ఇదీ విషయం! | Audits On BT Cotton Seeds Centres | Sakshi
Sakshi News home page

ఇదీ విషయం!

Published Wed, Apr 4 2018 12:16 PM | Last Updated on Wed, Apr 4 2018 12:16 PM

Audits On BT Cotton Seeds Centres - Sakshi

కల్లూరు రైతుకు బీటీ–2 పేరుతో బీటీ–3 విత్తనాలు ఇచ్చిన ప్యాకెట్‌

బీటీ–3 హెచ్‌టీ పత్తి విత్తనాలు పర్యావరణానికి.. జీవవైవిధ్యానికి హానికరమని, వాటిలో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. దీంతో  ఈ విత్తనాల తయారీకి, విక్రయానికి కేంద్రప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినా, కార్పొరేట్‌ విత్తన సంస్థలు, బహుళ జాతి కంపెనీలు గుట్టుచప్పుడు కాకుండా బీటీ–3 పత్తి విత్తనాల దందా సాగిస్తున్నాయి. ఇందుకు కర్నూలు జిల్లాను కేంద్ర బిందువుగా చేసుకున్నాయి.    గతేడాదిలాగే ఈ సారి కూడా వ్యవసాయాధికారుల కళ్లుగప్పి బీటీ–3 పత్తి విత్తనాలను రైతులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయని సమాచారం.  

కర్నూలు(అగ్రికల్చర్‌):       జిల్లాలో  బీటీ–3 పత్తి విత్తనాల దందా  జోరందుకుంది.  ఇటీవల వ్యవసాయశాఖాధికారులు ఆదోనిలోని వివిధ విత్తన దుకాణాల్లో తనిఖీలు జరిపి బీటీ–2 ముసుగులో బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారని గుర్తించారు. బీటీ–2 పేరుతో బీటీ–3 విత్తనాలు ఉన్న ప్రో సీడ్, సాయి భవ్య( నూజివీడు), మై సీడ్‌ కంపెనీలకు చెందిన 384 ప్యాకెట్లను సీజ్‌ చేశారు. ఈ విత్తన విక్రయం ఆదోనిలో ఒక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా ఉంది.   బీటీ– 3ని ట్రయల్‌ రన్‌గా నిర్వహించేందుకు విత్తన కంపెనీలు అక్రమ మార్గాల్లో  వాటిని మార్కెట్‌లోకి తెస్తోన్నాయి. అయితే వ్యాపారులు మాత్రం కమర్షియల్‌ పత్తి సాగుకు బీటీ–2 పేరుతో ఉన్న బీటీ–3 విత్తనాలనే ఇస్తున్నట్లు తెలుస్తోంది. జీవవైవిధ్యానికి, పర్యావరణానికి హానికరమని   కేంద్రప్రభుత్వం హెచ్చరిస్తున్నా కార్పొరేట్‌ కంపెనీలు పట్టించుకోకుండా కర్నూలు జిల్లాను బీటీ–3 విత్తన ప్రయోగశాలగా మార్చి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి.

గత ఏడాది జిల్లాలో భారీగా సాగు
గతేడాది  జిల్లా వ్యాప్తంగా 10వేల హెక్టార్లలో బీటీ– 3 పత్తి విత్తనాలు   సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  బీటీ–2 పేరుతోనే ఆ విత్తనాలను రైతులకు  సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఆ విత్తనాలను గుర్తించలేక చాలా మంది రైతులు వాటిని సాగు చేసి ఇబ్బందులు పడ్డారు.  బీటీ– 1లో పచ్చపురుగును తట్టుకునే జన్యువు ఉంటే బీటీ–2లో  పొగాకు లద్దెపురు, గులాబీరంగు పురుగును తట్టుకునే జన్యువు ఉంటుంది. అదే బీటీ–3లో ప్రమాదకరమైన  గ్లైపోసేట్‌ కలుపు మందు జన్యువు ఎక్కిస్తారు.  ఈ విత్తనం సాగు తర్వాత రైతులు పంటలో కలుపు నివారణకు  గ్లెసెల్‌ కెమికల్‌ మందును విచ్చలవిడిగా వాడటంతో   విష ప్రభావానికి గురయ్యారు.

కార్పొరేట్‌ సంస్థలపై చర్యలు ఏవీ?
కల్లూరు మండలంలో బీటీ–2 విత్తనోత్పత్తి చేసే ఓ రైతు ఇటీవల ఆకాశ్‌–8888 బీటీ–2 విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. అనుమానం వచ్చి  వాటిని పరీక్ష చేస్తే బీటీ–3 విత్తనాలున్నాయి.  ఈ విత్తనాల  సాగు   ప్రమాదమని వాటిని పక్కన పడేశారు. ఇలా గుట్టుగా  బీటీ–3 విత్తనాలు రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిసినా వ్యవసాయశాఖాధికారులు ఎందుకో కఠినంగా వ్యవహరించడం లేదు.   చిన్న కంపెనీలు, కింది స్థాయి అధికారులపై ప్రతాపం చూపుతూ కారణమైన బహుళజాతి కంపెనీలను మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే
విమర్శలు వినిపిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement