సాక్షి, హైదరాబాద్: రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రానున్న వ్యవసాయ సీజన్ నుంచే దీన్ని అమలు చేసేందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వివిధ పంటల కొనుగోళ్లకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటిస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపకపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రహించిన ప్రభుత్వం అందుకు పరిష్కార మార్గాలు వెతుకుతోంది. అందులో భాగంగానే పంటల కొనుగోళ్ల కోసం ‘రివాల్వింగ్ ఫండ్’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికోసం రానున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లను కేటాయించనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
రైతుబంధుతో సంతృప్తి... మద్దతు ధర లేక అసంతృప్తి
విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు, అలాగే సాగు ఖర్చుల కోసం ప్రభుత్వం రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 8 వేలు ఇచ్చింది. అలా రెండు సీజన్లకు కలిపి రూ. 10 వేల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో ఆ సొమ్మును రూ. 10 వేలకు పెంచింది. దీనికోసం బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు కేటాయించింది. దీంతో రైతులకు ఎంతో ఊరట వస్తున్నా కొంత అసంతృప్తి ఉంది. రైతులకు ముందుగా ఇలా ఆర్థిక సాయం చేసినా పంట పండించాక దాన్ని సరైన మద్దతు ధరకు కొనకుంటే అసంతృప్తి ఉంటుందని కేసీఆర్ భావించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలను కొద్ది మొత్తంలో కొనుగోలు చేస్తున్నా.. పూర్తిస్థాయి పరిష్కారం దొరకడంలేదు. దీంతో రైతులు తమ పంటలను దళారులకు తెగనమ్ముకుంటున్నారు. ఉదాహరణకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యాయి. కందికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పీ క్వింటాకు రూ. 5,675... కానీ కేంద్రం పండిన పంటనంతటినీ కాకుండా కేవలం 70,300 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని షరతు విధించింది.
మిగిలిన కందులను రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితిని కేంద్రమే కల్పించింది. మరికొంత కొనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా 24,729 మెట్రిక్ టన్నులు ఎంఎస్‌పీ ఇచ్చి కొనుగోలు చేసింది. దీనికోసం ప్రభుత్వం రూ. 140 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఇక మొక్కజొన్న క్వింటాలుకు రూ.1,700 ఎంఎస్‌పీని కేంద్రం నిర్ణయించింది. కానీ కేంద్రం కొనుగోళ్లు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వమే రూ.708 కోట్లు పెట్టి మార్క్‌ఫెడ్ ద్వారా 4.16 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. అలాగే శనగలను రూ.103 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. బ్యాంకుల వద్ద అప్పులు చేసి వీటిని కొంటున్నా పూర్తిస్థాయిలో కొనలేని పరిస్థితి నెలకొంది. మొక్కజొన్న 17 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా, కేవలం 4.16 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేయాల్సి వచ్చింది. కందులు 3 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనలేకపోయాయి. అందుకే వెయ్యి కోట్ల రూపాయలతో రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తుంది.
మార్క్‌ఫెడ్‌లో మార్పులు...
మరోవైపు మార్క్‌ఫెడ్‌లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని సర్కార్ భావిస్తోంది. 33 జిల్లాలకుగాను ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌కు కేవలం 15 చోట్ల మాత్రమే జిల్లాస్థాయి అధికారులున్నారు. దీంతో పంట సేకరణ, కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించడంలో లోపాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాకు ఒక అధికారిని నియమించాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. దీనికోసం అవసరమైతే వ్యవసాయ, సహకార శాఖల నుంచి కొందరిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని యోచిస్తున్నారు. అలాగే మార్క్‌ఫెడ్‌కు పూర్తిస్థాయి ఎండీ లేరన్న భావన ఉంది. వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ ఎండీనే మార్క్‌ఫెడ్, హాకాలకు కూడా ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి పూర్తిస్థాయి ఎండీని నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు కంది, మొక్కజొన్న వంటి కొనుగోళ్ల కోసం కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంలేదన్న విమర్శలున్నాయి. సిబ్బంది కొరత తదితర కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది. అందువల్ల రానున్న సీజన్ల నుంచి ఎన్ని అవసరమైతే అన్నిచోట్లా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా దళారుల ఇష్టారాజ్యానికి చెక్ పెడతారు.
ఆన్‌లైన్‌లో తక్షణ చెల్లింపులు...
రైతుల నుంచి కొనుగోళ్లు జరపడం ఒక ఎత్తైతే, సకాలంలో వాళ్లకు డబ్బులు చెల్లించడం మరో ఎత్తు. దీనిలో ఘోరంగా విఫలమవుతుండటంతో రైతులు దళారులకు అమ్ముకోవడమే మేలన్న దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రైతుబంధు కోసం రైతుల వివరాలు సేకరించారు. మరోవైపు ప్రస్తుతం రైతుల సమగ్ర సమాచార సేకరణ జరుపుతున్నారు. వారి బ్యాంకు ఖాతాలతోపాటు వారు పండించే పంటలన్నీ కూడా అందులో నమోదవుతాయి. ఆ వివరాల ఆధారంగా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కొనుగోళ్లు జరిపిన వెంటనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము 24 గంటల్లోగా వెళ్లేలా ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారానే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఆ సంస్థనే నోడల్ ఏజెన్సీగా ఉంచాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment