సిరిసిల్లలో కాలేజీ అమ్మాయిలకు ట్యాబ్ పనిచేసే తీరును చూపుతున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే రూ.25 వేల కోట్ల రుణాలిస్తామని కేంద్రం చెప్పిందని, అయినా సీఎం కేసీఆర్ రైతుల పక్షానే నిలబడ్డారని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం వేర్వేరు కార్యక్రమాల్లో 6 వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లను, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీని ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధమైందని కేటీఆర్ మండిపడ్డారు.
దేశంలో టన్ను బొగ్గు రూ.3 వేలకు లభిస్తుంటే.. రూ.35 వేలకు టన్ను విదేశీ బొగ్గును కొనాలని కేంద్రం చెబుతోందని.. ఇదంతా ప్రధాని మోదీ కార్పొరేట్ మిత్రులకు ప్రయోజనం కలిగించేందుకేనని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ బిల్లు చట్టంగా మారితే రైతులకు ఉచిత కరెంటు, వివిధ వృత్తుల వారికి సబ్సిడీ విద్యుత్ పోతుందని పేర్కొన్నారు.
పేదలకు ఉచితాలు రద్దు చేయాలంటున్న మోదీ.. తన కార్పొరేట్ మిత్రులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయడం ఏమిటని నిలదీశారు. తెలంగాణ వడ్లు కొనాలని కోరితే నాలుగేళ్ల వరకు నిల్వలు ఉన్నాయన్న కేంద్రం.. ఇప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉందనడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఇప్పటివరకు నాలుగు ఎన్నికల్లో పోటీ చేశానని, ఏనాడూ చుక్క మందు పంచలేదని.. పైసా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు
సిరిసిల్ల కాలేజీ మైదానంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే 6 వేల మంది ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇలా 2020లో రాష్ట్రవ్యాప్తంగా 120 అంబులెన్స్‌లు పంపిణీ చేశామని, 2021లో 1,200 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, స్కూటీలు అందించామని వివరించారు.
ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని తెలిపారు. ఇక సిరిసిల్లలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన కేటీఆర్.. వస్త్రోత్పత్తిలో సిరిసిల్ల తమిళనాడులోని తిరువూరుకు దీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేతన్నల సంక్షేమానికి త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని.. అర్హులకు పెన్షన్లు, సొంత స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు మంజూరు చేయనున్నామని చెప్పారు.
బీజేపీ జోకర్లకు దమ్ము లేదు: కేటీఆర్
‘మనకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి నిలదీసేందుకు తెలంగాణకు చెందిన ఒక్క బీజేపీ జోకర్‌కు కూడా దమ్ములేదు. గుజరాత్ బాస్‌ల చెప్పులు మోసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే వీరికి తెలంగాణ హక్కుల గురించి నిలదీసి డిమాండ్ చేసే ధైర్యం లేదు’అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’మూలంగా తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలవలేకపోయిందని వచ్చిన ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ మోదీ నామస్మరణకు గుజరాత్ కేంద్రంగా నిలుస్తోందని ట్విట్టర్‌లో మండిపడ్డారు.
‘సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్‌ఎస్‌ది’అంటూ రెండురోజుల క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ‘లక్ష్మణ్ గారూ.. ఎవరి సొమ్ముతో మీరు సోకులు పడుతున్నారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర్‌ప్రదేశ్ సోకులు పడుతున్నది. దేశాభివృద్ధికి తెలంగాణ దోహద పడుతున్నందుకు కృతజ్ఞతలు తెలపండి.
లెక్కలు తెలుసుకోండి, ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం. కానీ, ప్రజలను మభ్యపెట్టకండి’అని వ్యాఖ్యానించారు. ‘కరువుపీడిత నేలగా ఉన్న తెలంగాణ ఈ రోజు 1.35 లక్షల ఎకరాల మాగాణం అయింది. నాడు సాగునీరు సరిపడాలేక నెర్రలు బారిన నేల నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతూ నూతన రికార్డులు సృష్టిస్తోంది. రైతుబంధు, నిరంతర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది’అని.. ‘పంటలు ఫుల్’శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment