మల్దకల్ మండలం పెద్దపల్లిలో పత్తిపంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల బృందం (ఫైల్)
సాక్షి, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో పత్తి విత్తన కంపెనీల బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి, వారి భూములను లీజుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించి ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టినట్లు తేలిన విషయం విదితమే. ఇది మరువక ముందే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీటీ3 విత్తనాలను గద్వాల కేంద్రంగా విత్తన కంపెనీలు సాగు చేయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల బృందం, డీఎన్‌ఏ పరిశోధన సంస్థ నిర్ధారించడం గమనార్హం.
ఈ ఏడాది జనవరి 18న కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రతినిధులు జిల్లాలో పర్యటించి 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి తీసుకెళ్లారు. వీటిని ఢిల్లీలోని ల్యాబ్‌లో పరీక్షించగా ఆ శాంపిళ్లలో బీటీ3 విత్తనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిసింది. అదే నెలలో గద్వాలలోని మార్కెట్ యార్డు, ఇటిక్యాల మండలంలోని ఓ గోదాంలో అధికారులు సేకరించి న షాంపిళ్లలోనూ బీటీ3 పత్తి విత్తనాలు వాడినట్లు తేలిం ది. 60 షాంపిళ్లకుగాను ఆరు షాంపిళ్లలో నిషేధిత హెచ్‌టీ రకం పత్తి విత్తనాలున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీం తో ఆ కంపెనీలపై కేసుల నమోదుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
చర్యలు తీసుకుంటున్నాం..
పరీక్షలకు పంపిన 60 షాంపిళ్లలో 6 షాంపిళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిలేని, గడ్డి మందును తట్టుకునే హెచ్‌టీరకం పత్తివిత్తనాలు ఉన్నట్లు తేలింది. స్టాక్‌ను సీజ్ చేశాం. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో పాటు, సంబంధిత కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. త్వరలో కేసులు నమోదు చేస్తాం.
గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment