న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రైతులను మచ్చిక చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వ్యవసాయ రంగం సంక్షోభంపై ప్రతిపక్షాలతోపాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీంతోపాటు రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ బీజేపీ నేతలు, ఎంపీలు, వివిధ వర్గాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రైతులకు భారీ ఆర్థిక ప్యాకేజీపాటు పలు ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
దీనిపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ ప్రధాని మోదీకి ఇప్పటికే వివరించింది. ఇందులో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను చూపింది. ఏడు రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు, ఒడిశాలో ఇన్‌పుట్ సబ్సిడీ, తెలంగాణలో రైతు బంధు పథకం సహా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వంటివి ఇందులో ఉన్నాయి. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎన్నికల లోపే ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment