రహస్యంగా కేంద్ర బృందం పర్యటన | Secret Central team tour | Sakshi
Sakshi News home page

రహస్యంగా కేంద్ర బృందం పర్యటన

Published Tue, Jan 23 2018 9:13 AM | Last Updated on Tue, Jan 23 2018 9:13 AM

Secret Central team tour - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌):  బీజీ–3 పత్తి విత్తనాలను పరిశీలించేందుకు వచ్చిన  కేంద్ర బృంద సభ్యులు సోమవారం జిల్లాలో రహస్యంగా పర్యటించారు. విత్తన కంపెనీల ప్రతినిధులను కలవనీయకుండా, రైతులతో సమావేశాలు నిర్వహించకుండానే వీరి పర్యటన సాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నాగపూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రీసెర్చ్‌ (సీఐసీఆర్‌) బయోటెక్నాలజీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, కేంద్ర వ్యవసాయశాఖ ప్లాంట్‌ ప్రొడక్షన్‌ జేడీఏ ఏఎన్‌ సింగ్, ఇతర ప్రముఖులు బాలకృష్ణ, ఎస్‌జే రహిమాన్, శ్రీవత్స, చక్రవర్తి, వీఎస్‌రెడ్డి, బాలసుబ్రమణి, ఎస్‌ఆర్‌ రావుతో పాటు జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కమిషనరేట్‌ జేడీఏ రామరాజు, శాస్త్రవేత్తలు చెంగారెడ్డి, రామారెడ్డి, జయకృష్ణ జిల్లాలో పర్యటించారు. ముందుగా వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కేంద్ర బృంద సభ్యులు.. రైతులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై బీజీ–3 పత్తి విత్తనాలపై అభిప్రాయాలు సేకరించాల్సి ఉంది. ఇవేవీ లేకుండా పర్యటన ముగించారు. 

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మోన్‌శ్యాంటో కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ ఉన్నతాధికారే కేంద్ర బృందం ప్రతినిధులతో రైతులు, విత్తన మేనేజర్లు కలవకుండా అడ్డుపడినట్లు తెలుస్తోంది. విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశమైతే వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీలు, దాడులతో పాటు బీజీ–3కి కేంద్ర అనుమతి లేదన్న విషయాన్ని గోప్యంగా ఉంచడంపై విరుచుకుపడే ప్రమాదం ఉందని, దీనివల్ల కేంద్రానికి వ్యతిరేక నివేదిక వెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. జిల్లాకు వచ్చిన కేంద్ర బృందంలో ఎనిమిది మంది ఉన్నతాధికారులు ఉన్నారు. వీరు ముందుగా కర్నూలులోని గౌతమీసీడ్స్, కర్నూలు సీడ్స్‌లో తనిఖీలు నిర్వహించారు. పత్తి విత్తనాలను కాకుండా పత్తి శ్యాంపిల్స్‌ సేకరించినట్లు సమాచారం. తర్వాత గూడూరు మండలంలోని పత్తి పొలాల్లోకి వెళ్లి ఆకులను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దొర్నిపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో సాగైన బీజీ–2 పత్తి  పంటను పరిశీలించి..ఆకులు, పత్తి, కాయల శ్యాంపిల్స్‌ తీసినట్లు తెలుస్తోంది. కేంద్ర బృందం పర్యటన గురించి వ్యవసాయ అధికారులను సంప్రదించగా.. ఎవరూ వరాలను వెల్లడించలేదు. కేంద్ర బృందం సభ్యులు మీడీయాకు సమాచారం ఇవ్వొద్దని చెప్పారంటూ కనీసం ఎక్కడెక్కడ పర్యటించిందీ వెల్లడించకపోవడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement