర్ మందరపు సౌమ్య. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన సౌమ్య 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్‌లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. తన కృషిని సౌమ్య ఈ విధంగా వివరిస్తూ...
ప్రకృతి దిశగా ఆలోచనలు
‘‘పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో. ఇంటర్మీడియెట్ తర్వాత ఇష్టంతో న్యూట్రీషియన్ విభాగంలోకి వచ్చాను. డిగ్రీ పూర్తవగానే మా జిల్లాలోనే కృషి విజ్ఞాన కేంద్రంలో వర్క్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో చేరాను.
గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణ
మన దేశంలోని పల్లె ప్రాంతాల్లో పిల్లలు, గర్భవతులు, మహిళల్లో రక్తహీనత సమస్య ఉందనే విషయం తెలిసిందే. ఈ విషయంగా పల్లె ప్రాంతాల్లో క్యాంప్స్ నిర్వహించాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. పిల్లలు, పెద్దలు ఎంత పోషకాహారం తీసుకోవాలనేది వయసులవారీగా ఉంటుంది. దాని ప్రకారం మనమేం ఆహారం తింటున్నాం, ఎలా ఉంటున్నామనేది పరిశోధనలో భాగంగానే గడిచింది. దీంతో ఎంతోమంది వారు తీసుకుంటున్న ఆహారం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో పల్లె నుంచి పట్టణ స్థాయి వరకు తెలుసుకున్నాను.
చిరుధాన్యాలతో ప్రయోగాలు
రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవన విధానం సరిగా లేకుండా వచ్చే మధుమేహం, రక్తపోటు, ఊబకాయం.. వంటి వాటి వల్ల అనారోగ్యం బారినపడుతుంటారు. వీటిలో ముఖ్యంగా ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు.. ఇలా ఆరోగ్యాన్ని పెంచేవాటిని ఎలా సరైన విధంగా తీసుకోవాలో పరిశోధనలు చేశాను. దాదాపు పదహారేళ్లు్ల ఈ విభాగంలో చేసిన వర్క్ నాకు సరైన దిశను చూపింది. మూడేళ్లు చిరుధాన్యాలపైన చేసిన రీసెర్చ్ సంస్థ నెలకొల్పేలా చేసింది.
ప్రొటీన్ బార్
ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ పోషకాహారంతో కూడుకున్నదై ఉంటే ఆ రోజంతా చురుగ్గా పనిచేయగలం. ఆ దిశలోనే.. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్‌తో ప్రొటీన్ బార్, బ్రేక్‌ఫాస్ట్ బార్, ఇమ్యూనిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్‌లను రూపొందించాను. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్‌ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నాం. పోషకాల చిరుతిళ్ల తయారీ, సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలనుకునే వారికి ఉచితంగా శిక్షణా తరగతులను కూడా ఇస్తున్నామ’ని తెలియజేశారు ఈ పోషకాహార నిపుణురాలు.
- నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment