సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పత్తి విత్తనాలను విక్రయించడం ద్వారా విత్తన కంపెనీలు ప్రతీ ఏడాది రూ.400 కోట్లు లాభం పొందుతున్నాయి. మోన్‌శాంటో కంపెనీ కేవలం రాయల్టీ ద్వారా రూ.20 కోట్లు గడిస్తుంది. కానీ రెండు మూడేళ్లుగా పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తుండటంతో పెద్దఎత్తున దిగుబడులు తగ్గి అన్నదాత నష్టాలపాలవుతున్నాడు. కానీ కంపెనీలు మాత్రం వందల కోట్లు గడించి భోగాలు అనుభవిస్తున్నాయి. పంట సర్వనాశనం అవుతున్నా పత్తి విత్తన ధరలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఏదో తూతూమంత్రంగా పది రూపాయలు తగ్గించి ప్రచారం చేసుకుంటుంది.
ఒక్కో ప్యాకెట్‌పై రూ.400 లాభం..
దేశవ్యాప్తంగా పత్తి విత్తన ధరలను ఖరారు చేస్తూ కేంద్ర వ్యవసాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజీ–1 రకానికి చెందిన 450 గ్రాముల విత్తనం ధరను రూ. 635గా, బీజీ–2 రకం విత్తనాల ధరను రూ.710గా ఖరారు చేసింది. మొదటి రకం విత్తనానికి ఎలాంటి పన్నులు లేదా రాయల్టీని వసూలు చేయడంలేదని, బీజీ–2 విత్తనాలకు మాత్రం రూ.20 చొప్పున నిర్ణయించినట్లు పేర్కొంది. ఆ ప్రకారం బీజీ–2 విత్తనం ధర 450 గ్రాములకు రూ.730గా ఖరారు చేసింది. ఒక్కో బీజీ–2 ప్యాకెట్‌కు రూ.730 ధర ఉంటే, అందులో రూ.330 వరకు పత్తి విత్తనం పండించిన రైతులకు చెల్లింపులు, ఇతరత్రా ఖర్చులు పోతాయి. అంటే నికరంగా రూ.400 ఒక్కో ప్యాకెట్‌పై కంపెనీలు లాభం పొందుతాయి. తెలంగాణలో ప్రతీ ఏటా కోటి ప్యాకెట్లు అమ్ముడవుతాయి. ఆ ప్రకారం ప్యాకెట్ల ద్వారా కంపెనీలు రూ. 400 కోట్లు లాభం గడిస్తాయని వ్యవసాయ నిపుణులు అంచనా వేశారు. విచిత్రమేంటంటే గతేడాదికంటే ఒక్కో ప్యాకెట్‌పై కేవలం పది రూపాయలు తగ్గించారు. దీనివల్ల రైతులకు ఒరిగేది ఏముంటుందనేది పెద్ద ప్రశ్న.
గులాబీ పురుగుతో నష్టాలపాలు...
బీజీ–2 పత్తి విత్తనం విఫలమైందని, దానివల్ల గులాబీ రంగు పురుగు దాడి చేసి ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని మూడేళ్ల కింద తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ఈ విత్తనం పనిచేయదని తేల్చి చెప్పాయి. అయినప్పటికీ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం బీజీ–2 విత్తనాన్ని రైతులకు అంటగడుతూనే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, 2018–19 ఖరీఫ్‌లో ఏకంగా 44.30 లక్షల (105%) ఎకరాల్లో సాగైంది. అయితే గులాబీ రంగు పురుగు కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని ప్రభుత్వ అర్థగణాంకశాఖ తన అంచనా నివేదికలో తెలిపింది.
ప్రత్యామ్నాయం లేక గందరగోళం..
బీటీ–2 టెక్నాలజీ పత్తి విత్తనం విఫలమైందని నిరూపితమైంది. దాని ప్రభావం పత్తి పంటపై పడుతూనే ఉంది. బీటీ–2 టెక్నాలజీ వైఫల్యంతోనే పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టి పీడించింది. అయితే బీటీ–3 పత్తి విత్తనాన్ని తీసుకొచ్చినా అది జీవవైవిధ్యానికి గండికొడుతుందని నిర్ధారించడంతో దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఏ పత్తి విత్తనం వేయాలన్న దానిపై గందరగోళం నెలకొంది. బీటీ–2కు ప్రత్యామ్నాయంగా మరో పత్తి విత్తనాన్ని పరిచయం చేయలేదు. పైగా విఫలమైన విత్తనాన్నే మళ్లీమళ్లీ రైతులకు అంటగడుతూ కంపెనీలకు వందల కోట్లు కట్టబెడుతున్నారు.
రాయల్టీని రద్దు చేయాలి
బీజీ–2 పత్తి విత్తనం విఫలమైంది. గులాబీరంగు పురుగును తట్టుకునే శక్తిని అది కోల్పోయింది. ఇక బీజీ–3 జీవవైవిధ్యానికి ముప్పు తెస్తుంది. కాబట్టి ఇప్పడు ఏ పత్తి విత్తనమూ రైతుకు శ్రేయస్కరం కాదు. రైతులను ఆహార పంటల సాగువైపు ప్రోత్సహించాలి. పత్తిపై మోన్‌శాంటో రాయల్టీని రద్దు చేయాలి. పైగా ఇప్పుడు పది రూపాయలు తగ్గించినట్లు చెబుతున్నారు. నష్టపోయిన రైతులకు ఈ తగ్గింపు వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు.
–నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment