విత్తన చోరులకు రాయల్టీలెందుకు? | Seed Choru Royalty why? | Sakshi
Sakshi News home page

విత్తన చోరులకు రాయల్టీలెందుకు?

Published Wed, Jan 21 2015 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

విత్తన చోరులకు  రాయల్టీలెందుకు?

విత్తన చోరులకు రాయల్టీలెందుకు?

జన్యుమార్పిడి పత్తి విత్తనాలు విత్తన పరాధీనతకు దారితీశాయి. సమాజ సొత్తయిన స్థానిక విత్తనాలను కంపెనీల గుత్తాధిపత్యం నుంచి కాపాడుకునే దిశగా ైరె తులు కదలాలి. ఇందుకు తగిన రక్షణ చట్టాలను ప్రభుత్వం రూపొందించాలంటున్నారు ప్రొఫెసర్
 ఎన్. వేణుగోపాలరావు
 
వ్యవసాయంలో భూమి, నీరు తరువాత అత్యంత కీలకమైనవి పంట విత్తనాలు. హరిత విప్లవంలో విత్తనాల అభివృద్ధికి ప్రముఖ స్థానమిచ్చారు. నార్మన్ బోర్లాగ్‌నో, స్వామినాథన్‌నో, వ్యవసాయ విశ్వవిద్యాలయాలనో, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలనో తరచుగా రైతులు మననం చేసుకోటానికి ముఖ్య కారణం ఆ వ్యక్తులు, సంస్థలు ప్రవేశపెట్టిన నూతన తరం విత్తనాలే. అన్ని ముఖ్య పంటల మూల విత్తనాలు రైతులు అనాదిగా  కాపాడుకుంటున్నవే. మంచి వ్యక్తీకరణ(గింజ, కాండం, వేరు, ఆకు, కాయ) గల పంట రకాన్ని గుర్తించటంలో, సంకరపరిచే నైపుణ్యతలను పెంపొందించు కోవటంలో రైతులు, గిరిజన జాతుల పాత్ర కాదనలేనిది. ప్రస్తుతం మనం రూపొందించుకున్న మెరుగైన వంగడాలకు, హైబ్రిడ్‌లకు మూలాలు ఆ విత్తనాలే. కానీ, విత్తనం ఇప్పుడు కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయే దుస్థితి నెలకొంది.

జన్యువైవిధ్యత, పెరుగుదల, వ్యక్తీకరణల వైవిధ్యాలున్న పంట మొక్కలెక్కువగా ఉష్ణ లేక సమశీతోష్ణ ప్రాంతాల్లో.. అనగా సంపదల్ని పోగెయ్యటంలో వెనుకబడ్డ(ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా) దేశాల్లో రూపొందాయి. ఈ వైవిధ్యం సంపన్న ఐరోపా, ఉత్తర అమెరికాలలో చాలా తక్కువ. అయినా జన్యుపరంపరాధారిత సైన్స్ వెలుగులో ఉద్భవించిన సాంకేతికాల ద్వారా కృత్రిమంగా పంట మొక్కల్లో జన్యువైవిధ్యతను రూపొందించగలిగాయి ధనిక దేశాలు. శాస్త్రవేత్తలు ఇతర సాంకేతికాలతో పాటు విత్తన సాంకేతికాల్ని కూడా వాణిజ్య ఆయుధాలుగా మార్చారు. అదిగో ఆ నేపథ్యంలో ప్రపంచమంతా విస్తరించినదే ‘హరిత విప్లవం’. సామాజిక స్పృహతో విస్తృతపరచిన సంపదలు సార్వత్రిక, సర్వజన పరమైన నేపథ్యంలో ఈ టెక్నాలజీలు రూపొందాయనేది అతి ముఖ్యవిషయం.
 
మార్కెట్ శక్తుల చేతికి..

ఐతే హరిత విప్లవ విస్తరణ మలి దశలో ప్రపంచ దేశాల రాజకీయ వ్యవస్థలు మారుతూ వచ్చాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల్ని  పర్యావరణ పటిష్టత(సుస్థిరత)ను కాపాడగల ప్రభుత్వాల స్థానంలో మార్కెట్ శక్తుల ద్వారా నియంత్రిచబడే పాలకులొచ్చారు. సైన్స్, టెక్నాలజీ పూర్తిగా వ్యాపార వర్గాల పరిష్వంగంలో చేరిపోయాయి. పేటెంట్ చట్టాలు, రాయల్టీలు వంటి వాటి ముసుగులో అన్ని వనరులతో అటు వ్యవసాయ వనరులను ప్రజల నుంచి దూరం చేసే ఒరవడి మొదలైంది. అదిగో ఆ నేపథ్యంలో వెలుగు చూసిన జన్యుమార్పిడి పంట విత్తనాలు పూర్తిగా ప్రభుత్వ(ప్రజా) సంస్థలకు దూరమై వ్యాపార వర్గాల అజమాయిషీలోకెళ్లాయి. జన్యుమార్పిడి విత్తనాల ద్వారా దిగుబడులు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయనే కంపెనీల ప్రచార హోరులో ప్రభుత్వాలు, శాస్త్త్రవేత్తలు, రైతులు కొట్టుకుపోయే స్థితిని తెచ్చారు. భారత వ్యవసాయరంగం చుట్టూ ఎంత పెద్ద కుట్ర అల్లుకున్నదో చూడండి..
 
బీటీ పత్తి ప్రహసనం


బీటీ హైబ్రిడ్ వంగడాల వల్ల పత్తి దిగుబడులు అనూహ్యంగా పెరిగినట్లు మోసపూరిత ప్రచారాలు మొదలెట్టి ఇటువంటి టెక్నాలజీల్ని వరి వంటి ఇతర పంట విత్తనాల్లోకి  ప్రవేశపెట్టే నేపథ్యాన్ని సృష్టించారు. కేంద్రంలో ప్రభుత్వం మారగానే కంపెనీలు, ముఖ్యంగా మోనోశాంటో, తమ విత్తన కుట్ర ఆచరణకు నడుం బిగించాయి. జన్యుమార్పిడి బీటీ విత్తనాల విషయంలో ఇప్పటి వరకూ సరైన సమాచారాన్ని ఏ కంపెనీ కూడా ప్రభుత్వాల ముందు.. శాస్త్ర, సాంకేతిక సంస్థల ముందు ఎందుకు ఉంచలేకపోతున్నాయని నోబెల్ బహుమతి గ్రహీతలైన జీవ సాంకేతిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

బీటీ హైబ్రిడ్ విత్తనంతోనే పత్తి దిగుబడులు పెరిగాయనేది వాస్తవమైతే, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా దేశాల్ల్లో కేవలం బీటీ జన్యువున్న సూటి రకాలే ఎందుకు సాగు చేసున్నట్లు? అక్కడి సగటు దిగుబడులు మనకంటే ఎక్కువేననే నిజాన్ని కంపెనీలు ఎందుకు దాస్తున్నట్లు?

జీవుల్ని, జంతువుల్ని గుత్త సొమ్ముగా మార్చుకోవటం అనైతికమనే ప్రపంచ స్థాయి ఒప్పందాన్ని మోన్‌శాంటో కంపెనీ ఎందుకు ధిక్కరిస్తున్నట్లు?

     
బీటీ హైబ్రిడ్ విత్తనాలకు మూలాధారాలుగా నిలిచిన పత్తి వంగడాలు రైతుల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చినవే. వాటికి కంపెనీలు ఎంత రాయల్టీలు చెల్లిస్తున్నాయి?  

బీటీ హైబ్రిడ్ విత్తన ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే కంపెనీలు రైతులకు అమ్ముతున్న ధర చాలా ఎక్కువ. దానిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోగా ప్రభుత్వ సంస్థల ద్వారా కంపెనీలు ఎక్కువ ధరలకు రైతులకు అమ్మడం ఎంతవరకూ వ్యాపార నీతి?  
     
బీటీ హైబ్రిడ్ పత్తిని వర్షాధారంగానూ, అల్ప భూసార నేలల్లోనూ సాగుచేసే స్థితికి తీసుకురావటానికి ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం, కంపెనీల ప్రచార హోరు కారణం. దీనికి జవాబుదారీ ఎవరు?  

     
బీటీ పత్తివల్ల సస్యరక్షణ రసాయనాల వాడకం తగ్గిందనే ప్రచారంలో హేతుబద్ధతెంత? అతి తక్కువ ప్రమాణాల్లోనే ఘాటు విషాల్ని వదలగల నూతన రసాయనాల్ని పాత విష రసాయనాల్తో పోల్చగలమా?
     
బీటీ హైబ్రిడ్ మాయలో పడి పోగొట్టుకుంటూ పోతున్న దేశీయ, స్థానిక పత్తి రకాల్ని ఎవరు పునరుద్ధరించగలరు? బీటీ పత్తి పేరుతో నడిచిన కుట్ర విత్తన పరాధీనతకు దారితీసింది. ఇది మనకు పాఠం నేర్పాలి! విత్తనాల్ని కాపాడుకునే ఉద్యమంలో రైతుల పాత్ర పెరగాలి. ఇందుకు తగిన రక్షణ చట్టాల్ని ప్రభుత్వం రూపొందించాలి. (వ్యాసకర్త గుంటూరులోని రైతు రక్షణ వేదిక కన్వీనర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ విశ్రాంతాచార్యులు. nvgrao2002@yahoo.com)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement