తిరుమలాయపాలెం : వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, కారుమబ్బులు కమ్ముకోవడంతో ఎంతో ఆశతో పత్తి విత్తనాలు వేసిన అన్నదాతలు ప్రస్తుతం కన్నీరు పెడుతున్నారు. వర్షాలు కురవకపోవడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొలకెత్తిన కొద్దిపాటి విత్తనాలు కూడా ఎండిపోతున్నాయి.
కళ్లెదుటే మొక్కలు ఎండిపోతుండడంతో తట్టుకోలేక అన్నదాతలు వాటిని రక్షించేందుకు తీవ్రపాట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి వాటిని బతికించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి నిత్యం కరువుకి గురయ్యే తిరుమలాయపాలెం మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. ఈ ఏడాది ఖరీఫ్ పంట వర్షాభావంతో ఇప్పటికే నెల రోజులు ఆలస్యం అయ్యింది.
అదును దాటిపోతోందని...
మండలంలోని రైతులు ప్రధానంగా పత్తి సాగు చేస్తుంటారు. సుమారు ఆరువేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో అదును దాటిపోతోందని ఇప్పటికే వేలాది ఎకరాల్లో రైతులు విత్తనాలు నాటారు. కానీ గత 15 రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. మండలంలోని కొక్కిరేణి, తిరుమలాయపాలెం, ఎర్రగడ్డ, తెట్టెలపాడు, వెదుళ్లచెరువు దమ్మాయిగూడెం, పాతర్లపాడు, హైదర్‌సాయిపేట, తిప్పారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఇప్పటికే రైతులు రెండుసార్లు పత్తి విత్తనాలు నాటి నష్టపోయారు.
దీంతో మండలంలోని రైతులు ఆర్థికంగా నష్టపోయారు. మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయల మేర అన్నదాతలు నస్టపోయారు. మండలంలోని మేడిదపల్లి, బీరోలు, సుబ్లేడు, రాజారం, పైనంపల్లి, బచ్చోడు, ఇస్లావత్‌తండా తదితర గ్రామాల్లో ప్రతి ఏడాది అధికంగా పెసర పంటను సాగుచేస్తున్నప్పటికి ఈ ఏడాది వర్షాలు లేక రైతులు ఆ పంట సాగు విరమించుకున్నారు. మండలంలో ఇంతటి వర్షాభావ పరిస్థితులు ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయా గ్రామాలలో మొలకలు వచ్చిన పత్తి మండుతున్న ఎండలతో ఎండిపోతుండడంతో తట్టుకోలేక వరుణ దేవుడు కరుణించకపోతాడా అనే ఆశతో రైతన్నలు సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెస్తూ పత్తి పాదులకు పోస్తూ కాపాడుతున్నారు. ఒకవైపు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అన్నదాతలు విత్తనాల కోసం ప్రైవేట్‌గా అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
క‘న్నీటి’ కష్టం..
Published Sat, Jul 5 2014 5:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement