సాక్షి, హైదరాబాద్: రైతును రాజును చేసే మనసు న్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా.. మూడు గంటల కరెంటు చాలు అంటున్న మోసకారి రాబందు కావాలా’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. ‘కేసీఆర్ నినాదం మూడు పంటలు.. కాంగ్రెస్ నినాదం మూడు గంటలు.. బీజేపీ విధానం మతం పేరిట మంటలు. వీటిలో ఏది కావాలో తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన సమయం ఇది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నడు.. నేడు మూడు పూటలు కరెంటు దండగ అంటున్నడు చోటా చంద్రబాబు’ అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు.
‘మూడు గంటల కరెంటుతో మూడు ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగమవుతుంది. మరోమారు రాబందు మూడు గంటల కరెంటు మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం.’’ అని హెచ్చరించారు.
రైతులకు కాంగ్రెస్ రెండో ప్రమాద హెచ్చరిక
తాము అధికారంలోకి వస్తే ధరణిని తొలగిస్తాం అని ప్రకటించిన రాబందు ప్రస్తుతం వ్యవసాయా నికి మూడు గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటున్నారని, ఇది రైతులకు కాంగ్రెస్ నోట వెలువడిన రెండో ప్రమాద హెచ్చరిక అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడు ఎకరాల రైతుకు మూడు పూటలా కరెంట్ ఎందుకు అనడం ముమ్మాటికీ సన్న చిన్నకారు రైతును అవమానించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిన్నకారు రైతు అంటే చిన్నచూపేనని ఆరోపించారు. నోట్లు తప్ప రైతుల పాట్లు తెలియని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమని, అన్నదాత నిండా మునుగుడు పక్కా అని పేర్కొన్నారు. నాడు ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయమని, ఎవరేమిటో గమనించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment