బియ్యానికి మార్కెట్ ఫీజు మినహాయింపు
- పత్తి, వరి ధాన్యంపై 1.5% వడ్డింపు
- ఫీజు పెంపుతో లోటును పూడ్చే యోచన
సాక్షి, హైదరాబాద్: బియ్యం, పత్తి విత్తనాలను మార్కెట్ ఫీజు వసూలు నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో లోటును పూడ్చేందుకు.. వరి ధాన్యం, పత్తిపై వసూ లు చేస్తున్న మార్కెట్ ఫీజును ఒక శాతం నుంచి 1.5 శాతానికి పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌యార్డులో అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలకు మార్కెటింగ్ ఫీజు ప్రధాన ఆదాయ వనరు. ఈ నేపథ్యంలో ఫీజు నుంచి బియ్యం, పత్తి విత్తనాలను మినహాయించడంపై మార్కెటింగ్ శాఖ అదనపు డెరైక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. బియ్యంపై మార్కెట్‌ఫీజు ద్వారా గత మూడేళ్లుగా సమకూరుతున్న ఆదాయాన్ని ఈ కమిటీ లెక్క గట్టింది. బియ్యాన్ని ఫీజువసూలు నుంచి మినహాయిస్తే రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్లు, పత్తి విత్తనాలను మినహాయిస్తే మరో రూ.14 కోట్ల నుంచి రూ.18 కోట్ల మేర మార్కెట్ కమిటీలు ఆదాయం కోల్పోయే అవకాశముందని కమిటీ పేర్కొంది. మొత్తంగా సుమారు రూ.70 కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశముందని అంచనా వేసింది.
పత్తి, వరి ధాన్యంపై వడ్డింపు
గతంలో వరి ధాన్యం, బియ్యం, పత్తి విత్తనాలు, పత్తిపై వేర్వేరుగా ఒక శాతం చొప్పున మార్కెటింగ్ ఫీజు వసూలయ్యేది. ఒకే సరుకుకు రెండు పర్యాయాలు మార్కెటింగ్ ఫీజు చెల్లించడం వ్యాపారులకు, వసూలు చేయడం మార్కెటింగ్ శాఖకు భారంగా పరిణమించింది. దీంతో మార్కెటింగ్ ఫీజు ఎగవేతకు వ్యాపారులు జీరో దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో మార్కెటింగ్ ఫీజును ఒకే విడతకు కుదిస్తూ అదనంగా 0.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పారదర్శకంగా మార్కెటింగ్ ఫీజు వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ వర్గాల విజ్ఞాపనలు, అదనపు డెరైక్టర్ నివేదికను మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇటీవల ప్రభుత్వానికి పంపారు. వీటిని బేరీజు వేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.